Asianet News TeluguAsianet News Telugu

GO 317: స్థానికత ప్రస్తావన లేకండా ఉద్యోగుల విభజన

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి నూతన ఉత్తర్వులకు అనుగుణంగా లోకల్ క్యాడర్లలో ఉద్యోగుల విభజన అత్యంత వివాదాస్పదంగా మారింది. సీనియారిటీ ఆధారంగా జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల్లో ఉద్యోగుల కెటాయింపు జరపాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా విడుదల చేసిన జిఓ 317 రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన అలజడికి కారణమైంది.

tsutf secretary chava ravi analysis on GO 317
Author
Hyderabad, First Published Jan 7, 2022, 3:17 PM IST

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి నూతన ఉత్తర్వులకు అనుగుణంగా లోకల్ క్యాడర్లలో ఉద్యోగుల విభజన అత్యంత వివాదాస్పదంగా మారింది. సీనియారిటీ ఆధారంగా జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల్లో ఉద్యోగుల కెటాయింపు జరపాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా విడుదల చేసిన జిఓ 317 రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన అలజడికి కారణమైంది. ఏ స్థానికత సెంటిమెంటును ఉపయోగించుకొని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జరిగిందో ఆ స్థానికత పునాదులనే ధ్వసం చేయబూనుకున్న ప్రభుత్వ వైఖరిపై ఉపాధ్యాయులు, ఉద్యోగులు మండిపడుతున్నారు. బలవంతపు బదిలీలతో స్వంత ఊరుకు, అయిన వాళ్ళకూ దూరమై పొరుగు జిల్లాలో పరాయివాళ్ళుగా రిటైర్మెంట్ వరకూ కొనసాగాల్సిందేనా అని మధన పడుతున్నారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం అప్పటివరకూ ఉన్న 10 జిల్లాలను 2016 అక్టోబర్ 11 నుండి 31 జిల్లాలుగా పునర్విభజించి, జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల ఏర్పాటును అందరూ స్వాగతించినప్పటికీ జోనల్ వ్యవస్థ రద్దును టిఎస్ యుటిఎఫ్, యుయస్పీసి తో సహా పలుసంఘాలు, పలువురు మేధావులు తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ ప్రాంతీయ అసమానతలు కొనసాగుతున్నాయని, విద్య, ఉద్యోగాల్లో స్థానికులకు సముచితమైన అవకాశాలు కల్పించటానికి వీలుగా ఏర్పాటైన జోనల్ వ్యవస్థను రద్దు చేయటం సమంజసం కాదని ఆనాడే స్పష్టంగా చెప్పాము. 

అయినా ఆర్టికల్ 371(డి)కి సవరణ చేయకుండా జోనల్ వ్యవస్థ రద్దు అసాధ్యమని కూడా స్పష్టం చేశాము. రెండు జోన్లను ఆరు లేదా అంతకంటే ఎక్కువ చేయాలని ప్రతిపాదించాము. జోనల్ వ్యవస్థ రక్షణ కోసం ఐక్య ఉద్యమాన్ని నిర్వహించాము. సరిగ్గా సంవత్సరం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 31 జిల్లాలను  ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు గా ఏర్పాటు చేస్తామని ప్రకటించగానే జోనల్ వ్యవస్థ వద్దే వద్దన్న టిఎన్జీఓఎ, టిజిఓఎ, పిఆర్టియు సంఘాలు నాటకీయంగా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. జిల్లా కార్యాలయాల్లోని ఉద్యోగులను ఆర్డర్ టు సర్వ్ పేరిట తాత్కాలికంగా కొత్త జిల్లాలకు కెటాయించారు. ఉపాధ్యాయులకు, ఇతర ఉద్యోగులకు వారు పనిచేస్తున్న పాఠశాల/ కార్యాలయం ఏ జిల్లా పరిధిలోకి వస్తే ఆ జిల్లా ఉద్యోగులుగా పరిగణించబడ్డారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు ఉమ్మడి రాష్ట్రంలో అమలులో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేస్తూ నూతన ప్రెసిడెన్షియల్ ఆర్డర్  ది తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యులేషన్ అఫ్ డైరెక్ట్ రిక్రూట్ మెంట్) ఆర్డర్, 2018 (పిఓ - 2018) జిఎస్ఆర్ 820(E)ఆగస్టు 29న వెలువడగా రాష్ట్ర ప్రభుత్వం జిఓ 124 జిఎడి తేదీ 30.08.2018 ద్వారా అమలులోకి తెచ్చింది. ఆ తర్వాత 2019 ఫిబ్రవరిలో ఏర్పాటు చేసిన మరో రెండు జిల్లాలను చేర్చి, వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్ లోకి మార్చి రాష్ట్ర పతి ఉత్తర్వులకు సవరణ ఉత్తర్వులు జిఎస్ఆర్ 279(E) 2021ఏప్రిల్ 16న విడుదల కాగా రాష్ట్ర ప్రభుత్వం జిఓ 128 జిఎడి తేదీ 30.06.2021 ద్వారా అమలులోకి తెచ్చింది. 

