కేసీఆర్ కౌంటర్ - భట్టి ఎన్కౌంటర్ ... కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య 'పవర్' పాలిటిక్స్
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మద్య విద్యుత్ కోతలపై మాటలయుద్దం సాగుతోంది. తాజాగా తాాను తింటుంటే కరెంట్ పోయిందంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు భట్టి కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్ : తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య మాటలయుద్దం సాగుతోంది. పొలిటికల్ సవాళ్ళు, ప్రతిసవాళ్లతో రాజకీయాలు హీటెక్కాయి. ముఖ్యంగా గత బిఆర్ఎస్ పాలనను.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనను పోల్చుకుంటూ ఇరుపార్టీలు వాగ్వాదానికి దిగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్, కేసీఆర్ కుటుంబ అవినీతిపై కాంగ్రెస్ ప్రశ్నిస్తుంటే... ఆరు గ్యారంటీ హామీల అమలు, రైతు రుణమాఫీపై బిఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. తాజాగా రాష్ట్రంలో కరెంట్ కోతలు పెరిగాయని ... దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయమై కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మధ్య మాటలయుద్దం సాగుతోంది.
తెలంగాణలో కరెంట్ కోతలపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి తెలంగాణలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటుతర్వాత ఎన్నడూలేని విధంగా ప్రస్తుతం కరెంట్ కోతలు వున్నాయని ఆరోపించారు. మహబూబ్ నగర్ లోక్ సభ ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటికి వెళ్లారు కేసీఆర్. అక్కడ బోజనం చేస్తుండగా రెండుసార్లు కరెంట్ పోయిందని కేసీఆర్ ఎక్స్ వేదికన తెలిపారు.
ప్రతి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కరెంటు పోవడం లేదని ఊదరగొడుతున్నారు... కానీ క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం వేరుగా వున్నాయని కేసీఆర్ అన్నారు. కేవలం తాను మాత్రమే కాదు మాజీ శాసనసభ్యులు కూడా కరెంట్ కోతల గురించి తనతో ఏకరువు పెడుతున్నారని అన్నారు. తమ నియోజకవర్గాల్లో రోజుకు పదిసార్లు కరెంట్ పోతోందని ఈ సందర్భంగా తనకు చెప్పారని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది? రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలని కేసీఆర్ సూచించారు.
ఇలా కేసీఆర్ కరెంట్ కోతలపై చేస్తున్న ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని... మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో వుండగా కరెంట్ పోయిందని అనడంలో నిజం లేదని అన్నారు. ''సబ్ స్టేషన్ నుండి ట్రాన్స్ఫార్మర్ ద్వారా విద్యుత్ సరఫరా జరిగింది... అది డిజిటల్ మీటర్ కాబట్టి ఎవరి ప్రమేయం లేకుండా దానంతట అదే రీడింగ్ చేస్తుంది. శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో నమోదయిన రీడింగ్ మరియు పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలో ఆరాతీస్తే ఎలాంటి కరెంటు కోతలు జరగలేదని తేలింది. నిరంతర విద్యుత్ సరఫరా జరిగింది అని మా అధికారులు నిర్ధారించారు'' అని డిప్యూటీ సీఎం తెలిపారు.
''కేసీఆర్ గారు నిద్ర లేచింది మొదలు అవాస్తవాలు, అభూత కల్పనలతో కాలం గడిపేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల సూర్యాపేట పట్టణంలో సైతం ఇదే తరహాలో విద్యుత్ శాఖను అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నించి అబాసు పాలయ్యారు. అధికారం చేజారి, బీఆర్ఎస్ పార్టీ మనుగడే ప్రశ్నార్ధకంగా మారడంతో అబద్దాలతో, అసత్య ప్రచారాలతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు'' అంటూ భట్టి విక్రమార్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఇదిలావుంటే ఒక్క కేసీఆరే కాదు బిఆర్ఎస్ నాయకులంతా రాష్ట్రంలో కరెంట్ కోతలపై కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా తన నియోజకవర్గం సిద్దిపేటలో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తుండగా మూడు సార్లు కరెంట్ పోయిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. నిమిషమో రెండు నిమిషాలో కాదు పోతే పావుగంట పావుంగంట పోతోందని ... నిజంగానే మార్పు మొదలయ్యిందంటూ హరీష్ రావు ఎద్దేవా చేసారు.
ఇక ఇటీవల మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో జరిగిన బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. మాజీ మంత్రి మాట్లాడుతుండగా ఒక్కసారిగా పవర్ కట్ జరిగింది. దీంతో మల్లారెడ్డి తనదైన స్టైల్లో కరెంట్ కోతలపై రియాక్ట్ అయ్యారు మల్లారెడ్డి.
ఇలా అధినేత కేసీఆర్ నుండి మాజీ మంత్రులు, బిఆర్ఎస్ నాయకులు లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ సర్కార్ పై ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్ నాయకులు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. ఇరుపార్టీల మధ్య గతంలో పవర్ పాలిటిక్స్ జరిగితే ప్రస్తుతం పవర్ కట్స్ పై రాజకీయాలు జరుగుతున్నాయి.