వారిద్దరికీ పరిచయమై కేవలం 45 రోజులే అవుతోంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇంతలోనే పెళ్లి చేసుకుందామంటూ ప్రియుడు.. తన ప్రియురాలిని బలవంత పెట్టాడు. అయితే.. అందుకు ఆ యువతి అంగీకరించలేదు. అంతే.. కోపంతో బీర్ బాటిల్ తో గొంతులో పొడి.. హత్య చేశాడు. ఆ హత్య తానే చేశానంటూ పోలీసులకు కూడా చెప్పాడు. ఈ సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుర్రంపోడు మండలం బొల్లారం గ్రామానికి చెందిన వెలుగు అంజయ్య, రాములమ్మ దంపతుల చిన్న కుమార్తె చందన (20) ఇంటర్‌ దాకా చదివి కూలి పనులకు వెళుతోంది. అనుముల మండలం కొరివేనిగూడేనికి చెందిన బొడ్డు శంకర్‌ ఇంటర్‌ చదివి వరికోత మిషన్‌ నడుపుతున్నాడు. 45 రోజుల క్రితం గుర్రంపోడు మండలంలో వరికోతలకు శంకర్‌ బొల్లారం వెళ్లాడు. 

ఆ సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది. రోజూ కలుసుకునేవారు. ఇద్దరూ పెళ్లి గురించి మాట్లాడుకునేందుకు శుక్రవారం మధ్యాహ్నం బైక్‌పై సాగర్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో హిల్‌కాలనీ రెండో డౌన్‌ వద్ద శివం హోటల్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. వెంట తెచ్చుకున్న మద్యాన్ని శంకర్‌ తాగాడు. అనంతరం ఇద్దరూ కలిసి భోజనం చేశారు. శంకర్‌ పెళ్లి ప్రస్తావన తీసుకురాగా చందన నిరాకరించింది. 

ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో అక్కడే ఉన్న ఖాళీ బీరు బాటిల్‌ను పగలగొట్టి చందన గొంతులో పొడిచి, బండరాయితో తలపై మోదడంతో ఆమె మృతి చెందింది. మద్యం మత్తులో ఉన్న శంకర్‌ అక్కడే చెట్టుకింద నిద్రించి, సాయంత్రం నిద్రలేచి ప్రధాన రహదారిపైకి చేరుకున్నాడు. అటుగా వెళుతున్న పోలీసులు గమనించి ప్రశ్నించడంతో హత్య చేసిన విషయం వారికి చెప్పాడు.  వెంటనే ఎస్‌ఐకి సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకుని చందన మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.