Asianet News TeluguAsianet News Telugu

Telangana : తాగుబోతులకూ ఆసరా ఫించన్, ఆర్థికసాయం ... రేవంత్ సర్కార్ కు డిమాండ్...

తెలంగాణ ప్రభుత్వం వృద్దులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు ఆసరా ఫించన్లు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే తమకు కూడా ఫించన్లు అందించాలని తాగుబోతుల సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది... ఇంకా వాళ్లు ఏమేం డిమాండ్లు చేస్తున్నారంటే....

Telangana Drinkers Welfare Association Demands to Telangana Government AKP
Author
First Published May 1, 2024, 8:35 AM IST

హైదరాబాద్ : మీరు కుల సంఘాలు చూసివుంటారు... రైతులు, మహిళలు, వృద్దులు చివరకు హిజ్రాల సంక్షేమ సంఘాలు చూసివుంటారు...కానీ తాగుబోతుల సంక్షేమ సంఘం గురించి ఎప్పుడైనా విన్నారా? మీరు వింటున్నది నిజమే... తాగుబోతుల కోసం ఓ సంక్షేమ సంఘం వుంది. మద్యం ప్రియుల సమస్యలను పరిష్కరించడం కోసం ఈ సంక్షేమ సంఘం ఏర్పడింది. 

తాజాగా తాగుబోతుల సంక్షేమం కోసం ఈ సంఘం ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లను వుంచింది. మద్యం కొనుగోళ్ల ద్వారా ప్రభుత్వానికి ఎంతో ఆదాయం అందిస్తున్నామని...  అలాంటి తమకు ప్రభుత్వం ఏమీ చేయడంలేదని అంటున్నారు. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డిని కలిసి తమ తాగుబోతుల సమస్యలను విన్నవిస్తానని... వారి సంక్షేమం కోసం కొన్ని డిమాండ్లను ఆయనముందు వుంచుతానని మంచిర్యాల తాగుబోతుల సంఘం అధ్యక్షుడు తెలిపారు. 

తాగుబోతుల సంఘం డిమాండ్లివే : 

రాష్ట్రానికి ఎలాంటి ఆదాయం సమకూర్చని వారికోసం ప్రభుత్వాలు వందలు, వేలకోట్లు ఖర్చు చేస్తుంది... అలాంటిది ప్రభుత్వ ఆదాయంలో సింహభాగం తమ తాగుబోతుల వల్లే వస్తుంది... మాకోసం ఏం చేస్తున్నారని తాగుబోతుల సంఘం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఇప్పటికైనా తమకోసం సంక్షేమ పథకాలు అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు వుంచారు మంచిర్యాల తాగుబోతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు.  

 1. మద్యంమత్తులో రోడ్డుపైనో, కాలువల్లోనో పడిపోయి గాయపడే తాగుబోతులకు ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం చేయాలి... తాగిన మైకంలో మరేదైనా ప్రమాదానికి గురయి మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్ధికసాయం చేసి ఆదుకోవాలి. 

2. తాగుడుకు బానిసైన వాళ్లు ఆనారోగ్యం పాలయితే హాస్పిటల్ ఖర్చుల్లో 25 శాతం డిస్కౌంట్ ఇవ్వాలి

3. తాగుడుకు బానిసై ఆర్థికంగా చితికిపోయిన వారికి ప్రతి నెలా రూ. 5 వేల ఫించన్ ఇవ్వాలి.  

ఈ మూడు డిమాండ్లను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు వుంచుతానని తాగుబోతుల సంక్షేమ సంఘం చెబుతోంది.  

 

కింగ్ ఫిషర్ బీర్ల కోసం పోరాటం : 

తెలంగాణలో గత కొద్ది రోజులుగా బీర్లు దొరకడంలేదని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కింగ్ ఫిషర్ లైట్ బీర్లు వైన్స్ లో గాని, బార్లలో గానీ కనిపించడం లేదు. ఇలా ఈ బీర్లు దొరక్కపోవడంతో తాగుబోతుల సంక్షేమ సంఘం రంగంలోకి దిగింది. కింగ్ ఫిషర్ లైట్ బీర్లు అందుబాటులో వుండేలా చూడాలంటూ మంచిర్యాల ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఉన్నతాధికారికి లేఖ రాసారు. 

గత పది పదిహేను రోజులుగా కింగ్ ఫిషర్ లైట్ బీర్లు దొరక్క తాగుబోతులు ఇబ్బంది పడుతున్నారని ఈ లేఖలో పేర్కొన్నారు. ఎండల నుండి ఉపశమనం పొందేందుకు ప్రజలు మరీ ముఖ్యంగా యువత బీర్లు తాగుతారని... అందులోనూ కింగ్ ఫిషర్ బీర్లను ఎక్కువగా ఇష్టపడతారని తెలిపారు. అయితే కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ బీర్ తాగితే మత్తు ఎక్కువగా వుంటుంది... కానీ లైట్ బీర్ లో మత్తునివ్వదు... కాబట్టి ఇది తాగాక కూడా పనులు చేసుకోవచ్చు. కానీ వైన్స్ షాప్ యజమానులు సిండికేట్ గా మారి తమకు తక్కువ ఆదాయం వస్తుందని కింగ్ ఫిషర్ లైట్ బీర్ల అమ్మకాలను నిలిపివేసారు. దీంతో ఆ బీర్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారని ... గతిలేక కొత్తరకం బీర్లకు అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారంటూ తాగుబోతుల సంక్షేమ సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

ఒక్క మంచిర్యాలలోనే కాదు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆసిఫాబాద్ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి వుందన్నారు. తమ బాధను అర్థం చేసుకుని కింగ్ ఫిషర్ లైట్ బీర్లు అందుబాటులో వుండేలా చూడాలని తాగుబోతుల సంక్షేమ సంఘం ఎక్సైజ్ అధికారులను కోరుతోంది. మాకు సహకరిస్తే రాష్ట్ర ఆదాయాన్ని మరింత పెంచుతామని మంచిర్యాల తాగుబోతుల సంక్షేమ సంఘం తెలిపింది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios