యువ క్రికెటర్ రిషబ్ పంత్ కి మరోసారి నిరాశ ఎదురైంది. ఐపీఎల్ మ్యాచ్ లో గాయపడిన టీం ఇండియా ఆటగాడు కేదార్ జాదవ్... గాయం నుంచి కోలుకున్నాడు. చివరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా జాదవ్‌ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. నొప్పి ఎక్కువ కావడంతో.. మైదానంలోనే జాదవ్ తీవ్ర ఇబ్బందిపడ్డాడు.

దీంతో అప్పటి కప్పుడే జాదవ్ ని చికిత్స నిమిత్తం జట్టు నుంచి పంపించేశారు. అయితే... ఈ గాయం కారణంగా జాదవ్ వరల్డ్ కప్ కి దూరం అవుతాడని అందరూ భావించారు. ఆ స్థానంలో రిషబ్ పంత్, అంబటి రాయుడు.. వీళ్లిద్దరిలో ఎవరో ఒకరికి చోటు దక్కుతుందనే ప్రచారం జరిగింది. కాగా.. ఆ ప్రచారాలకు జాదవ్ తెర దంచాడు.

టీమిండియా ఫిజియో పాట్రిక్‌ ఫర్హార్ట్‌ తాజాగా.. జాదవ్ ఫిట్ నెస్ పై స్పందించాడు. జాదవ్‌కి ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించి అతను ఫిట్‌గా ఉన్నాడని స్పష్టం చేశాడు. మే 22న ప్రపంచకప్‌కు మిగతా జట్టు సభ్యులందరితో కలిసి ఇంగ్లాండ్‌ వెళ్లడానికి జాదవ్‌ సిద్ధమవుతున్నాడు. మెగా టోర్నీలో మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌గా జాదవ్‌ కీలకం కానున్నాడు.