ఆదర్శం - అవశ్యం - విలీన వజ్రోత్సవం
పాలకులలో పదవి నుంచి దిగిపోయే అనివార్యతను కల్పించిన పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం. రైతాంగ సాయుధ పోరాటం లిఖించిన స్వర్ణాక్షర ఇతిహాసం సెప్టెంబర్ 17 అంటూ తెలంగాణ రచయితల సంఘం, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఘనపురం దేవేందర్ అందిస్తున్న వ్యాసం ఇది.
1948 సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టం. భారతదేశ చరిత్రలో విలువైన ఘట్టం. ప్రజల చైతన్యానికి నిలువెత్తు సాక్ష్యం. పాలకుల దాష్టీకాలను ఎదిరించి ప్రజలు సాధించిన విజయం సెప్టెంబర్ 17. రైతాంగ సాయుధ పోరాటం లిఖించిన స్వర్ణాక్షర ఇతిహాసం సెప్టెంబర్ 17. తెలంగాణ తల్లి భరతమాత ఒడిలో చేరిన అపూర్వ ఘట్టం ఈ సెప్టెంబర్ 17. ఈ చారిత్రాత్మక ఘట్టానికి కథానాయకులు తెలంగాణ ప్రజలే.
తెలంగాణ ప్రజలు నిర్బంధాలపై, నియంతృత్వంపై ధిక్కార స్వభావం కలిగిన వారు. తెలంగాణ ప్రజలు ఒంటరిగా పోరాటం చేయడానికి వెనుకాడని సాహసవంతులు. అందుకే రజాకార్ల ఆగడాలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. పాలకులలో పదవి నుంచి దిగిపోయే అనివార్యతను కల్పించిన పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం. ప్రజలకు నాయకత్వం వహించిన రైతాంగ సాయుధ పోరాట యోధులకు ఘనమైన నివాళులర్పించాల్సిన బాధ్యత మనది. తెలంగాణ భారతదేశంలో కలవాలన్నది ప్రజల ఆకాంక్ష. తెలంగాణది ఎప్పుడూ సమైక్యతాకాంక్షనే. అదే సెప్టెంబర్ 17 అనే మహా ఘట్టాన్ని లిఖించింది. ఈ మహా ఘట్టానికి 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75 వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భం ఇది.
తెలంగాణపై ఎప్పుడు కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. కొంత ఆలస్యమైనా తెలంగాణ వాటిని పటాపంచలు చేస్తూ, విజయం సాధిస్తూ వస్తూనే ఉంది. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది. ఆ వెంటనే ఆంధ్ర రాష్ట్రంతో కలపాలన్న కుట్రలు ప్రారంభమయ్యాయి. 1956లో తెలంగాణ ప్రజల అభీష్టానికి విరుద్ధంగా నవంబర్ ఒకటవ తేదీన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలను కలిపి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ దానిని ఆమోదించలేదు. పోరాటం సాగిస్తూనే ఉన్నారు. 58 సంవత్సరాల తర్వాత తమ పోరాటానికి ఫలితం దక్కించుకున్నారు. 2014 జూన్ రెండవ తేదీన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ప్రజల పోరాట పటిమ యావత్ దేశానికే కాదు, యావత్ ప్రపంచానికి చాటిచెప్పింది. తెలంగాణ భారత దేశంలో విలీనమైన తర్వాత ఇప్పటివరకు జరిగిన ప్రస్థానంలో అనేక ఘట్టాలను చరిత్రలో నిలిపింది. ఇప్పుడు ఏడాది పాటు సాగే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు మరో అపూర్వ ఘట్టంగా తెలంగాణ చరిత్రలో నిల్వనున్నాయి. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావును హృదయపూర్వకంగా అభినందించాల్సిందే. తెలంగాణ ప్రజలు పోరాటాన్ని శ్వాసిస్తారు. విశ్వసిస్తారు. తెలంగాణ ప్రజల బతుకే ఒక పోరాటం.
