కాంగ్రెస్ కు హిందువుల ఓట్లు అవసరంలేదు... ముస్లింలు వుంటే చాలు : మంత్రి తుమ్మల సంచలనం
లోక్ సభ ఎన్నికల వేళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేసే కామెంట్స్ చేసారు. ఇప్పటికే హిందూ ఓటర్లు ఆ పార్టీకి దూరం అవుతున్నారన్న ప్రచారం వుంది... అలాంటిది వారి అవసరమే తమకు లేదనేలా తుమ్మల కామెంట్స్ చేసారు.
ఖమ్మం : భారతీయ జనతా పార్టీకి హిందుత్వ పార్టీగా గుర్తింపు వుంది. ఈసారి హిందువుల ఓట్లన్నీ బిజెపికే పడేలావున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సరికొత్త స్ట్రాటజీతో ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తోంది. హిందువుల ఓట్లు తమకు వద్దు... ముస్లీం మైనారిటీలు ఓటేస్తే చాలు అనేలా కొందరు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇలాగే ముస్లింలను ప్రసన్నం చేసుకునేలా మాట్లాడారు.
ఖమ్మం జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముస్లింల మద్దతు ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకేనని అన్నారు. అసలు కాంగ్రెస్ అంటేనే ముస్లిం సోదరుల పార్టీ అని... ఈ పార్టీ వారికే సొంతం అన్నారు. వారి హస్తం లేకుండా కాంగ్రెస్ ఏనాడూ అధికారంలోకి రాదన్నారు.
ఈ లోక్ సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ... అందుకు ముస్లింలే కారణమని అన్నారు. ముస్లిం సోదరసోదరీమణుల త్యాగ ఫలితమే ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితి అన్నారు. ముస్లింలు ఎక్కడుంటే అక్కడ కాంగ్రెస్ గెలవబోతోందని... అల్లా దయ, కృప ఈ పార్టీపై వున్నాయన్నారు. తెలంగాణ ముస్లీం సమాజమంతా కాంగ్రెస్ వెనకే వుందంటూ మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఇలా అసలు హిందువులు కాంగ్రెస్ కు ఓటే వేయలేదు... కేవలం ముస్లింల వల్లే అధికారంలోకి వచ్చినట్లు తుమ్మల చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. కాంగ్రెస్ లోనూ హిందువులు వున్నారు... వారికి గుర్తింపు లేదని మంత్రి మాటలతో అర్థం అవుతోందని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ అసలు స్వరూపాన్ని హిందువులు గుర్తించాలని బిజెపి నాయకులు సూచిస్తున్నారు.