మహబూబాబాద్: తెలంగాణలోని మహబూబాబాద్ రూరల్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ బాలుడు తన ఐదుగురు మిత్రులతో కలిసి 24 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. పథకం ప్రకారం నమ్మించి ఆ మహిళను తన వెంట తీసుకుని వెళ్లి బాలుడు ఆ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

ఆ సంఘటన శనివారంనాడు వెలుగు చూసింది. నిందితులంతా 17 ఏళ్ల లోపు వయస్సు గలవారే. ఓ తండాకు చెందిన 16 ఏళ్లు బాలుడు హైదరాబాదులో క్యాటరింగ్ పనులు చేస్తూ ఉంటాడు. అక్కడ అతనికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలానికి చెందిన యువతితో పరిచయమైంది. 

ఇటీవల తన ఊరికి వచ్చిన బాలుడు ఆమెకు ఫోన్ చేసి తమ ఇంటికి రావాల్సిందిగా కోరాడు. శుక్రవారం సాయంత్రం మహబూబాబాద్ పట్టణానికి చేరుకున్న మహిళను అతను తండాకు తీసుకుని వెళ్లి ఆ తర్వాత సమీపంలోని మామిడితోటకు తీసుకుని వెళ్లాడు. 

అప్పటికే అక్కడ తండాకే చెందిన ఇద్దరు, మహబూబాబాద్ కు చెందిన ఇద్దరు, తొర్రూరుకు చెందిన ఓ బాలుడు ఉన్నారు. పథకం ప్రకారం మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రి 10 గంటల సమయంలో అరుపులు వినిపించడంతో దారి వెంట వెళ్తున్న ఒకరు 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. 

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకుని మహిళను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి పంపించారు. ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.