హైదరాబాదులో సైనిక చర్య జరిపి తెలంగాణను భారతదేశంలో కలిపారని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వాదనలను బలపరచడం అంటే పునాదులను మరిచి శిఖరాలను గుర్తించడమే. తెలంగాణ సాయుధ పోరాట పంథా ప్రజల ఆకాంక్షను బలంగా చాటింది. దాని ఫలితమే నిజాం భారతదేశంలో తన రాజ్యాన్ని విలీనం చేశాడు. అప్పటి భారత హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. అంతమత్రాన క్రెడిట్ కేవలం పటేల్ కు ఇవ్వాలన్న వాదన అంత సబబైంది కాదు.
సెప్టెంబర్ 17 విషయంలో ఇంకా భారతదేశంలో విలీనం కానీ సంస్థానాల రాజ్యాల విలీనంలో నాటి భారత ప్రధాని పండిత జవహర్లాల్ నెహ్రూ అనుమతి తీసుకొనిదే హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందుకు రాలేదు . భారతదేశంలో చేరాల్సిన సంస్థానాలు, చిన్న రాజ్యాలు భారతదేశంలో విలీనమయ్యాయి అంటే పండిత నెహ్రూ ప్రభుత్వం, అక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తీసుకున్న చర్యలే అనేది నిర్వివాదాంశం. సర్దార్ వల్లభాయ్ పటేల్ కు సమైక్యత మూర్తిమత్వం లభించిందంటే నాటి ప్రధాని నెహ్రూ ఇచ్చిన ఆదేశాలే అనేది కొంచెం ఆలోచిస్తే బోధపడుతుంది. పండిత నెహ్రూను విడదీసి సర్దార్ పటేల్ విజయాలను చూడగలగడం దృష్టిలోపమే అవుతుంది. తెలంగాణ విషయానికొస్తే తెలంగాణ రాష్ట్రం లేదా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అవడం అనేది నూటికి నూరు శాతం ఇక్కడి ప్రజల విజయం.
ఈ మహాఘట్టం జరిగి 74 సంవత్సరాల నుంచి 75 వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ శుభ సందర్భంలో ఈనాటి తరం ముందు నాటి సాయుధ పోరాట ఘట్టాలను నిలపాల్సినటువంటి బాధ్యత మన మీదుంది. ఆ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర కీలకమైంది. కమ్యూనిస్టుల పోరాట పంథా లేకుంటే తెలంగాణ ప్రజలు ఇక్కట్లు అంత తొందరగా తీరేవికావు. సెప్టెంబర్ 17 ఒక మతంపై మరో మతం సాధించిన విజయం కానే కాదు. దుర్మార్గ పాలకులపై ప్రజలు సాధించిన విజయమే ఇది. 1928లో ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో పురుడు పోసుకున్న పోరాటం తెలంగాణ సాయుధ పోరాటంగా పరిణామం చెంది విజయం దాకా నడిచింది.
మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణరెడ్డి, ముఖ్దుం మొహియుద్దిన్, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, రాజా బహదూర్ గౌర్, బద్దం ఎల్లారెడ్డి ఇలా ఎంతోమంది యోధానుయోధుల నాయకత్వంలో పోరాటం జరిగింది. లక్షలాది తెలంగాణ ప్రజలు నిస్వార్థంగా ఉద్యమంలో మమేకమయ్యారు. భూస్వామ్య దోపిడీలకు, రజాకారుల దుర్మార్గాలకు వ్యతిరేకంగా గొంతెత్తారు. 1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్రాన్ని పొందిన తర్వాత భారతదేశంలో లేని సంస్థానాలపై పోలీసు చర్యలకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. 1948 సెప్టెంబర్ 13న హైదరాబాద్ సంస్థానంలో పోలీస్ చర్య ప్రారంభమైంది. నిజాం సైన్యం, రజాకార్లు లొంగిపోవడంతో హైదరాబాద్ సంస్థానం సైన్యం హస్తగతమైంది. 1948 సెప్టెంబర్ 17 తర్వాత కూడా ఈ మహా పోరాటం కొనసాగింది. 1951 వరకు ఈ ఉద్యమం సాగింది. సైనిక పాలనలో రైతాంగ సాయుధ పోరాటం చేసిన వాళ్లపై అణిచివేత ప్రారంభమైంది. వేలాది ప్రజలు జైలు పాలయ్యారు. అనేక పరిణామాల అనంతరం 1951 అక్టోబర్ 21వ తేదీన భారత కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటాన్ని విరమించింది.