రాష్ట్రపతి ఉత్తర్వులు (పిఓ - 2018) విడుదలైన మూడు సంవత్సరాల్లోగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను స్థానిక (జిల్లా, జోనల్, మల్టీజోనల్) క్యాడర్లుగా వర్గీకరించాలనే నిబంధన రాష్ట్రపతి ఉత్తర్వుల్లోనే ఉన్నది. తుది గడువు సమీపిస్తున్న తరుణంలో ఆగస్టు నెలలో ప్రభుత్వం హడావుడిగా శాఖల వారీ పోస్టుల లోకల్ క్యాడర్ క్లాసిఫికేషన్ ఉత్తర్వులు (జిఎడి జిఓలు 141 నుండి 258 వరకు) విడుదల చేసింది. అప్పటినుండి వివిధ లోకల్ క్యాడర్లలో ఉద్యోగుల కెటాయింపు ఎలా జరుపుతారనే అంశంపై ఉద్యోగ వర్గాల్లో చర్చోప చర్చలు జరిగాయి. స్థానికత ఆధారంగా సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తూ కెటాయింపులు జరుగుతాయని అందరూ భావించారు. 

శాశ్వత కెటాయింపులు కనుక ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో విస్తృమైన చర్చలు జరుగుతాయని భావించారు. కానీ అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకటో రెండో సంఘాలతో రహస్యంగా సంప్రదింపులు జరిపి ఏకపక్షంగా డిసెంబర్ 6న విడుదల చేసిన జిఓ 317 రాష్ట్ర ఉద్యోగ వర్గంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఈ జిఓ ప్రభావం అర్థమయ్యేలోగానే ఉద్యోగుల కెటాయింపు పూర్తి చేసి కొత్త ప్రాంతాల్లో రిపోర్టు చేయించాలన్నంత అత్యుత్సాహం ప్రభుత్వ పెద్దల్లో కనుపించింది. ఎందుకంత ఆతురతో అర్థం కాదు. ఎవరి సలహాలతో నడిపిస్తున్నారో తెలియదు. క్షేత్రస్థాయిలో ఉద్యోగుల మనోభావాలను గమనించకుండా హైదరాబాద్ చుట్టూ ఉన్న కొద్దిమంది స్థానికేతరుల ప్రయోజనాలు కాపాడటం కోసం స్థానికత ఊసే లేకుండా ఉద్యోగుల కెటాయింపు నిబంధనలు రూపొందించటం ఆశ్చర్యకరం.

