న్యూఢిల్లీ: మనం ఇప్పటివరకు మెట్రో స్టేషన్లు, విమానాశ్రయాలు, షాపింగ్స్‌ మాల్స్‌లో కూల్‌ డ్రింక్స్‌ విక్రయించే వెండింగ్‌ మెషిన్లను చూశాం. ఇకపై మొబైల్‌ ఫోన్లు, మొబైల్‌ యాక్సెసరీలను విక్రయించే వెండింగ్‌ మెషిన్లను చూడబోతున్నాం. ఈ తరహా మెషిన్లకు చైనా మొబైల్‌ ఫోన్ల కంపెనీ షియోమీ శ్రీకారం చుట్టింది.

‘ఎంఐ ఎక్స్‌ప్రెస్‌ కియోస్క్‌’ పేరుతో బెంగళూరులోని మాన్యతా టెక్‌ పార్క్‌లో తొలి మొబైల్‌ వెండింగ్‌ మెషిన్‌ను ఏర్పాటు చేసింది షియోమీ. దీన్ని షియోమీ గ్లోబల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మనూ కుమార్‌ జైన్‌ ప్రారంభించారు. ఈ మెషిన్‌లో షియోమీకి చెందిన మొబైల్‌ ఫోన్లు, మొబైల్‌ యాక్సెసరీలు (సెల్ఫీ స్టిక్‌, ఇయర్‌ ఫోన్లు వంటివి) లభిస్తాయి.

ప్రస్తుతం బెంగళూరులో ఏర్పాటు చేసిన ‘ఎంఐ ఎక్స్ ప్రెస్ కియోస్క్’ను దీనికోసం దేశంలోని ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేసి షియోమీ స్మార్ట్‌ఫోన్లు, మొబైల్‌ యాక్సెసరీస్‌ను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తుంది. దేశీయంగా స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌లో ఆధిపత్యం కొనసాగిస్తున్న షియోమీ మార్కెట్లో పోటీని తట్టుకొని అలాగే కొనసాగించే దిశగా అడుగులు వేస్తోంది.

ఏదైనా ఎంఐ ఉత్పత్తిని ఎంఐ ఎక్స్‌ప్రెస్‌ కియోస్క్ ద్వారా కొనుగోలు చేసేవారు మెషిన్ల వద్దే డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డు, నగదు, యూపీఐ ద్వారా చెల్లించే సౌలభ్యాన్ని కల్పించనుంది. కస్టమర్‌ తమకు నచ్చిన దాన్ని ఎంచుకుని, వెంటనే కొనుగోలు చేయవచ్చు. 

కస్టమర్‌ తాను కొనుగోలు చేయబోయే ఫోన్‌ లేదా యాక్సెసరీస్‌కు సంబంధించిన వివరాలను వెండింగ్‌ మెషిన్‌పై ఉన్న స్ర్కీన్‌పై చూసుకునే వెసులుబాటు కల్పించారు. 200 స్మార్ట్‌ఫోన్లు నిల్వ చేసుకునే సామర్థ్యంతో ఈ వెండింగ్‌ మెషిన్లను రూపొందించనున్నట్లు షియోమీ ఇండియా ఓ వార్తా సంస్థకు వెల్లడించింది. 

ఈ కియోస్క్‌ పరిశోధనా, అభివృద్ధి భారత్‌లోనే జరిగిందని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా ప్రధాన నగరాలతోపాటు ఎప్పుడూ రద్దీగా ఉండే విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్లు, షాపింగ్‌ మాల్స్‌లో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. 

కియోస్క్‌లను ‘షియోమీ’యే నిర్వహిస్తుంది. దేశీయంగా 10,000 రిటైల్‌ స్టోర్లను కలిగి ఉండాలన్నది షామీ లక్ష్యం. ఈ ఏడాది చివరి నాటికి తన వ్యాపారంలో ఆఫ్‌లైన్‌ వాటా 50 శాతానికి పెంచుకోవాలనుకుంటోంది.

2014లో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన టెక్‌ దిగ్గజం షియోమీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6000 రిటైల్‌ అవుట్‌లెట్లను నిర్వహిస్తోంది. ఆన్‌లైన్‌ ద్వారా భారత మార్కెట్లో స్మార్ట్‌ ఫోన్ల అమ్మకాలను ప్రారంభించిన షియోమీ క్రమంగా ఆఫ్‌లైన్‌ స్టోర్లకూ విస్తరించింది.

ఆఫ్‌లైన్‌ ద్వారా అమ్మకాలను పెంచుకునే వ్యూహంతో ఉన్న షియోమీ ఇప్పుడు మొబైల్‌ వెండింగ్‌ మెషిన్లను తీసుకువస్తోంది. వీటి నిర్వహణ వ్యయం చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కడైనా వీటిని ఏర్పాటు చేయవచ్చు. వీటి ద్వారా అమ్మకాలు మరింతగా పెంచుకునే అవకాశం లభిస్తుంది.