వాట్సాప్‌తో పాటు అవన్నీ ఒక్కటైతే ఫేస్‌బుక్‌‌ లబ్దిపొందేనా?!!

వాట్సాప్‌, ఫేస్‌బుక్ మెసెంజర్‌, ఇన్‌స్టాగ్రాం సోషల్ మీడియా వేదికలు.. వేర్వేరు యాప్‌లతో నడుస్తున్నా వీటిని నిర్వహిస్తున్నది ఫేస్‌బుక్‌. దేని ఫీచర్లు దానివి. దేని యూజర్లు దానికే ఉన్నారు

Zuckerberg Plans to Integrate WhatsApp, Instagram and Facebook Messenger


న్యూయార్క్: వాట్సాప్‌, ఫేస్‌బుక్ మెసెంజర్‌, ఇన్‌స్టాగ్రాం సోషల్ మీడియా వేదికలు.. వేర్వేరు యాప్‌లతో నడుస్తున్నా వీటిని నిర్వహిస్తున్నది ఫేస్‌బుక్‌. దేని ఫీచర్లు దానివి. దేని యూజర్లు దానికే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ మూడు యాప్స్‌ తాలూకా మేసేజింగ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ను అనుసంధానం చేసేందుకు ఫేస్ బుక్ యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. 

దీంతోపాటు ఇప్పటి వరకు కేవలం వాట్సాప్‌కే ప్రత్యేకమైన ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ను మిగిలిన యాప్స్‌కు కూడా తెచ్చేందుకు ఫేస్‌బుక్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఫేస్‌బుక్‌ అధినేత జుకర్‌ బర్గ్‌ ఇందుకు రంగం సిద్ధం చేశారని న్యూయార్క్‌ టైమ్స్‌ ఓ కథనం వెలువరించింది.

ఈ మూడు యాప్స్‌ ఒక్కటైనా దేనికదే పనిచేస్తాయి. అయితే, ఫేస్‌బుక్‌ అకౌంట్‌ కలిగిన వ్యక్తి నేరుగా వాట్సాప్‌ అకౌంట్‌ కలిగిన వ్యక్తితో చాట్‌ చేయొచ్చు. ఇప్పటి వరకు ఇలాంటి వసతి లేదు. కేవలం ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రాం యూజర్లు ఎవరి పరిధిలో వారే మెసేజ్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. 

ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని, ఈ ఏడాది చివరి నాటికి గానీ, 2020 ప్రథమార్ధానికి గానీ పూర్తి కాచ్చని భావిస్తున్నారు. ఈ మూడు వేదికలకు కలిపి 260 కోట్ల మంది యూజర్లు ఉంటారని అంచనా. వీటి అనుసంధానానికి అవసరైమన సాంకేతిక మౌలిక వసతుల కల్పనలో ఫేస్ బుక్ యాజమాన్యం నిమగ్నమై ఉంది. 

ఈ మూడు యాప్స్‌ను అనుసంధానం చేయడం ద్వారా ఫేస్‌బుక్‌ పని సులువు కానున్నది. ఒకసారి ఇది గనుక జరిగితే వీటిలో అధునాతన ఫీచర్లను వేటికవి కాకుండా ఒక్కసారే అందుబాటులోకి తీసుకురావడం వీలవుతుంది. దీంతో పాటు ఈ మూడు ప్లాట్‌ఫాంలపై ఉన్న డేటాను పరస్పరం మార్చుకోవడంతో పాటు యూజర్లను ఎక్కువసేపు యాప్స్‌పై గడిపేలా చేసేందుకు అవకాశం కలుగుతుందని ఫేస్‌బుక్‌ భావిస్తోంది.

దీనిపై కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకరు పంపించిన సందేశాలను ఇంకొకరు చదవడానికి వీల్లేకుండా ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ సదుపాయం వాట్సాప్‌లో మాత్రమే ఉంది. అయితే, ఈ మూడు యాప్స్‌ మేసేజింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అనుసంధానం వల్ల దీని అసలు లక్ష్యానికి గండిపడే అవకాశం ఉందని పలువురు టెక్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ఒకసారి ఇతర యాప్స్‌కు కూడా సందేశాలను పంపించుకునే వీలున్నప్పుడు ఎన్‌క్రిప్షన్‌కు అవకాశం ఉండదని, అలాంటప్పుడు ఈ సదుపాయానికి అర్థం లేదని పేర్కొంటున్నారు. ఫేస్‌బుక్ మేనేజ్మెంట్ చర్యతో యాపిల్, గూగుల్ వంటి సంస్థల వైపు యూజర్లు వెళ్లే అవకాశాలు లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే తరుచుగా యూజర్లు ఫేస్ బుక్ యాప్ వాడటం వల్ల సంస్థ యాడ్ బిజినెస్ పెరగడం గానీ, నూతన ఆదాయ వనరుల కల్పన సేవలు అందుబాటులోకి వస్తాయని అంటున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios