జగిత్యాల: తెలంగాణలో మరో ఘోరం జరిగింది. ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేసి, ఆమెను హత్య చేశారు. పత్తి ఏరేందుకు పొలానికి వెళ్లి వివాహిత ఇంటికి తిరిగి రాలేదు. దాంతో ఆమె కోసం గాలింపు చేపట్టారు. ఆ ప్రాంతంలో దుస్తులు చెరిగిపోయి, ఒంటిపై పంటి గాట్లతో మహిళ మృతదేహం కనిపించింది. 

దాన్ని బట్టి ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమెను చంపేసి ఉంటారని అనుమానిస్తున్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కొండాపూర్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. 

39 ఏళ్ల వయస్సు గల ఆ మృతురాలికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భర్త మరణించడంతో తానే పిల్లలను సాకుతోంది. బుధవారం తన చేనులో పత్తి ఎరేందుకు వెళ్లింది. చీకటి పడినా తల్లి రాకపోవడంతో కూతుళ్లు ఆందోళనకు గురయ్యారు 

గురువారం ఉదయం స్థానికుల సాయంతో చేను వద్దకు వెళ్లి చూశారు. చేనుకు కొద్ది దూరంలో ఆమె మృతదేహం కనిపించింది. బీహార్ కు చెందిన కూలీలతో కొద్ది రోజుల క్రితం ఆమె గొడవ పడిందని, బహుశా వారే ఈ ఘోరానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. 

బీహార్ కూలీలను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మహిళ కుటుంబంతో కొందరికి ఆస్తి తగాదాలు కూడా ఉన్నాయి. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్పీ సింధు శర్మ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిచారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలను సేకరిస్తున్నారు.