వేరే యువతిపై ఏర్పడ్డ మోజుతో.. భార్యను వదిలించుకోవాలనుకున్నాడు. మాములుగా విడాకులంటే భార్య ఒప్పుకోదేమో అనే అనుమానంతో...ఆమెను మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. వేరే మహిళతో సెక్స్ చేస్తున్నప్పటి ఫోటోలు, వీడియోలు భార్యకు పంపడం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగలేదు.. భార్య చిత్రాలను కూడా సోషల్ మీడియాలో పెట్టడం మొదలుపెట్టాడు. చివరకు భార్య ఫిర్యాదులో జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... వనస్థలిపురం ఎస్‌కేడీనగర్‌కు చెందిన ఆలపాటి తులసీదాస్‌ ఆస్ట్రేలియాలో బీబీఏ చదివి వచ్చాడు. హైదరాబాద్‌లోనే వ్యాపారం చేస్తూ ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. గత ఏడాది బంజారాహిల్స్‌లో జరిగిన ఓ సమావేశంలో అతడికి ఓ మహిళ పరిచయం అయింది. 

మాదాపూర్‌ హైటెక్‌సిటీ పత్రికానగర్‌లోని ఓ సంస్థలో పనిచేస్తున్న ఆమె విబేధాల కారణంగా భర్తతో గత మేలో విడాకులు పొందింది. ఈక్రమంలో తులసీదాస్‌తో ఆమె పరిచయం ముదిరి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ వ్యవహారంపై తులసీదాస్‌ భార్య వనస్థలిపురం ఠాణాలో ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్ట్‌ చేశారు. 

ఈ నేపథ్యంలో భార్యపై తులసీదాస్‌ కక్ష పెంచుకున్నాడు. దీనికితోడు తాము చట్టబద్ధంగా ఒక్కయ్యేందుకు ఆమె అడ్డంకిగా మారిందని తులసీదాస్‌, ఆ మహిళ భావించారు. భార్య నుంచి తనకు విడాకులు లభిస్తే ఆమెతో కలిసి జీవించొచ్చని తులసీదాస్‌ నిర్ణయానికి వచ్చాడు. ఈమేరకు ఆ మహిళతో కలిసి పథకం రచించాడు.   

ఆమెతో కలిసి తాను తీసుకున్న అభ్యంతకర చిత్రాల్ని భార్యకు వాట్సప్‌ ద్వారా పంపించడం ఆరంభించాడు. అంతటితో ఆగకుండా భార్య పేరు చెడగొట్టాలంటూ తులసీదాస్‌... ఆ మహిళను ప్రోత్సహించాడు.  ఆమె తులసీదాస్‌ భార్య ప్రవర్తనను అసభ్య పదజాలంతో వర్ణిస్తూ వాట్సప్‌ స్టేటస్‌లో పోస్ట్‌ చేసింది. 

ఇలా వేధింపులు తీవ్రతరం కావడంతో తులసీదాస్‌ భార్య రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసుల్ని ఆశ్రయించింది. ఇన్‌స్పెక్టర్‌ జలేందర్‌రెడ్డి కేసు దర్యాప్తు చేపట్టి నిందితులను బుధవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. అభ్యంతరక చిత్రాల్ని పంపించేందుకు తులసీదాస్‌, నిందితురాలు వినియోగించిన ఫోన్లను సీజ్‌ చేశారు.