న్యూఢిల్లీ: జపాన్ ఎలక్ట్రానిక్ మేజర్ సోనీ మొబైల్స్ భారత్‌లోని కస్టమర్లకు షాకిచ్చింది.  భారత మార్కెట్‌ నుంచి  వైదొలగుతున్నామంటూ ప్రకటించింది. ఇక్కడి మార్కెట్లో నష్టాల నేపథ్యంలో ఇతర లాభదాయకమైన మార్కెట్లపై దృష్టి కేంద్రీకరించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సోనీ తెలిపింది. 

2020ను కంపెనీకి లాభాల ఆర్థిక సంవత్సరంగా మార్చుకోవాలని సోనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం నిర్వహణ వ్యయాలను 50 శాతం వరకు తగ్గించాలని చూస్తోంది. అలాగే 5జీసేవలను దృష్టిలో పెట్టుకుని ఇక నుంచి తాము జపాన్, యూరప్, హాంగ్‌కాంగ్, తైవాన్ దేశాల్లో మార్కెట్‌ను పెంచుకునే దిశగా అడుగులు వేస్తామని తెలిపింది.

ఇప్పటికే సెంట్రల్, సౌత్ అమెరికాలో అమ్మకాలు నిలిపివేశామని, అదే విధంగా దక్షిణాసియా దేశాల్లో పరిస్థితులను బట్టి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తామని సోనీ స్పష్టం చేసింది. భారత స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌లో ఉన్న పోటీ మరే ఇతర మార్కెట్లలో లేదంటే అతిశయోక్తికాదు.

అయితే భారత్‌లో చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజాల హవా భారీగా నడుస్తోంది. వీటి దెబ్బకు శామ్‌సంగ్‌, ఆపిల్‌ లాంటి దిగ్గజాలు కూడా వణుకుతున్నాయి. సోనీ లాంటి బ్రాండెడ్ కంపెనీలపై కూడా మరింత ప్రభావం పడుతోంది. ఈ పోటీలో నష్టాల పాలైన సోనీ భారత మార్కెట్ నుంచి వైదొలగాలన్న సంచలన నిర్ణయం తీసుకుంది.  అంటే ఇక నుంచి భారత్‌లో సోనీ స్మార్ట్ ఫోన్లు ఉండవు. 

ఇప్పటికే తమ స్మార్ట్ ఫోన్‌ను వినియోగిస్తున్న వారికి మాత్రం కంపెనీ తరఫున సేవలు అందిస్తామంటూ  దేశీయ సోనీ వినియోగదారులకు భారీ ఊరటనిచ్చింది. విక్రయాలు ఆపేసినా తమ ఫోన్లు వాడే యూజర్లకు సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. 

సాఫ్ట్‌వేర్‌ అప్‌డేషన్స్‌తో సహా అన్ని రకాలుగా వినియోగదారులకు అండగా ఉంటామని సోనీ తెలిపింది. కాగా ఆర్థిక సంవత్సరం ముగింపు మార్చి నాటికి   సోనీ మొబైల్స్‌ 97.1 బిలియన్ యెన్ (879.45 డాలర్లు) నష్టపోయింది. అదే సమయంలో ఆపిల్, శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్ లాభాల్లో ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా చైనా తర్వాత అతి పెద్ద సార్మ్‌ఫోన్‌ మార్కెట్‌ భారత్‌కు ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీలు విడుదల చేసే అన్ని ఫోన్లు ఇక్కడ కూడా విక్రయానికి వస్తాయి. ఇటీవల కాలంలో భారత విపణిలో చైనా కంపెనీల హవా నడుస్తోంది. అతి తక్కువ ధరకే అత్యాధునిక ఫీచర్లలో స్మార్ట్‌ఫోన్లు వస్తుండటంతో వినియోగదారులు అటువైపు అడుగులు వేస్తున్నారు.