ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ కి యూకే పోలీసులు భారీ షాకిచ్చారు. పరిమితికి మించిన వేగంతో కారు నడిపినందుకు ట్రాఫిక్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా... ఆయన సంవత్సరం పాటు డ్రైవింగ్ చేయకూడదంటూ.. వింబుల్డన్ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి ఓవర్ స్పీడ్ తో షేన్ వార్న్ కారు నడపడం ఇదేమి తొలిసారి కాదు.  మూడేళ్లలో ఇది ఆరోసారి కావడం గమనార్హం. ఇప్పటికే ఐదుసార్లు నిబంధనలు ఉల్లంఘించిన వార్న్ లైసెన్స్ పై 15 పాయింట్లు ఉన్నాయి. తాజాగా, గత ఆగస్టులో కెన్సింగ్టన్ లో గంటకు 40మైళ్ల వేగంతో వెళ్లాల్సిన జోన్ లో వార్న్ 47మైళ్ల వేగంతో కారు నడుపుతూ పోలీసులకు చిక్కాడు.

కేసును విచారించిన న్యాయస్థానం తాజాగా అతనిపై ఏడాది నిషేధం విధించడంతోపాటు రూ.1.62 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఇదిలా ఉండగా... కేసు విచారణలో షేన్ వార్న్ తాను చేసిన తప్పును అంగీకరించడం విశేషం. అద్దెకు తీసుకున్న జాగ్వార్ కారులో వెళ్తూ నిబంధనలను ఉల్లంఘించినట్లు అంగీకరించాడు.దీంతో కోర్టు అతని లైసెన్స్ ను ఏడాదిపాటు నిషేధించింది.