తూచ్... పార్టీ కండువా కప్పామంతే... పార్టీలో చేర్చుకోలేదు..: తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్ర పరిస్థితి
తెలంగాణ కాంగ్రెస్ విచిత్ర నిర్ణయం తీసుకుంది. కొందరు బిఆర్ఎస్ నాయకులను కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నాక నాలుక కరుచుకుంది... ఇప్పుడు ఆ చేరికను నిలిపివేసింది...
నల్గొండ : ఏ పార్టీ కండువా మెడలో వుంటే ఆపార్టీలో వున్నట్లే లెక్క. కండువా మారిందో పార్టీ మారినట్లే. కానీ తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్ర పరిస్థితి వుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. కానీ ఇప్పుడు ఆ చేరికను నిలుపదల చేసారు. దీంతో కండువా కప్పుకుని పార్టీలో చేరినా అతడు కాంగ్రెస్ నాయకుడు కాదన్నమాట. ఇలా అటు బిఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ కు కాకుండా పోయాడు సదరు నాయకుడు.
వివరాల్లోకి వెళితే... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఎన్నికల్లో ఓటమిపాలై అధికారాన్ని కోల్పోయిన భారత రాష్ట్ర సమితి పార్టీ నుండి వలసలు పెరిగిపోయాయి. అధికారంలో వుండగా కేసీఆర్ కు సన్నిహితంగా వుండి కీలక పదవులు పొందినవారు సైతం బిఆర్ఎస్ ను వీడి బిజెపి, కాంగ్రెస్ పార్టీల్లో చేరుతున్నారు. లోక్ సభ ఎన్నికల వేళ ఈ వలసలు మరింత పెరిగిపోయాయి.
ఇలా ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరాడు. ఆయన భార్య, మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ నాగలక్ష్మితో పాటు మరో 13 మంది కౌన్సిలర్లు నిన్న(శనివారం) కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ ఇంచార్జీ దీపాదాస్ మున్షీ సమక్షంలో వీరంతా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇలా వీరంతా అధికారికంగా కాంగ్రెస్ లో చేరిపోయారు.
అయితే ఇక్కడే నల్గొండ రాజకీయాలను శాసించే కాంగ్రెస్ నాయకులు ట్విస్ట్ ఇచ్చారు. తమను సంప్రదించకుండా ఏకపక్షంగా మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ ను ఎలా చేర్చుకున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నాలుక కరుచుకున్న కాంగ్రెస్... ఇప్పుడు తూచ్ అంటోంది. భార్గవ్ తో పాటు కౌన్సిలర్ల చేరికను నిలుపుదల చేస్తూ తెలంగాణ పిసిసి వర్నింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీచేసారు. నల్గొండ జిల్లా నాయకులతో సంప్రదింపుల తర్వాత మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్ల చేరికపై ప్రకటన చేస్తామన్నారు.
భార్గవ్ చేరికను అడ్డుకుంటోంది ఎవరు?
మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ వర్గం గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసింది. అందువల్లే ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ వారిని కాంగ్రెస్ లో చేర్చుకోడాన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ గతంలో కాంగ్రెస్ పార్టీని వీడినవారిని తిరిగి పార్టీలో చేర్చుకోవాలని ఏఐసిసి ఆదేశించింది... దీంతో స్థానిక నాయకులు వ్యతిరేకిస్తున్నా దీపాదాస్ మున్షీ సమక్షంలో భార్గవ్ దంపతులు, మరికొందరు కౌన్సిలర్లు కాంగ్రెస్ ల చేరారు. కానీ జిల్లా నాయకుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని వీరి చేరికను నిలిపివేసింది తెలంగాణ కాంగ్రెస్.