  • లోకల్ క్యాడర్లలో ఉద్యోగుల కెటాయింపు ఏ ప్రాతిపదికన చేయాలో పిఓ - 1975 లోనూ,పిఓ - 2018 లోనూ 4వ పేరాలో ఒకే విధంగా పేర్కొన్నారు.
  • స్థానిక క్యాడర్లలో పాలనావసరాలు, 
  • వ్యక్తుల వయస్సు, సీనియారిటీ సమతుల్యత, 
  • ఆ లోకల్ ఏరియాలో చేసిన సర్వీసు, 
  • ఆయా ప్రాంతంలోని భాష, చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండటం అనే అంశాలలో అన్నీ లేదా కొన్నింటిని పరిగణనలోకి తీసుకుని సంబంధిత వ్యక్తుల ప్రాధాన్యతల ఆధారంగా కెటాయింపు జరపాలని సూచించబడింది. 

రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం సంబంధిత క్యాడర్ సీనియారిటీని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నది. ఖాళీలను దామాషాలో పంచి పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య ఆధారంగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను ఆ దామాషాలో కెటాయించాలని ఆదేశించింది. 70% పైబడిన వైకల్యం కలిగిన దివ్యాంగులు, మానసిక వైకల్యం కలిగిన పిల్లల తల్లిదండ్రులు, కారుణ్య నియామకం ద్వారా నియమితులైన వితంతువులు, క్యాన్సర్, న్యూరో సర్జరీ, కిడ్నీ, లివర్ మార్పిడి, ఓపెన్ హార్ట్ సరజరీ జరిగిన ఉద్యోగులకు ప్రాధాన్యత కల్పించారు. ఈ కెటాయింపు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ల్లో పని చేస్తున్న ఉద్యోగ దంపతులు వేర్వేరు క్యాడర్లకు కెటాయించబడితే క్యాడర్ మార్పు కోసం ఆప్షన్ అవకాశం ఇవ్వాలి. పరిపాలనా అవసరాలు, ఖాళీల లభ్యత మేరకు ఆచరణ సాధ్యమైన రీతిలో భార్యాభర్తలను ఒకే లోకల్ క్యాడర్ లో సర్దుబాటు చేయాలన్నారు. ఉద్యోగుల కెటాయింపు కోసం జిల్లా, రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేశారు.

జిఓలో ఉన్న లోపాలు
1. స్థానికతను పరిగణించకపోవటం
2. దివ్యాంగుల వైకల్యం పర్సంటేజి 70% గా నిర్ణయించటం,
3. ఆ ఏరియాలో చేసిన మొత్తం సర్వీసును పరిగణనలోకి తీసుకోకపోవటం,
4. కేంద్ర ప్రభుత్వ, పబ్లిక్ రంగ సంస్థల స్పౌజ్ ల ప్రస్తావన లేకపోవటం,
5. వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం.
6. మరికొన్ని దీర్ఘకాలిక జబ్బులను పరిగణనలోకి తీసుకోకపోవటం.

జిఓ విడుదలైన వెంటనే ఈ లోపాలను ఎత్తిచూపుతూ సవరించాలని టిఎస్ యుటిఎఫ్ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రికి,  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రాలు ఇచ్చాము. ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉపాధ్యాయుల్లో ఆందోళన వెల్లువెత్తింది. ఇది గమనించిన ప్రభుత్వం డిసెంబర్13 న విద్యాశాఖ మంత్రి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసింది. అన్ని సంఘాల ప్రతినిధులతో విడివిడిగా సమావేశం నిర్వహించారు. దాదాపు ఆరుగంటలపాటు జరిగిన సమావేశంలో సంఘాల అభిప్రాయాలను ఓపిగ్గా విన్నారు. వ్రాసుకున్నారు. ఇచ్చిన వినతిపత్రాలు తీసుకున్నారు కానీ ఒక్క సూచనను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. ప్రధాన కార్యదర్శిని కలిసి క్షేత్ర స్థాయిలో పరిస్థితిని వివరించే ప్రయత్నం చేయగా ఉపాధ్యాయులంతా సంతోషంగా ఉన్నారు. నాయకుల్లోనే అసంతృప్తి ఉందంటూ ఎద్దేవా చేశారు.

