Asianet News TeluguAsianet News Telugu

బీఎస్ఎన్ఎల్‌కు బెయిలౌట్.. బట్ వీఆర్ఎస్‌లు తప్పవ్!!

ప్రస్తుతానికి బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలకు మూసివేత భయం తప్పింది. మోయలేని అప్పుల భారంతో ఇక్కట్ల పాలవుతూ, ఉద్యోగుల వేతనాలు చెల్లింపునకు ఆపసోపాలు పడుతున్న బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థల పునరుద్ధరణపై ఊహాగానాలు సాగాయి. మరోవైపు ప్రభుత్వం నుంచి స్పష్టమైన సహకారం కొరవడింది. ఫలితంగా సిబ్బంది, వినియోగదారులు అయోమయానికి గురవుతూ వచ్చారు. మూసివేత సంకేతాలపై ఆందోళన వ్యక్తం కావడంతో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలకు బెయిలౌట్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతోపాటు వ్యూహాత్మకంగా వీఆర్ఎస్ నిమిత్తం భారీ ఆకర్షణీయ ప్యాకేజీ అమలు చేయనున్నట్లు సమాచారం. 

Govt proposes Rs 74k cr bailout for BSNL, MTNL
Author
Hyderabad, First Published Jul 3, 2019, 10:44 AM IST

న్యూఢిల్లీ: ప్రభుత్వం సాచివేత ధోరణులు, కార్పొరేట్ సంస్థల మాదిరిగా ప్రోత్సాహాల నిరాకరణ ఫలితంగా పూర్తిగా అప్పుల ఊబిలో చిక్కుకున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ భవితవ్యం ప్రశ్నార్థకమైంది. ఈ తరుణంలో కేంద్రం బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలకు రూ.74 వేల కోట్ల బెయిలౌట్ ఇచ్చే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 

 

దీనికి అనుసంధానంగా వేల మంది బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఉద్యోగులను ఇంటికి సాగనంపేందుకు వ్యూహాన్ని ఖరారు చేసినట్లు సమాచారం. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను ఇంటికి పంపేందుకు పెట్టిన ముద్దు పేరు ‘వీఆర్ఎస్’ తీసుకునే వారికి ఎక్స్ గ్రేషియా రూపంలో అదనంగా ఐదు శాతం పరిహారం ముట్టజెప్పి బయటకు పంపేస్తారన్నమాట. 

 

ఇప్పటివరకు 4జీ సేవల సంగతే మరిచిన బీఎస్ఎన్ఎల్ సంస్థకు ఆ స్పెక్ట్రం అందేలా చూడటంతోపాటు విస్తరణకు అయ్యేందుకు పెట్టుబడి వ్యయం అందజేసేందుకు కూడా సిద్ధమైంది. 2018-19 ఆర్థిక సంవత్సరం అంచనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో అత్యధిక నష్టాలు రూ.13,804 కోట్లు ఉన్నదీ బీఎస్ఎన్ఎల్.. ఎంటీఎన్ఎల్ నష్టాలు రూ.3,398 కోట్లు. జస్ట్ ఎయిరిండియా కంటే తక్కువ నష్టాలన్నమాట.

 

ఎయిరిండియా తర్వాత రెండు టెలికం ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ ఖజానాను తోడేస్తున్నాయని అధికార వర్గాల కథనం. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలను కాపాడుకునేందుకు కేంద్ర క్యాబినెట్ రూపొందించిన డ్రాఫ్ట్ ప్రకారం రూ.20 వేల కోట్ల విలువైన 4జీ స్పెక్ట్రం కేటాయించడంతోపాటు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల బకాయిలు రూ.13 వేల కోట్లు కూడా అవి చెల్లించేస్తాయి. 

 

ఇవి కాక ప్రభుత్వం రూ.40 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. ఈ మొత్తం సిబ్బంది ముందుగానే స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కింద వెళ్లిపోయేందుకు ప్యాకేజీ కింద అందజేస్తారన్నమాట. పూర్తిగా రెండు సంస్థలను మూసివేయాలంటే రూ.1.2 లక్షల కోట్ల ఖర్చు అవసరమన్న అభిప్రాయం వినవచ్చింది.

 

అందుకే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లేందుకు సర్కార్ సిద్దమైందన్న మాట. అందులో భాగంగా ఇతర సంస్థలతో జాయింట్ వెంచర్ ప్రతిపాదనను కూడా కేంద్రం బెయిలౌట్ ప్యాకేజీలో పరిశీలిస్తోంది. 


