Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ గాంధీతో భేటీ మతలబు: ఎవరీ గద్దర్?

కుమారుడు సూర్యం అప్పట్లో కాంగ్రెసు పార్టీలో చేరారు.  కుమారుడు సూర్యం, భార్య విమలలతో పాటు గద్దర్ ఢిల్లీ వచ్చారు. అనేక ఒడిదొడుకులకు, నిర్బంధాలకు, కష్టాలకు గురైన ఆయన ఎర్ర జెండాను వదిలేశారు.

Met Rahul gandhi: Who is Gaddar?
Author
New Delhi, First Published Oct 13, 2018, 7:31 AM IST

ఓ దళిత కుటుంబంలో పుట్టి విప్లవోద్యమంలో పాటను ఊతం చేసుకుని అశేష ప్రజానీకాన్ని ప్రభావితం చేసిన గద్దర్ తన పంథాను మార్చుకున్నారు. సాయుధ పోరాటం వైపు ఆయన పాటల ప్రభావంతో ఎంతో మంది అడుగులు వేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, ఇప్పుడు పార్లమెంటరీ రాజకీయాల్లోకి అడుగు వేశారు.

అనేక ఒడిదొడుకులకు, నిర్బంధాలకు, కష్టాలకు గురైన ఆయన ఎర్ర జెండాను వదిలేశారు. ఆయన పరిణామక్రమం ఏమిటనేది చూస్తే అచ్చెరువు కలగక మానదు. అయితే, ఆయన కుమారుడు సూర్యం అప్పట్లో కాంగ్రెసు పార్టీలో చేరారు.  కుమారుడు సూర్యం, భార్య విమలలతో పాటు గద్దర్ ఢిల్లీ వచ్చారు. 

సూర్యం ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి సీటు ఆశిస్తున్నారు. ఈ విషయంపై కూడా గద్దర్ రాహుల్ గాంధీతో మాట్లాడినట్లు సమాచారం. అయితే, బెల్లంపల్లి సీటును సిపిఐకి కేటాయించాలని తెలంగాణ పిసిసి భావిస్తోంది. తాను సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డితో మాట్లాడుతానని, ఆ సీటును తన కుమారుడు సూర్య కిరణ్ కు కేటాయించాలని గద్దర్ అంటున్నారు.

మరో విషయం కూడా ఉంది. గద్దర్ కేసిఆర్ పై గజ్వెల్ లో పోటీ చేస్తానని అంటున్నారు. తాను ఓ పార్టీలోనూ చేరబోనని స్పష్టం చేశారు. ఏ పార్టీలోనూ తనకు సభ్యత్వం లేదని కూడా చెప్పారు. ఆ మాటలు చెబుతూ.... ప్రజా సంఘాలు, పార్టీలు, ప్రజానీకం కోరితే తాను పోటీ చేస్తానని అంటున్నారు. అయితే ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆయన గజ్వెల్ పోటీకి దిగుదామని అనుకుంటూ ఉండవచ్చు. ఈ విషయాలు ఆయన రాహుల్, సోనియాలతో చెప్పారా, లేదా అనేది తెలియదు. మొత్తం మీద, రాహుల్ గాంధీ, సోనియాలను కలవడం ద్వారా ఆయన చర్చకు కేంద్ర బిందువుగా మారారు.

గద్దర్ జీవన యానమంతా విప్లవోద్యమాలతో పెనవేసుకుని ఉంది. ఆయన మెదక్‌ జిల్లా తూప్రాన్‌ గ్రామంలో శేషయ్య, ఆయన రెండో భార్య లచ్చుమమ్మ 1949లో జన్మించాడు. ఉప్పరి పనిచేసే శేషయ్య అప్పటికే అంబేడ్కర్ భావజాలంతో ప్రభావితుడయ్యాడు. తల్లిదండ్రులకు చివరి సంతానంగా గద్దర్ జన్మించాడు. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు విఠల్ రావు. 

విఠల్‌ రావు చదువుకునే బడికి అనుబంధంగా ఆర్య సమాజిస్టు శేషారెడ్డి అంటరానివారి కోసం వసతిగృహాన్ని ఏర్పాటు చేశాడు.  చదువులో విఠల్‌ రావు చాలా చురుకైనవాడు. దీంతో పాఠశాల మాష్టారు శంకరయ్య  విఠల్‌ రావును తన సాంస్కృతిక బృందంలో చేర్చుకున్నాడు.  

ఆ సాంస్కృతి బృందంలో విఠల్ రావుది బుడ్డర్‌ఖాన్‌ వేషం.  'సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో', 'పాలపిట్టలై వస్తారా నా బిడ్డలు' అనే పాటలు విప్లవ సాహిత్యంలో ఎనలేని ముద్ర వేశాయి. 