ఉపాధ్యాయుల నుండి ఒక్కరోజులో ఆప్షన్లు తీసుకున్నారు. రాత్రికి రాత్రే సీనియారిటీ లిస్ట్ తయారు చేయాలన్నారు. ఉపాధ్యాయుల బేసిక్ సీనియారిటీ జాబితాలు డిఈఓ కార్యాలయాల్లో లేనే లేవు. పాఠశాలల నుండి వివరాలు తెప్పించి హడావుడిగా డ్రాఫ్ట్ లిస్టులు ప్రకటించారు. కొన్ని జిల్లాల్లో సీనియారిటీ పై వచ్చిన అభ్యంతరాలను సవరించకుండానే ఫైనల్ చేసి అలొకేషన్ చేసేశారు. మహబూబ్ నగర్, వరంగల్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో సీనియారిటీ నిర్ణయం మరియు జిల్లాల కెటాయింపుల్లో అవకతవకలు జరిగాయని అత్యధికంగా పిర్యాదులు వచ్చాయి.

సీనియారిటీ జాబితాలు సమగ్రంగా తయారు చేయాలని, ఫైనల్ సీనియారిటీ లిస్ట్ ప్రకటించిన తర్వాత ఆప్షన్స్ రివైజ్ చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరితే పట్టించుకోలేదు. స్పెషల్ క్యాటగిరీ సర్టిఫికెట్స్ సరిగా పరిశీలించలేదు. ఎస్సీ, ఎస్టీ దామాషా పాటించలేదు. స్థానిక భాషలనూ పరిగణనలోకి తీసుకోలేదు. ఏజెన్సీ ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ప్రాంత ఉద్యోగులను వారి ఆప్షన్లకు భిన్నంగా మైదాన ప్రాంత మైన నిర్మల్ కు మంచిర్యాలకు,  ఆదివాసీ ప్రాంతమైన ములుగు జిల్లాకు మహబూబాబాద్ నుండి మైదాన ప్రాంత గిరిజనులను, మైదాన ప్రాంత గిరిజనులు ఉన్న మహబూబాబాద్ జిల్లాకు ములుగు జిల్లా ఆదివాసీలను  కేటాయించారు. 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మైదాన ప్రాంత గిరిజనేతరులను, మైదాన ప్రాంత గిరిజనులను ఆదివాసీ ప్రాంతాలైన ములుగు, భద్రాద్రి జిల్లాలకు కెటాయించారు. అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట ఏజెన్సీ ప్రాంత గిరిజనులను వారి ఆప్షన్ కు విరుద్ధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాపరిధిలోని అన్ని జిల్లాలకు కెటాయించారు. గిరిజనేతరులను అచ్చంపేట ప్రాంతానికి కెటాయించారు. జిల్లాల్లో ఎస్సీ ఉపాధ్యాయుల దామాషాను సక్రమంగా అమలు చేయలేదు. అలోకేషన్ అనంతరం స్పౌజ్, సీనియారిటీ, జిల్లాల కెటాయింపు పై కుప్పలు తెప్పలుగా అప్పీల్స్ వచ్చాయి. 

