పనికోసం పొట్ట చేతబట్టుకుని వలస వచ్చిన కార్మికులపై యజమానులు అరాచకానికి పాల్పడుతున్నారు. ఒడిశానుండి ఇటుక బట్టీలో పనిచేసేందుకు వచ్చిన ఓ వివాహితపై యజమానులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఫిర్యాదు చేస్తారన్న భయంతో ఆమెపై, భర్తపై దాడి చేశారు. తమ అరాచకానికి సాక్ష్యంగా నిలుస్తారని మరో 14మంది కూలీలను నిర్భంధించి దాడి చేశారు. 

దారుణమైన ఈ అరాచక ఘటన గత నెల 24న పెద్దపల్లి జిల్లా గౌరెడ్డిపేటలో జరిగింది. ఈ విషయం మీద గుర్తు తెలియని వ్యక్తులు మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేయడంలో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

హెచ్ఆర్సీ తనకు వచ్చిన లేఖను అధికారులు పంపించి దీనిమీద విచారణ చేయాల్సిందిగా ఆదేశించింది. హెచ్‌ఆర్సీ నుంచి అధికారులకు అందిన లేఖలోని వివరాల ప్రకారం.. గౌరెడ్డిపేటలోని ఎల్ఎన్సీ ఇటుక బట్టీలో పనిచేసే ఒడిశాకు చెందిన వివాహిత(22)పై ఐదుగురు యజమానులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

అంతటితో ఊరుకోకుండా వివాహిత, ఆమె భర్తపై దాడి చేశారు. దీంతో తమకు ప్రాణహాని ఉందని భావించిన ఆ దంపతులు అక్కడి నుంచి తప్పించుకుని.. సొంతూరుకు వెళ్లేందుకు రామగుండం రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. వారిని పట్టుకున్న యజమానులు మళ్లీ ఇటుక బట్టీల వద్దకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. 

జరిగిన విషయంలో సాక్ష్యంగా ఉన్నారనే కారణంలో మరో 14 మంది కూలీలను నిర్బంధించి దాడి చేశారు. అయితే ఎలాగో ఈ విషయం బైటికి పొక్కడంతో గుర్తు తెలియని వ్యక్తులు మానవ హక్కుల సంఘానికి లేఖ రాశారు. 

ఈ లేఖతో స్పందించిన హెచ్ఆర్సీ విచారణ చెపట్టాలని పెద్దపల్లి ఆర్డీవో శంకర్ కుమార్, ఎస్సై రాజేశ్, తహసీల్దార్ శ్రీనివాస్, సఖీ కేంద్రం అడ్మినస్ట్రేటర్ స్వప్నను సోమవారం ఆదేశించారు. 

వీరు ఇటుక బట్టీల వద్దకు వెళ్లి కూలీలతో మాట్లాడారు. పదిమంది కూలీలు, వారి పిల్లలకు కేంద్రంలో ఆశ్రయం కల్పించామని కేంద్రం అడ్మినిస్ట్రేటర్‌ స్వప్న తెలిపారు.  అధికారులు విచారణకు వెళ్లిన సమయంలో బాధితురాలు, ఆమె భర్త ఇటుక బట్టీల వద్ద కనిపించలేదు. 

దీంతో అత్యాచారం విషయం బైటపడుతుందని యజమానులే వారిని దాచిపెట్టి ఉంటారని కూలీలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యజమానులు సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. 

కాగా, అత్యాచారం, కూలీల నిర్భంధంపై విచారణ జరుపుతున్నామని, త్వరలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఆర్డీఓ తెలిపారు. గతంలో కూడా ఇదే ఇటుకబట్టీలో ఓ కూలీ మృతి చెందగా తోటి కూలీలకు తెలియకుండా యాజమాన్యం దాచి పెట్టందని పలువురు కూలీలు గుర్తుచేస్తున్నారు. 

కాగా ఈ కేసులు మంగళవారం ఇటుక బట్టీల యజమానితో సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.