వివాహేతర సంబంధం ఓ వివాహిత ప్రాణాలు తీసింది. భర్తను కాదని.. తనకన్నా వయసులో చిన్నవాడితో సంబంధం పెట్టుకోవడమే ఆమె చేసిన నేరం. ఆమె ప్రియుడి చేతిలో ఆమె దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన వరంగల్ జిల్లా హసన్ పర్తి మండలం పెంబర్తి శివారులోని మొక్కజొన్న చేనులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... పెంబర్తికి చెందిన కొయ్యడ చంటి అలియాస్ పున్నంచందర్(26) ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు వరంగల్ జిల్లా దామెర మండలం సింగరాజుపల్లికి చెందిన మంద రూప(32) తో ఐదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఐదేళ్లపాటు బాగానే బంధం సాగినప్పటికీ... ఈ మధ్య వారి మధ్య కలతలు రావడం మొదలైంది.

Also Read హైద్రాబాద్‌లో బ్రిడ్జిపై నుండి కారు బోల్తా: ఒకరు మృతి, నలుగురికి గాయాలు...

తనను సరిగా పట్టించుకోవడం లేదని రూప... చంటిని సతాయించడం మొదలుపెట్టింది. దీంతో... ఆమెను వదిలించుకోవాలని అతను ఎప్పటి నుంచో చూస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 16న రూప ఫోన్ చేయడంతో చంటి ఆటో తీసుకొని పలివేల్పుల రోడ్డులోని హాస్టల్ వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో రూప ఆటోకు సంబంధించిన తాళం చెవితోపాటు చరవాణిని తీసుకుంది.

రూపను తప్పించడానికి ఇదే సరైన సమయమని అతను భావించాడు. ఈ క్రమంలో ఆమెను  చంపేందుకు ప్లాన్ వేసుకున్నాడు.  పెంబర్తి శివారులోని మొక్కజొన్న పొలంలోకి తీసుకువెళ్లి ... అక్కడ ఓ కర్రతో ఆమె తలపై ఇష్టానుసారంగా కొట్టి హత్య చేశాడు. 

అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే...ఎలాగైనా తాను పోలీసులకు దొరికిపోతానేమో అనే భయం అతనిలో కలిగింది. దీంతో... ఆ తర్వాతి రోజు తానంత తానే వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని రెండు రోజుల్లో కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు చెప్పారు.