సైనిక చర్య జరగకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా నిజామును కూలదోసే వాళ్లమని తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి అన్న మాటలు ఈ సందర్భంగా మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భూస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా, రైతుల ప్రయోజనాల సాధనా ఉద్యమంగా , పాలకుల దుర్మార్గాలకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటం సెప్టెంబర్ 17 నేపథ్యంలో స్మరించుకోవాల్సిన ఘట్టం. "బండి ఎనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో వస్తావు కొడుకో నైజాం సర్కారోడా" అని సవాల్ చేసిన సాహిత్య సాంస్కృతిక గరిమ తెలంగాణది. తిరిగి ఆ పోరాటపంథా తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ అడుగడుగునా కనబడింది. మొక్కవోని దీక్షతో సొంత రాష్ట్రం సాధించుకునే వరకు సబ్బండవర్ణాలు చేసిన పోరాటం కూడా ఈ సందర్భంలో స్మరించుకోవడం సముచితం. 1969 త్యాగాలలోను ఈ తెలంగాణ తెగువ కనబడుతుంది.
నిస్వార్ధంగా త్యాగమైన అమరత్వం తెలంగాణ చరిత్రకు నేపథ్యం అనడంలో ఎటువంటి సందేహం లేదు. మహాత్మా గాంధీ అభినందించిన “గంగా జమున తహజీబ్” ఈ వజ్రోత్సవాలలో ప్రతిఫలించాలి. ఏడాది పాటు వివిధ సందర్భాలలో తెలంగాణ 33 జిల్లాలలో తెలంగాణ సాయుధ పోరాటం ప్రజలందరికీ అవగతం అయ్యేవిధంగా కార్యక్రమాల రూపకల్పన చేయాలి. ఇక్కడ ఒక విఖ్యాతమైన జాతీయాన్ని మనం సామ్యంగా చెప్పుకోవాల్సిందే. " సింహాలు తమ చరిత్ర తాము చెప్పుకోకపోతే వేటగాడు చెప్పింది చరిత్ర అవుతుంది". తెలంగాణలో జరిగిన పోరాటాల గురించి తెలంగాణ బిడ్డలు ముందు తరాలకు అందించకపోతే స్వార్థపరుల మాటలే చరిత్రలో చోటు చేసుకుంటాయి. ఈ బాధ్యత నిర్వహణకు ప్రభుత్వమే కాదు సంఘంలోని బుద్ధి జీవులంతా అందుకు నడుము కట్టాలి. ఈ భావజాలమే మనం ముందు తరాలకు అందించాల్సిన అవసరం ఉంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్వీయ పాలనలో అభివృద్ధి పథంలో దేశంలోనే అగ్రగామిగా ముందుకు సాగుతున్నది. ప్రగతిలోనూ, సంక్షేమంలోనూ సమాంతరంగా సాగుతున్నది. వ్యవసాయ రంగంలోనూ, సాంకేతిక రంగంలోనూ ఆదర్శంగా దూసుకుపోతున్నది. భారీ ప్రాజెక్టులు కట్టుకునే స్థాయికి ఎదిగింది తెలంగాణ. లక్షలాది ఎకరాలలో సాగు జరిగి పంటలతో పచ్చగా వర్ధిల్లుతుంది. హరితహారంతో అడవులు పెరుగుతున్నాయి. దేశ, విదేశీ సంస్థలు పెట్టుబడులతో తెలంగాణను పరిపుష్టం చేస్తున్నాయి. వజ్రోత్సవాల మీద తెలంగాణ పురోగతిని కూడా సమీక్షించుకొని ఇంకా అభివృద్ధి జరగాల్సిన రంగాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఈ వజ్రోత్సవాలు తెలంగాణను మరింత శక్తిమంతం చేయాలన్నదే ప్రజల ఆకాంక్ష. తెలంగాణ మోడల్ దేశానికి మార్గ నిర్దేశం చేయాలన్నదే ప్రజల అభిలాష.