ట్విట్టర్‌పై పార్లమెంటరీ ప్యానెల్ ఫైర్.. గట్టి హెచ్చరిక పంపాలని యోచన
సోషల్ మీడియా వేదిక ‘ట్విట్టర్’ యాజమాన్యం తీరుపై ఐటీ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం భగ్గుమంటోంది. దేశ పౌరుల ప్రయోజనార్థం వారి హక్కులపై చర్చించేందుకు సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు తమ ముందు హాజరు కావాలని ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీకి పార్లమెంటరీ స్థాయీ సంఘం సమన్లు జారీ చేసింది.
సోషల్ మీడియా వేదిక ‘ట్విట్టర్’ యాజమాన్యం తీరుపై ఐటీ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం భగ్గుమంటోంది. దేశ పౌరుల ప్రయోజనార్థం వారి హక్కులపై చర్చించేందుకు సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు తమ ముందు హాజరు కావాలని ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీకి పార్లమెంటరీ స్థాయీ సంఘం సమన్లు జారీ చేసింది.
కానీ తమకు సమయం సరిపోదని ట్విట్టర్ శనివారం తేల్చేయడంతో అగ్గిమీద గుగ్గిలమవుతోంది. అతి తక్కువ సమయంలో తాము హాజరు కావడం కష్టమని ట్విట్టర్ చేసిన ప్రకటన పార్లమెంటరీ స్థాయీ సంఘానికి మింగుడు పడటం లేదు. దీనికి ప్రతిగా గట్టి హెచ్చరిక పంపాలని భావిస్తోంది.
పార్లమెంటరీ స్థాయీ సంఘం హక్కుల ఉల్లంఘన అంశాన్ని ముందుకు తేవాలని భావిస్తున్నట్లు సమాచారం. ట్విట్టర్ దిక్కారం వినిపించినందుకు దానికి వ్యతిరేకంగా పార్లమెంటరీ స్థాయీ సంఘం నిర్ణయం తీసుకోనున్నదని సంఘం సన్నిహిత వర్గాల కథనం. ఈ స్థాయీ సంఘానికి బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ సారథ్యం వహిస్తున్నారు.
అనురాగ్ ఠాకూర్ సారథ్యంలోని ఈ స్థాయీ సంఘం ట్విట్టర్ అధినేతకు సమన్లు జారీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మార్చి, ఏప్రిల్ నెలల్లో సమావేశానికి హాజరయ్యేందుకు సిద్ధమని ట్విట్టర్ చేసిన అభ్యర్థనపై స్థాయీ సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
మార్చి, ఏప్రిల్ నెలల్లో లోక్ సభ ఎన్నికల హడావుడి మొదలవుతుందని, అప్పుడు ఎవరూ అందుబాటులో ఉండరని అధికారులు తెలిపారు. తొలుత ఈ నెల ఏడో తేదీనే ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీతో భేటీ కావాలని నిర్ణయించినా.. తర్వాత 11వ తేదీకి వాయిదా వేసింది.
పది రోజుల టైం కూడా తమకు చాలా తక్కువ సమయం అని, తాము పూర్తి రెస్పాన్సిబిలిటీతో వ్యవహరిస్తామని ట్విట్టర్ పేర్కొంది. జాక్ డోర్సీ గానీ, ఆయన ప్రతినిధి గానీ తమ కమిటీ ముందుకు రావాలని స్థాయీ సంఘం సూచించింది. అసలు సంగతేమిటంటే ప్రభుత్వ పనితీరుపై ట్విట్టర్‌లో వస్తున్న వ్యతిరేక ప్రచారం పార్లమెంటరీ స్థాయీ సంఘం ద్రుష్టిలో తప్పుడు కథనాల సారాంశంగా కనిపిస్తుండటమే కారణం.
కాగా సోషల్ మీడియా వేదికల్లో యూజర్ల డేటా భద్రతపై చెలరేగుతున్న ఆందోళనలు, రానున్న ఎన్నికలు నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. మరోవైపు ట్విటర్ డేటా భద్రతపై గ్లోబల్‌గా విచారణను ఎదుర్కొంటోంది. ఈ కోవలో అమెరికా, సింగపూర్, ఈయూ తర్వాత, ఇండియా నాలుగదేశంగా నిలిచింది.