మహిళా క్రీడాకారిణి ఒకరు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రముఖ రెజ్లర్ బబితా ఫోగట్ సోమవారం బీజేపీలో చేరారు. ఢిల్లీలోని హరియాణా భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమక్షంలో బబిత, ఆమె తండ్రి మహవీర్ సింగ్ ఫొగట్ కషాయం రంగు జెండా కప్పుకొని కమలం గూటికి చేరారు. అనంతరం బీజేపీ కార్య నిర్వాహక అధ్యక్షుడు జేపీ జడ్డాను కలిశారు.

పార్టీలో చేరడానికి ముందు మహవీర్ ఫొగట్ మీడియాతో మాట్లాడారు. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసి బీజేపీ ప్రభుత్వం చాలా మంచి పని చేసిందన్నారు. మనోహర్ లాల్ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వం కూడా చాలా పారదర్శకంగా పనిచేస్తుందన్నారు. బీజేపీ చేస్తున్న కార్యక్రమాల పట్ల తాము ఆకర్షితులం అయ్యామని... అందుకే తాను , బబిత బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

బబిత హర్యానా పోలీసు విభాగంలో ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. అయితే.. ప్రస్తుతం ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు ఫోగట్ కుటుంబం తెలిపింది. ఇటీవల కశ్మీరీ యువతులపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా అవి దుమారం రేపాయి. అయితే... ఆయన చేసిన కామెంట్స్ ని బబిత సమర్థించడం గమనార్హం.