గమ్మత్తేమిటంటే ప్రైవేట్ టెలికం ఆపరేటర్లు 4జీ సేవలందిస్తూ 5జీ సేవల ట్రయల్స్ దిశగా ముందుకు వెళుతుంటే బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలు స్పీడందుకోకపోగా, సమర్థవంతమైన టెక్నాలజీ వినియోగించుకోలేకపోతున్నాయి. అందుకు ప్రభుత్వం అనుమతి కూడా ఇవ్వాల్సి ఉంటుంది అది వేరే విషయం. 

 

ఒకప్పుడు మార్కెట్‌ను ఏలిన బీఎస్ఎన్ఎల్ ప్రస్తుత మార్కెట్ షేర్ పడిపోయింది. సగటు వినియోగదారుడి నుంచి బీఎస్ఎన్ఎల్ సంస్థకు వచ్చే రెవెన్యూ రూ.38 మాత్రమే. ప్రైవేట్ సంస్థలు రూ.70 అర్పు పొందుతున్నాయి మరి. ఈ నేపథ్యంలో సంస్థపై ఆర్థిక భారం పడకుండా 60 ఏళ్ల రిటైర్మెంట్ వయస్సును 58కి తగ్గించి ఆకర్షణీయమైన వీఆర్ఎస్ ప్యాకేజీ అందజేసి ఉద్యోగులను సాగనంపే యోచనలోనూ కేంద్రం ఉంది.

 

దాని వెంటనే అగ్రెస్సివ్‌గా బీఎస్ఎన్ఎల్ ఫోన్ కాల్స్ చార్జింగ్ టారిఫ్స్ పెంచే ఆలోచన కూడా చేస్తోంది. వీటికి తోడుగా సంస్థ టవర్స్, అఫిసియల్ ఫైబర్ నెట్ వర్క్, భూములు, స్థిరాస్తులను అమ్మేయడానికి కూడా బీఎస్ఎన్ఎల్ సిద్ధమైందన్నమాట. 

 

అందుకే.. కేంద్ర ప్రభుత్వం బెయిల్ ఔట్ అమలులోకి తెచ్చే ప్రతిపాదన పరిశీలిస్తున్నందు వల్లే ‘భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) మూసివేయాలనే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదు. వీటి పునరుద్ధరణ ప్రణాళికను రూపొందించే పని జరుగుతోంది’అని టెలికాం మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ ఇటీవల స్పష్టత ఇచ్చారు. 

 

అయినా బీఎస్ఎన్ఎల్ సంస్థను మూసివేస్తారనే ఊహాగానాలు అక్కడక్కడా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ తరహా ఊహాగానాలను సమర్ధిస్తూ కారణాలు చెప్పే వాళ్లూ ఉన్నారు. ఖండించే వాళ్లూ కనిపిస్తున్నారు. ఆఖరుకు తాజాగా ఆ సంస్థ కూడా మూసివేతకు అవకాశాల్లేవని బీఎస్ఎల్ స్పష్టత ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

 

మరి ప్రభుత్వం నిజంగానే బీఎస్‌ఎన్‌ఎల్‌ పునరుద్ధరణ ప్రణాళికకు కసరత్తు చేస్తుందా? అంటే అవుననే చెప్పొచ్చు. ఎందుకంటే పునరుద్ధరణ ప్రణాళిక రూపకల్పన బాధ్యతలను ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (అహ్మదాబాద్‌), డెలాయిట్‌కు అప్పగించినట్లు మంత్రి రవిశంకర్‌ చెప్పారు. 

 

ఈ ప్రణాళిక కింద చేసిన సిఫారసులకు రెండు సంస్థల బోర్డుల అనుమతుల ఆధారంగా పునరుద్ధరణ ప్రక్రియను చేపడతామని స్పష్టత ఇచ్చారు. అయితే ఈ ప్రణాళిక రూపొందేందుకు ఎంత సమయం పడుతుందో.. నిధుల లేమితో అప్పటివరకు ఈ సంస్థ ఎలా మనుగడ సాగిస్తుందో అన్నది ఇప్పుడు కీలకం.

 

నిధుల కటకటతో 20 ఏళ్లలో తొలిసారిగా గత నెల ఉద్యోగుల జీతాలను సకాలంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ చెల్లించలేకపోయింది. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూసి చివరకు అంతర్గతంగానే రూ.2000 కోట్లు సమీకరించి వేతనాలు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ రూ.2000 కోట్లలో రూ.750 కోట్లు జీతాలకు పోగా.. రూ.800 కోట్లను అప్పుల వడ్డీలు కట్టింది. 