పిఓ - 2018 ప్రకారం అప్పీల్స్ కు అరవై రోజుల సమయం ఉంటుంది. కానీ జిఓ 317 లో నిర్దిష్టమైన గడువు ఇవ్వలేదు. అప్పీల్స్ ఏవి పరిష్కరించారో, ఏవి తిరస్కరించారో, కారణాలేమిటో కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదు. అంతా నోటి మాటలతోనే నడిపించేస్తున్నారు. లోకల్ క్యాడర్ల కెటాయింపు,  స్థానాల కెటాయింపు పారదర్శకంగా, సులభంగా జరగాలంటే వెబ్ కౌన్సెలింగ్ లేదా ప్రత్యక్ష కౌన్సెలింగ్ పద్దతి మేలు కానీ అందుకు భిన్నంగా  ఆప్షన్స్, కెటాయింపు ప్రక్రియను మాన్యువల్ గా చేపట్టి అధికారుల సమయాన్ని వృధా చేశారు. ఈ ప్రక్రియ మొదలైనప్పటి నుండి మరుసటి రోజు ఏం జరుగుతుందో డియస్ఈ కి గానీ కార్యదర్శికి గానీ సమాచారం లేనంత అయోమయం నెలకొన్నది. అధికారాలన్నీ సిఎస్ వద్దనే కేద్రీకృతం చేయబడినాయి. 

ప్రాథమిక సమాచారాన్నిబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో దాదాపు 40 వేలమంది, విద్యాశాఖలోనే 22,500 మంది ఇతర జిల్లాలకు కెటాయించబడినట్లు తెలుస్తోంది. సుమారు పది వేలమంది ఉపాధ్యాయులు తమ ఆప్షన్ కు విరుద్ధంగా వేరొక జిల్లాకు కెటాయించబడి స్థానిక జిల్లాకు శాశ్వతంగా దూరమయ్యారు. ఇదేమీ చిన్న సంఖ్య కాదు. అన్యాయం ఒకరికి జరిగినా అన్యాయమే. కొన్ని శాఖల్లో ఉద్యోగులకు జరిగిన అన్యాయం పై తమ సంఘాలు నోరు విప్పంటం లేదని, తమ గోడుపట్టించుకొనేవారే లేరని ఉద్యోగులు తమలో తాము కుమిలి పోతున్నారు. ఉదాహరణకు లోగడ జిల్లా క్యాడర్ లో ఉన్న ఎఎన్ఎం పోస్టును పిఓ 2018 ప్రకారం జోనల్ పోస్ట్ గా మార్చారు. భద్రాద్రి జోన్ నుండి బాసర, కాళేశ్వరం జోన్లకు, చార్మినార్ జోన్ నుండి జోగులాంబ జోన్ కు  కెటాయించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ సూపర్వైజర్లను భద్రాద్రి జోన్ నుండి బాసర జోన్ కు బదిలీ చేశారు. 

 పని చేస్తున్న జిల్లానే కోరుకున్న వారిని కదిలించకపోవటం కొంత ఉపశమనం అయితే ఉపాధ్యాయులకు పాఠశాలల కెటాయింపులో మారుమూల ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వటంతో బలవంతంగా ఇతర జిల్లాలకు కెటాయించబడినవారితో పాటు కోరుకుని స్వంత జిల్లాలకు వెళ్ళినవారు కూడా సంతోషంగా లేరు. ప్రస్తుత పోస్టింగ్స్ అన్నీ తాత్కాలికంగా(అడ్హాక్ గా) ప్రకటించి సాధారణ బదిలీల్లో స్టేషన్ సీనియారిటీ, సర్వీసు సీనియారిటీకి పాయింట్లు కేటాయించి బదిలీ కోరుకునే అవకాశం కల్పించాలని వారు కోరుకుంటున్నారు. 

ఈ సమస్యలను పట్టించుకోకుండా ముందుకు పోతున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా డిసెంబర్ 28న యుయస్పీసి ఆధ్వర్యంలో వందలాది ఉపాధ్యాయులు సచివాలయాన్ని ముట్టడించారు. వివిధ జిల్లాల్లో యుయస్పీసి, జాక్టో ఆధ్వర్యంలోనూ, బాధిత ఉపాధ్యాయులు స్వచ్చందంగానూ ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆ తర్వాత పలు రాజకీయ పార్టీలు కూడా ఉద్యోగుల సమస్యలపై స్పందించాయి. అయినా ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది.

