నేను అలా చేయడంవల్లే కూతురు కవిత కటకటాలపాలు : కేసీఆర్ ఎమోషనల్

తన కూతురు కవిత డిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ కావడంపై మొదటిసారి స్పందించారు కేసీఆర్. అధికారంలో వుండగా తాను చేసిన పనులే ఇప్పుడు కవిత అరెస్ట్ కు కారణమయ్యాయని కేసీఆర్ అన్నారు. 

BRS Chief KCR reacts on his daughter Kavitha Arrest AKP

హైదరాబాద్ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అసెంబ్లీ  ఎన్నికల్లో ఓటమితో అధికారం కోల్పోవడం, గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లో జంప్ అవుతుండటం, రేవంత్ సర్కార్ కాళేశ్వరం, విద్యుత్ కొనుగోలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ... ఇలా కేసీఆర్ కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఇది చాలదన్నట్లు ఇంతకాలం డిల్లీ లిక్కర్ స్కాంలో కూతురు కవిత అరెస్ట్ కాకుండా చూసినా... సరిగ్గా లోక్ సభ ఎన్నికలకు ముందు ఆమెను ఈడీ అరెస్ట్ చేసింది. ఇలా జైల్లో వుండగానే సిబిఐ కూడా మరోసారి కవితను అరెస్ట్ చేసింది. ఇలా కవితను తీహార్ జైలుకు వెళ్లి నెల రోజులకు పైగా అవుతోంది... ఇంతకాలం కూతురు అరెస్ట్ పై ఒక్కసారి కూడా స్పందించని కేసీఆర్ తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేసారు. 

కూతురు అరెస్ట్ పై కేసీఆర్ ఏమన్నారు... 

తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు మే 13న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో నిన్న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమయ్యింది. దీంతో ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు లోక్ సభ అభ్యర్థులు, కీలక నాయకులతో బిఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే మొదటిసారి కూతురు కవిత అరెస్ట్ పై స్పందించారు. 

గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించింది... దాన్ని ముందే పసిగట్టి తాము అడ్డుకున్నామని కేసీఆర్ గుర్తుచేసారు. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన బిజెపి నాయకుడు బిఎల్ సంతోష్ పై కేసులు పెట్టడం, అరెస్ట్ కు ప్రయత్నించడమే ఇప్పుడు తన కూతురు అరెస్ట్ కు కారణం అయ్యిందన్నారు. 

బిఎల్ సంతోష్ పై కేసులు పెట్టడంతో కేంద్రంలోని బిజెపి సర్కార్ తమపై కక్ష గట్టిందని కేసీఆర్ అన్నారు. అందువల్లే తన కూతురు కవితను అక్రమ కేసుల్లో ఇరికించి అరెస్ట్ చేసారని ఆవేదన వ్యక్తం చేసారు. డిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర వుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు... ఆమె రూ.100 కోట్లు కాదు 100 రూపాయల తప్పు కూడా చేయలేదని అన్నారు.  ఆనాడు తప్పుచేసిన బిఎల్ సంతోష్ ను శిక్షించడానికి గట్టిగా ప్రయత్నించి వుండకుంటే ఈనాడు కవిత అరెస్ట్ వుండేది కాదని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తన కూతురు అరెస్ట్ రాజకీయ కుట్రేనని కేసీఆర్ అన్నారు. 

కేసీఆర్ మాటలను బట్టి చూస్తే తనవల్లే కూతురు అరెస్ట్ అయ్యిందని ఆయన భావిస్తున్నట్లు అర్థమవుతోంది. అయితే ఇలా తన కుటుంబసభ్యులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లలో నిర్భందించిన భయపడబోననే సంకేతాలను తన మాటలద్వారా అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు అందించారు. త్వరలోనే మళ్లీ పాత కేసీఆర్ ను చూస్తారని... తెలంగాణ ఉద్యమకాలంలో మాదిరిగా పోరాటానికి సిద్దం అవుతున్నట్లు కేసీఆర్ తెలిపారు. 


 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios