టీం ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ ని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. గల్లీ క్రికెట్ కి తప్ప.. అంతర్జాతీయ క్రికెట్ కి పనికి రాడంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. టీం ఇండియాలో అవకాశం కోసం ఎందరో కలలు కంటూ ఉంటారని... అలాంటి అవకాశం పంత్ కి సులభంగా దొరికినా... దానిని సద్వినియోగం చేసుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. 

ఇంతకీ మ్యాటరేంటంటే.... యువ క్రికెటర్ రిషబ్ పంత్ కి... పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండానే టీం ఇండియాలో చోటు దక్కింది. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్థానాన్ని పంత్ భర్తీ చేస్తాడని అందరూ భావించారు. ఆ ఉద్దేశంతోనే పంత్ ని జట్టులోకి తీసుకున్నారు. అయితే... పంత్ మాత్రం తన ఆటతో అభిమానులను నిరాశపరుస్తున్నాడు.

వరుస అవకాశాలు వస్తున్నా కూడా.. పంత్ తనను తాను నిరూపించుకోలేకపోతున్నాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో క్రీజులో నిలిచి పరుగులు చేయాల్సిన సమయంలో పంత్ అనవసర షాట్‌కు ప్రయత్నించి ఔటైన సంగతి తెలిసిందే. దీంతో నెటిజన్లు పంత్‌పై ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు. పంత్.. గల్లీ క్రికెట్‌కు తప్ప అంతర్జాతీయ క్రికెట్‌కు పనికిరాడని విమర్శిస్తున్నారు. 

బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, నవదీప్ షైనీల కంటే పంత్ ఘోరంగా బ్యాటింగ్ చేస్తున్నాడని ఒక నెటిజన్ ట్వీట్ చేశారు. సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌ వంటి ప్రతిభావంతులను వదిలేసి పంత్‌కు పదేపదే అవకాశాలు ఎందుకు ఇస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారు. అలాగే మంచి బేబీ సిట్టర్ అయిన పంత్ క్రికెట్ వదిలేసి పిల్లలతో ఆడకుంటే మంచిదని కొందరు విమర్శిస్తున్నారు. టీ-20 ప్రపంచకప్‌నకు ఎక్కువ సమయం లేనందున పంత్ విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవాలని కొందరు సూచిస్తున్నారు.