 ప్రధానంగా సీనియర్లు ఎక్కువగా పట్టణ ప్రాంత జిల్లాలకు, జూనియర్లు ఎక్కువగా గ్రామీణ ప్రాంత జిల్లాలకూ కెటాయించబడినారు. పిఓ - 2018 పేరా 4లో పేర్కొన్న వయస్సు సమతుల్యతకు భంగం కలుగుతుంది. ఇది భవిష్యత్తులో సామాజిక సమస్యగా మారే ప్రమాదం లేకపోలేదు. పిఓ - 2018 ప్రకారం 95% ఉద్యోగాలు స్థానికులకే రిజర్వు చేశారు. అయితే నియామకాలు జరగాలంటే ఖాళీలుండాలి కదా.....రెండేళ్ళ తర్వాత రిటైర్మెంట్లు ప్రారంభమైతే పట్టణ ప్రాంత జిల్లాల్లో ఖాళీలు ఏర్పడతాయి. జూనియర్లు ఎక్కువగా కెటాయించబడిన జిల్లాల్లో పదిహేను, ఇరవై సంవత్సరాల వరకు రిటైర్మెంట్లు ఉండే అవకాశమే లేదు. 

ఆయా జిల్లాల నిరుద్యోగుల్లో అసహనం ప్రబలి లోకల్ - నాన్ లోకల్ విభజనతో స్థానికేతరులను వారి స్వంత జిల్లాలకు పంపాలంటూ మరలా జిఓ 610 లాంటి జిఓ కోసం వత్తిడి పెరగొచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా తెలంగాణ ప్రాంతంలో నియామకం అయిన వారిని, బదిలీలు పొందిన వారిని తమ తమ లోకల్ క్యాడర్లకు బదిలీ చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేసి జిఓ 610 సాధనలో కీలకపాత్ర పోషించిన టిఎన్జీఓఏ సంఘమే ఈరోజు స్థానికత అంశంపై మౌనంగా ఉండటం ఆశ్చర్యంగా ఉంది. జిఓ 610 వలన కేవలం ఆంధ్రా ఉద్యోగులను మాత్రమే వెనక్కి పంపలేదు. తెలంగాణ లోని వివిధ జిల్లాల నుండి వేరే జిల్లాల్లో నియామకం అయిన, బదిలీ అయిన ఉద్యోగులను కూడా వారి స్థానిక (స్వంత) క్యాడర్లకు పంపించారు. అదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో పునరావృతం కాదని అనుకోలేము.

రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన, పోరాటాలను గమనిస్తున్న ప్రభుత్వం ఇప్పటికైనా అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి క్షేత్ర స్థాయి సమస్యలను గుర్తెరిగి తదనుగుణంగా జిఓ 317ను సవరించాలి. వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. స్పౌజ్ మరియు పరస్పర బదిలీలకు అవకాశం ఇవ్వాలి. స్థానిక జిల్లాలకు దూరమైన ఉద్యోగులు, ఉపాధ్యాయులను అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులు మంజూరు చేసి స్వంత జిల్లాలకు తిరిగి పంపించాలి. లేదా భవిష్యత్తులో ఏర్పడే రిటర్మెంట్ ఖాళీలలో వారిని తాము కోరుకున్న సొంత జిల్లాకు బదిలీ చేస్తామనే అంశాన్ని ఉత్తర్వుల్లో పేర్కొనాలి. ఏ ఉద్యోగి ఎక్కడ పనిచేయాలో ఎంచుకునే స్వేచ్ఛ ఉద్యోగికే ఇవ్వండి. ఉద్యోగులు మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే సంతోషంగా పనిచేయగలరు. వారిని ప్రశాంతంగా పనిచేసేటట్లు చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే.

వ్యాసకర్త,

చావ రవి, ప్రధాన కార్యదర్శి, టిఎస్ యుటిఎఫ్.

Follow Us:
Download App:
  • android
  • ios