 

మరోవైపు రూ.14,000 కోట్లు కావాలంటూ టెలికాం విభాగాన్ని అడిగినా.. ఇప్పటివరకు ఆ నిధులు రాలేదని సమాచారం. అయితే ప్రతినెలా ఉద్యోగుల జీత భత్యాలు, అప్పులపై వడ్డీలు, కార్యకలాపాల ఖర్చులు లాంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటే ప్రభుత్వ సాయం ఏ మూలకనే అభిప్రాయం వినిపిస్తోంది. 

 

ఏడాదికి మించి ఇవి సరిపోవని, మళ్లీ మళ్లీ నిధుల సాయం అందించాల్సిన పరిస్థితి రావొచ్చని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతీసారి ఇది ప్రభుత్వానికి భారంగా మారొచ్చని అంటున్నారు. మరి ఈ విషయాలన్నింటిని లెక్కలోకి తీసుకొని సమగ్రమైన పునరుద్ధరణ ప్రణాళికను తీసుకొస్తేనే బీఎస్‌ఎన్‌ఎల్‌ గాడిన పడే అవకాశం ఉంటుంది. లేకుంటే దినదినగండంగా గడపాల్సిన పరిస్థితి నెలకొంటుంది.

 

రిలయన్స్‌ జియో రాకతో టెలికాం రంగంలో పోటీ పరిస్థితులు మారిపోయాయి. టారీఫ్‌లు, ఛార్జీల విషయంలో కంపెనీలు తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌ లాంటి ప్రభుత రంగ సంస్థలే కాదు.. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌- ఐడియా లాంటి ప్రైవేట్‌ రంగ టెలికాంలు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇది ప్రైవేట్ టెలికం ప్రొవైడర్ల లాభదాయకతపైనా ప్రభావం చూపుతోంది. 

 

ప్రైవేట్‌ రంగ టెలికాం సంస్థలకు రూ.లక్షల కోట్లలో అప్పు ఉండగా.. బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.వేల కోట్లలోనే అప్పులు చెల్లించాల్సి ఉంది. అయితే ఉద్యోగుల సంఖ్య విషయంలో మాత్రమే ప్రైవేట్‌ సంస్థలకు అందనంత దూరంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉంది. బీఎస్‌ఎన్‌ఎల్‌లో 1.70 లక్షల మంది పనిచేస్తుంటే.. మిగతా సంస్థల్లో దాదాపు 30,000- 40,000 మంది సిబ్బంది ఉన్నారు. 

 

ఉద్యోగుల వేతన వ్యయాలు సంస్థకు భారంగా మారాయి. పునరుద్ధరణ ప్రణాళికలో ప్రభుత్వం ఈ అంశంపై ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉందని అంటున్నారు.  ప్రస్తుతం జీతాలు సకాలంలో చెల్లించలేని పరిస్థితిలో ఉందంటే సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. సహకారం అందించాలని ప్రభుత్వాన్ని ఇప్పటికే ఆ సంస్థ కోరింది.

 

బీఎస్‌ఎన్‌లకు సాయం అందించమని ప్రభుత్వం కూడా బ్యాంకులకు తెలిపింది. అయితే ఇప్పుడున్న రుణాలే చెల్లించలేని స్థితిలో ఉన్న సంస్థకు మళ్లీ రుణ సాయం అందించేందుకు బ్యాంకులు ఎంత వరకు ముందుకొస్తాయన్నదే ఇప్పుడు ప్రశ్న.

 

బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా  రుణాలు చెల్లించేందుకు, మూలధన వ్యయాల అవసరాలకు నిధుల సాయం చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఉద్యోగుల వేతనాల తగ్గింపుతోపాటు సిబ్బంది సంఖ్యలో కోత విధించవచ్చు. ఇంకా సిబ్బంది పదవీ విరమణ వయసును తగ్గించి, టెండర్లు, కొనుగోళ్లు ఆర్డర్లను నిలిపివేయడం     వంటి చర్యలు చేపట్టొచ్చు. 

 

వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ సేవలు ఆశించిన స్థాయిలో లేకపోవడం దాని రాబడి, లాభాలపై పడుతుందన్న విమర్శ ఉంది. టెక్నాలజీని వేగంగా అంది పుచ్చుకోలేకపోవడం మరో విమర్శ.  మిగతా టెలికం సంస్థలన్నీ 5జీపై దృష్టి పెడుతున్న తరుణంలో 4జీ నెట్‌వర్క్‌కు ఇంకా ఆమడ దూరంలో ఉండటం ఇబ్బందికర పరిణామమే.

Follow Us:
Download App:
  • android
  • ios