బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపులో మోడీ వివక్ష రాజకీయం: కేంద్ర మంత్రి మాండవీయకు కేటీఆర్ లేఖ
బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపులో తెలంగాణకి మొండిచేయి చూపారని తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణకు కాకుండా ఇతర రాష్ట్రాలకు బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించడంపై ఆయన మండిపడ్డారు. వెంటనే తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్క్ ను కేటాయించాలని కేటీఆర్ కేంద్ర మంత్రికి లేఖ రాశారు.
హైదరాబాద్: బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపులో తెలంగాణకి నరేంద్ర మోడీ సర్కార్ మొండి చేయి చూపిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ పై వివక్షతో దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని కేంద్రంపై కేటీఆర్ మండిపడ్డారు. ఈ మేరకు కేంద్ర కెమికల్, ఫెర్టిలైజర్ శాఖ మంత్రి మాండవీయాకి కేటీఆర్ లేఖ రాశారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పుతున్న హైదరాబాద్ ఫార్మాసిటీ అత్యంత అనుకూలమనే విషయాన్ని మంత్రి కేటీఆర్ ఆ లేఖలో గుర్తు చేశారు. భూసేకరణ, పర్యావరణ అనుమతులు, మాస్టర్ ప్లానింగ్ తో సిద్ధంగా ఉన్న ఫార్మా సిటీని కావాలనే కేంద్రం విస్మరించిందని ఆయన మండిపడ్డారు. తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బల్క్ డ్రగ్ పార్క్ పథకంలో తెలంగాణకు చోటు దక్కకపోవడమే ఇందుకు సాక్ష్యమని కేటీఆర్ చెప్పారు.
బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలను ఎంపిక చేయడం మోడీ సర్కార్ వివక్షపూరిత రాజకీయాలకు పరాకాష్టగా కేటీఆర్ పేర్కొన్నారు. బల్క్ డ్రగ్ తయారీలో దేశీయ ఫార్మా రంగం స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో 2015 లో 2000 ఏకరాల్లో వివిధ రాయితీలు, ప్రోత్సహకాలతో బల్క్ డ్రగ్ పార్క్ లను ఏర్పాటు చేసే పథకాన్ని కేంద్రం తెరపైకి తీసుకువచ్చిందన్నారు.
ఎన్నో సార్లు బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కోసం కేంద్రాన్ని కోరుతున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.
బల్క్ డ్రగ్ పార్క్ ను తెలంగాణకు కేటాయించాలని కేంద్ర ఫార్మాసూటికల్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతిపాదనలను సమర్పించిన విషయాన్న కేటీఆర్ ఆ లేఖలో ప్రస్తావించారు. హైదరాబాద్ ఫార్మాసిటీ లోని 2000 ఎకరాల్లో ఈ బల్క్ డ్రగ్ పార్క్ ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్రానికి స్పష్టంగా తెలిపామన్నారు.. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలని 2015లో ని నరేంద్ర మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుందన్నారు. కానీ ప్రతిపాదనల పరిశీలన, ఇతరత్రా కారణాలతో 2021 వరకు టైంపాస్ చేసిందని కేటీఆర్ విమర్శించారు.
కేంద్రం ప్రకటించిన జాబితాలో తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్క్ దక్కకపోవడం తమను షాక్ గురించేసిందని మంత్రి కేటీఆర్ అన్నారు. కొత్తగా బల్క్ డ్రగ్ పార్క్ ను ఏర్పాటు కు భూసేకరణ, ప్లానింగ్, డిజైన్, పర్యావరణ, ఇతర అనుమతులు తీసుకోవడానికే కనీసంగా మూడేళ్ల సమయం పడుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.చైనాతో ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తతల దృష్ట్యా సాధ్యమైనంత త్వరగా దేశీయ ఫార్మా రంగం స్వయం సమృద్ధిని సాధించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
బల్క్ డ్రగ్ పార్క్ ల ఏర్పాటులో అన్ని రకాల అనుకూలతలు, అనుమతులు ఉన్న ఫార్మాసిటీని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా నరేంద్ర మోడీ సర్కార్ వివక్షను చూపిందని ఆయన విమర్శించారు..తెలంగాణ రాష్ట్రానికి బల్క్ డ్రగ్ పార్క్ ను కేటాయిస్తే వెంటనే పని ప్రారంభించవచ్చనే కనీస సోయి కేంద్ర ప్రభుత్వానికి లేకపోవడం దేశ ప్రజల దురదృష్టకరంగా కేటీఆర్ పేర్కొన్నారు.
నరేంద్రమోడీ సర్కార్ నిర్వాకంతో దిగుమతుల కోసం విదేశాలపై ఆధారపడుతున్న ఫార్మా పరిశ్రమకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. బల్క్ డ్రగ్ తయారీ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్న ఆశయానికి మోడీ సర్కార్ తూట్లు పొడిచిందని ఆ లేఖలో కేటీఆర్ విమర్శించారు. .మోడీ సర్కార్ నిర్ణయంతో తెలంగాణతో పాటు యావత్ దేశం కూడా భారీగా నష్టపోతుందన్నారు.
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అనేక వినూత్న విభాగాల సమాహారంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న హైదరాబాద్ ఫార్మాసిటీకి జాతీయ ప్రాధాన్యత కలిగిందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ట్రస్ట్ కింద హైదరాబాద్- వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టు ప్రాధాన్యతను దక్కించుకుందన్నారు. .
ఫార్మాసిటీ ప్రాధాన్యతను గుర్తించి ప్రశంసించిన కేంద్రమే బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటులో హైదరాబాద్ ని విస్మరించడం ఆశ్చర్యానికి గురి చేసిందన్న కేటీఆర్ పేర్కొన్నారు.. బల్క్ డ్రగ్ పార్కుల కేటాయింపులో తెలంగాణని విస్మరించడమంటే దేశీయ ఫార్మా రంగం పురోగతిని దారుణంగా దెబ్బతీయడమే అని కేటీఆర్ విమర్శించారు.
రాజకీయ ప్రజయోజనాల కోసం దేశ ప్రయోజనాలను పణంగా పెట్టొద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ఫార్మాసిటీని అద్భుతంగా తీర్చిదిద్దుతున్న తమ ప్రయత్నాలకు చేదోడు వాదోడుగా నిలవాలని కేంద్రాన్ని కోరారు.