విఠల్‌ రావు 1966 - 67లో హెచ్‌ఎస్‌సి రాశాడు. హైస్కూల్లో చదువుతున్నప్పుడే పంచాయతీరాజ్‌ బుర్రకథ ప్రదర్శించి  ప్రథమ బహుమతిని పొందాడు. ఆ తర్వాత హైదరాబాదులోని మొజంజాహి మార్కెట్‌లోని హాస్టల్లో వుంటూ సైఫాబాద్‌ కళాశాలకు ప్రతి రోజూ నడిచి వెళ్లివాడు. ఇంజనీరింగ్‌ విద్యను విఠల్‌రావు చివరి దాకా కొనసాగించలేదు. రెండో సంవత్సరంలో విద్యకు స్వస్తి చెప్పి 'ఢిల్లీ దర్బార్‌' హోటల్లో సర్వర్‌గా చేరాడు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ సమాచార, పౌర సంబంధాల మంత్రిత్వ శాఖ తరఫున బుర్రకథ ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టాడు. 

ఆ తర్వాత ఆర్ట్‌ లవర్స్‌ అసోసియేషన్‌తో విఠల్‌కు పరిచయం కలిగింది. ఆర్ట్‌ లవర్స్‌ అసోయేషన్‌ వ్యవస్థాపకుడు బి. నర్సింగరావు విఠల్‌కు మార్గదర్శకత్వం వహించాడు. అక్కడే ఆయన విప్లవోద్యమం వైపు వెళ్లడానికి మార్గం పడింది. గద్దర్‌ వచ్చిన తర్వాత ఆర్ట్‌ లవర్స్‌ అసోయేషన్‌ జననాట్య మండలిగా మారింది. నర్సింగరావు, గద్దర్‌లతో పాటు బీదలపాట్లు రచయిత శంరకన్‌ కుట్టి, ఎల్‌ఎస్‌ఎన్‌ మూర్తి జన నాట్య మండలి ఏర్పాటులో భాగం పంచుకున్నారు. 

1972లో జన నాట్యమండలి ఆవిర్భవిస్తే 1973లో వరంగల్‌లో జరిగిన విరసం సభల్లో గద్దర్‌ బుర్రకథ ప్రదర్శన ఇచ్చాడు, పాటలు పాడాడు. వరంగల్‌ సభ తర్వాత అత్యవసర పరిస్థితి కారణంగా నర్సింగరావు వెళ్లాడు. గద్దర్‌కు కూడా రహస్య జీవితం గడపాల్సి వచ్చింది. దాంతో గద్దర్‌ హైదరాబాద్‌లోని చుట్టాల ఇంట్లో ఉంటూ ఆ ప్రైవేట్‌ ఉద్యోగం చేశాడు.

గద్దర్ కు 1976 అక్టోబర్‌ 25వ తేదీన ఆయనకు బ్యాంక్‌ ఉద్యోగం వచ్చింది. మొట్టమొదట సికింద్రాబాద్‌లోని ఈస్ట్‌ మారేడుపల్లి కెనరా బ్యాంకు శాఖలో ఆయన క్లర్క్‌గా చేరాడు. ఉద్యోగం ఉందనే దీమాతో గద్దర్‌ 1976 నవంబర్‌లో విమలను వివాహం చేసుకున్నాడు. 

గద్దర్‌ 1977 జూన్‌లో అరెస్టయ్యాడు. 42 రోజుల పాటు జైలులో ఉండి, విడుదలయ్యాడు.ఎమర్జెన్సీ ఎత్తివేత తర్వాత 'సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో', 'లాల్‌ సలామ్‌ లాల్‌ సలామ్‌', 'ఎన్నియల్లో ఎన్నియల్లో గోపి నిర్మలమ్మ కథ వినవే' వంటి పాటలు రాశాడు. 

జననాట్యమండలికి పూర్తి కాలం పనిచేసే వాళ్లు కావాలని 1980లో పీపుల్స్‌వార్‌ నిర్ణయించింది. ఆ తర్వాత కూడా గద్దర్‌ 1981 - 82 ప్రాంతంలో నల్లగొండ జిల్లా భువనగిరిలో ఉద్యోగం చేశారు. 1982లో జననాట్య మండలి ఇనిస్టిట్యూట్‌ ఏర్పడింది. పార్టీ నిర్ణయం మేరకు గద్దర్‌ 1983లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి కాలం జన నాట్యమండలి కార్యకర్తగా చేరాడు. తీవ్ర నిర్బంధం కారణంగా 1983లో గద్దర్‌ అజ్ఞాతంలోకి వెళ్లాడు. 

1990 ఫిబ్రవరి 18వ తేదీన తిరిగి బహిరంగ జీవితంలోకి వచ్చాడు. ఆయనపై సాయుధ దాడి జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటూ ఆయన రాసిన పాట తెలంగాణ ప్రజల్లో గుండెల్లో ఇప్పటికీ మారుమ్రోగతూ ఉంటుంది. విప్లవోద్యమాన్ని వీడి ఓట్ల రాజకీయంలోకి ఆయన అడుగు పెట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios