టీం ఇండియా మాజీ క్రికెటర్ మాధవ్ ఆప్టే(86) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.

1950వ సంవత్సర కాలంలో భారత టెస్టు జట్టులో ఓపెనర్ గా సేవలందించిన మాధవ్, ఏడు టెస్టులు ఆడారు. వెస్టిండీస్ కు చెందిన నాటి దిగ్గజ బౌలర్లు ఫ్రాంక్‌ కింగ్‌, జెర్రీ గోమెజ్‌, ఫ్రాంక్‌ వారెల్‌ లను దీటుగా ఎదుర్కొంటూ రెండు సెంచరీలు సాధించారు. మొత్తంమీద 67 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన ఆయన 3,336 పరులుగు చేశారు. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగానూ సేవలందించారు. ఇదే క్లబ్ తరఫున సచిన్ టెండూల్కర్ 15 ఏళ్ల వయసులోనే మ్యాచ్ లు ఆడి సత్తా చాటారు. మాధవ్ ఆప్టే మృతికి బీసీసీఐ, క్రికెటర్ యూసుఫ్ పఠార్ తో పాటు పలువురు క్రికెటర్లు సంతాపం తెలిపారు.