ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రెడీ: ఈ సారి బ్యాటరీ తీసి పెట్టుకోవచ్చు
ఓలా కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్లలో కొత్త మార్పును తీసుకొస్తోంది. ఇకపై ఓలా స్కూటర్లలో కూడా బ్యాటరీ తీసి ఛార్జింగ్ పెట్టుకొని మళ్లీ ఫిట్ చేసుకోవచ్చు. ఇప్పటికే పోటీ కంపెనీలు ఈ ఫెసిలిటీని వినియోగదారులకు అందిస్తున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు మార్కెట్ లో ఉన్న డిమాండ్ కారణంగా కొత్తగా బ్యాటరీ మార్చుకునే స్కూటర్‌ని తీసుకొస్తోంది.
ఓలా.. ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఓ ట్రెండ్ క్రియేట్ చేసిన కంపెనీ. అసలు ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే ఓలా అన్నంత పేరు వచ్చింది. సాధారణ స్కూటర్ల కంటే డిఫరెంట్ లుక్ ఉండటం వల్ల మార్కెట్ లో బాగా క్లిక్ అయ్యింది. అంతే కాకుండా డిజిటల్ టెక్నాలజీని బాగా ఉపయోగించి ఏర్పాటు చేసిన సౌకర్యాలు వినియోగదారులను బాగా ఆకట్టుకున్నాయి.
ఓలా ఎలక్ట్రిక్స్ కంపెనీని 2017లో భవిష్ అగర్వాల్ స్టార్ట్ చేశారు. కర్నాటకలోని బెంగుళూరులో ప్రధాన కార్యాలయం ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ ఓలా S1 మోడల్స్ వాహనాలను డిజైన్ చేస్తోంది. ఇందులో Ola S1 ఎయిర్, Ola S1X, S1 ప్రో అనే మూడు రకాలు ఉన్నాయి. తమిళనాడులోని కృష్ణగిరిలో ఉన్న ప్లాంట్ లో ఇవి తయారవుతున్నాయి.
అయితే ఈ ఓలా స్కూటర్స్ ఎంత బాగా క్లిక్ అయ్యాయో అంతే ఇబ్బందులు కూడా వస్తున్నాయి. ఇటీవల చాలా చోట్ల ఓలా స్కూటర్లు షార్ట్ సర్కూట్ అయి కాలిపోతున్నాయని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కస్టమర్ల నుంచి చాలా ఇబ్బందులను కూడా ఓలా కంపెనీ ఎదుర్కొంటోంది.
ఇదిలా ఉండగా, పోటీ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ స్కూటర్లలో డిఫరెంట్ మోడల్స్ తీసుకొచ్చి ఓలా స్కూటర్లకు పోటీ ఇస్తున్నాయి. కొన్ని స్కూటర్లలో ఉండే ఫెసిలిటీస్ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ముఖ్యంగా బ్యాటరీ తీసి ఛార్జింగ్ పెట్టుకొనే సౌకర్యాన్ని కల్పించి వినియోగదారుల ఇబ్బందులు తొలగించాయి. అయితే ఓలా స్కూటర్లలో ఇప్పటి వరకు ఈ ఫెసిలిటీ లేదు.
మార్కెట్ లో పోటీని తట్టుకొనేందుకు ఓలా కూడా రిమూవబుల్ బ్యాటరీ విధానాన్ని తన వినియోగదారులకు పరిచయం చేయనుంది. ఈ ఫీచర్ ను యాడ్ చేస్తూ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ని త్వరలోనే విడుదల చేయనుంది. ఈ మేరకు ఓలా కంపెనీ ఫౌండర్ భవిష్ అగర్వాల్ స్కూటర్ ఫోటోలను సోషల్ మీడియాలో ఇటీవల షేర్ చేశారు. డిజైన్, బ్యాటరీని చూపిస్తూ ఈ ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలను బట్టి సీటు వెనకాల లగేజీ పెట్టుకునే స్థలం ఏర్పాటు చేసినట్లు కనిపిస్తోంది. హెడ్‌లైట్, క్రాష్ గార్డ్స్, ఫుట్ పెగ్స్ వంటివి కనిపిస్తున్నాయి.
ఈ బ్యాటరీ ఫొటో బాగా వైరల్ అవుతోంది. ఓలాలో కూడా రిమూవబుల్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లుగా ఈ ఒక్క ఫొటో చెబుతోంది. ఇప్పుడు మార్కెట్ లోకి రానున్న మోడల్ లో ఫుట్‌వెల్‌లో సామాను పెట్టుకునే వీలు కల్పించారు. వెనక సీటు కూడా తీసేయ్యొచ్చు.
సీటు చుట్టూ ఫేరింగ్ ఉంది. బ్యాటరీ సీటు కింద ఉండటంతో స్టోరేజీ తక్కువుంటుంది. రెండు బ్యాటరీలు పెట్టుకునే స్థలం ఉండొచ్చని అంచనా. హబ్-మౌంటెడ్ మోటార్ ఉండొచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రిమూవబుల్ బ్యాటరీ స్కూటర్ కి సంబంధించి ఈ ఏడాది ప్రారంభంలో బ్యాటరీ పేటెంట్ ఫోటోలు లీకయ్యాయి. ప్రస్తుతం కంపెనీ యాజమాన్యం విడుదల చేసిన ఫోటోలను బట్టి ప్రస్తుతం ఓలా స్కూటర్లలో ఫుట్‌వెల్ కింద బ్యాటరీ ఉంటుందని తెలుస్తోంది. కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చే వారంలో విడుదల అవుతుందని సమాచారం.