న్యూడ్ వీడియో వివాదం.. గోరంట్ల మాధవ్ పై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా..
న్యూడ్ వీడియో వివాదంలో తనమీద ఇష్టారీతిన, అసభ్య పదజాలంలో వ్యక్తిగత దూషణకు దిగాడంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ గోరంట్ల మాధవ్ పై పరువు నష్టం దావా వేయనున్నారు.
హైదరాబాద్ : నగ్న వీడియో ప్రసారం చేశారంటూ అసభ్య పదజాలంతో వ్యక్తిగత దూషణలకు దిగిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మీద న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ నిర్ణయించుకున్నారు. గోరంట్ల మాధవ్ మీద రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేయనున్నారు. ఆయనపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో దావా వేయాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 4వ తేదీ ఉదయం నుంచి గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సహా పలు మీడియా సంస్థలు దీనిమీద కథనాలు ప్రసారం చేశాయి. అదే రోజు మీడియా ముందుకు వచ్చిన ఎంపీ ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీని అసభ్య పదజాలంతో దూషించారు. బుధవారం మరోసారి ఇదే రీతిలో మాట్లాడారు. దీంతో న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ నిర్ణయించుకున్నారు.
గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో ఒరిజినల్ కాదు: అనంతపురం ఎస్పీ ఫకీరప్ఫ
కాగా, వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు చెందినదిగా ప్రచారం జరుగుతున్న వీడియో ఒరిజినల్ కాదని అనంతపురం పోలీసులు బుధవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ వీడియో వ్యవహారంపై గోరంట్ల మాధవ్ స్పందించారు. రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టడానికే ఈ కుట్ర చేశారని మండిపడ్డారు. ఆ వీడియో ఫేక్ అని తేలిందని తెలిపారు. కడిగిన ముత్యంలా వస్తానని నమ్మకంతోనే తాను ధైర్యంగా ఉన్నానని చెప్పారు. వీడియో తనది కాదు కనుక ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదని అన్నారు. ఆ వీడియో మార్నింగ్ చేసినట్టుగా ఆ రోజే తాను చెప్పానని అన్నారు.
ఇది కొందరు దుర్మార్గుల చేసిన పని.. అని గోరంట్ల మాధవ్ విమర్శించారు. దీని మీద క్రిమినల్ కేసులు పెట్టించనున్నట్లు తెలిపారు. పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. బీసీలు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని పార్టీ టీడీపీ అని విమర్శించారు. ఇకనైనా ఈ రాజధానికి పుల్స్టాప్ పెట్టాలని కోరారు. ఈ వీడియోపై అనంతపురం ఎస్పీ పకీరప్ప బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ వీడియో మీద ఎంపీ అభిమాని వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈనెల 4వ తేదీన టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని అన్నారు. మొదట ఈ వీడియోని ITDP Official వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశారు అన్నారు. ఈనెల 4వ తేదీ రాత్రి +447443703968 నెంబర్ నుండి ఈ వీడియోను పోస్ట్ చేశారని ఎస్పీ వివరించారు. ఈ ఫోన్ నెంబర్ యుకెకు చెందిన వోడాఫోన్ నెంబర్ అని తమ దర్యాప్తులో తేలిందని ఎస్పీ అన్నారు.
ఈ నెంబర్ ఎవరు వాడుతున్నారు అనే విషయమై తాము దర్యాప్తు చేస్తున్నామన్నారు. యూకే నుంచి పోస్టు చేసిన వీడియో ఎడిట్ చేసినట్టుగా ఉందని తెలిపారు. ఫోన్ ఎవరు వాడుతున్నారని వివరాలను ఇవ్వాలని వోడాఫోన్ కు సమాచారం అడిగినట్లు తెలిపారు. ఈ వీడియో ను పోస్ట్ చేసిన వ్యక్తిని ట్రేస్ చేసేంతవరకు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలు ఫేక్ వీడియో లేనని ఆయన చెప్పారు. ఈ విషయమై ఒరిజినల్ వీడియో దొరికితే తప్ప ఇది ఒరిజినలా? నకిలీదా? అనేది తేలదని అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోను ఎడిటింగ్ లేదా మార్పింగ్ చేశారని సందేహాలు ఉన్నాయి అన్నారు.