జాన్ సన్ చోరగుడి 
ఒక మహానాయకుడి నిర్యాణం తర్వాత, ఒక లక్ష్యసాధన కోసం మొదలైన  ప్రయాణం మధ్యలో ఎలా ఆగుతుంది? అతడు ఆరంభించిన ఆ ప్రస్థానాన్ని- విధాత ‘విజన్’ మేరకు ఎవరో ఒకరు తిరిగి కొనసాగిస్తారు. ఆ ఏర్పాటు కూడా ఆయనే చేస్తాడు. అయితే ఆ సమయం వచ్చినప్పుడు, కొత్తగా ఆ బాధ్యతల్ని చేపట్టవలసి వచ్చిన వారి మానసిక సిద్డబాటు ఎలావుంటుంది? ఎటువంటి ‘టేకాఫ్’ తో వారు ఆ పని మొదలు కావాలని అనుకుంటారు? వర్తమాన ఆంధ్రప్రదేశ్ పరిణామాలను పోలిన, అరుదైన ఇటువంటి సన్నివేశంలో - ప్రాచీన ప్రపంచ చరిత్రలో జరిగింది ఏమిటో చూడడానికి, మనం బైబిల్ పాత నిబంధనలో జాషువా (యేహోషువ) గ్రంధం చూడాలి. ఇది మోజెస్ రాసిన మొదటి ఐదు కాండాలు పూర్తి అయిన వెంటనే మొదలవుతుంది. దీనికి ముందు- ‘మోజెస్ నూట ఇరువది ఏళ్ళ వయస్సులో కన్నుమూయడానికి ముందు తన చేతులను జాషువా తలపై వుంచడంతో, అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయెను’ అని ద్వితియోపదేశ కాండం (ద్వి.కా.) ముగుస్తుంది. 

జాషువా జీవితం ఈజిప్ట్ లో బాల బానిసగా మొదలయింది. తన ఆత్మీయ తండ్రి మోజెస్ ఇజ్రాయేల్ ప్రజలను ఎర్ర సముద్రం సముద్రం దాటించినప్పుడు, జాషువా మోజెస్ తోనే వున్నాడు. జెహోవా పది ఆజ్ఞలు జారీ చేయడానికి మోజెస్ ను సీనాయి పర్వతం మీదికి పిలిచినప్పుడు, జాషువా మోజెస్ తో పాటే వున్నాడు. ఇలా జెహోవా-మోజెస్ ల మధ్య నుండి జాషువాను వేరు చేసి చూడడం కుదరదు! అందుకే ద్వి.కా.31 లో ఈజిప్టుతో ఆరంభించిన విరామం ఎరుగని నలభై ఏళ్ల పోరాటంలో విజేతగా శిఖరాగ్రానికి చేరిన మోజెస్ తో జెహోవా- ‘నీ మరణ దినములు సమీపించెను’ అని చెపుతాడు. అయితే అక్కడే, నీ ఆత్మీయ పుత్రుడు జాషువా నువ్వు మిగిల్చిన పని పూర్తిచేస్తాడు అని మోజెస్ కు చెబుతాడు. అలా మోజెస్ కు ఒక ఊరట దొరికింది. మోజెస్ ఈజిప్టులో మొదలెట్టిన ఇజ్రాయేలీయుల బానిసత్వ విముక్తి ఉద్యమం, ఫరో క్రూర పాలన నుండి తన ప్రజలకు కల్పించిన స్వేఛ్చ, ఆ దేశం నుండి వారి నిష్క్రమణ తర్వాత, మోజెస్ వారిని వాగ్దాన భూమి లోకి తీసుకుని వెళ్ళవలసిన పని ఇంకా మిగిలింది. అయితే జెహోవా దానిని జాషువాకు అప్పగించాడు. అక్కడే ‘నిబ్బరముగా వుండుము, నేను వారికిచ్చిన దేశమునకు ఇజ్రాయేలీయులను నీవు తోడుకొని పోవలెను. నేను నీకు తోడైవుందును’ అని చేపట్టనున్న‘మిషన్’ కోసం ఆయన జాషువాను సిద్దం చేస్తాడు.  

ఇది జరిగాక, ద్వి. కా. చివరి అధ్యాయం, ఎటువంటి ఉపోద్గాతం లేకుండా... ‘మోజెస్ మోయాబు మైదానం నుండి సిస్గా కొండ వరకు పోయి, నెబో శిఖరం మీదికి ఎక్కెను’ అని మొదలవుతుంది. ఎందుకు వెళ్ళాడో మనకు తెలియదు. జోర్డాన్ నది పక్కనున్నఆ శిఖరాగ్రం అంచున మేఘాల మధ్యవున్న వున్నమోజెస్ కు కనుచూపు మేర కనిపిస్తున్నసువిశాలమైన భూమిని చూపిస్తూ, నీ సంతానానికి నేను ఇస్తాను అని ప్రమాణం చేసిన దేశము ఇదే. ‘కన్నులారా నిన్ను దాని చూడనిచ్చితిని, కానీ నీవు ఈ నది దాటి అక్కడకు వెళ్ళకూడదు’ అంటాడు జెహోవా. ఆ తర్వాత పంక్తుల్లో- ‘జెహోవా మాట చొప్పున, మోజెస్ ఆ మోయబు మైదానంలో మృతి పొందెను’ అని వుంటుంది. అక్కడే -‘అతనికి దృష్టి మాంద్యము లేదు, సత్తువ తగ్గలేదు’ అని కూడా వుంటుంది. మరి మోజెస్ ఎందుకు చనిపోయాడు అంటే, ముందుగా చెప్పిన ఆయన ‘మాట చొప్పున’ అని మనం అనుకోవాలి.    

 

మనకు తెలుసు, కొన్ని కొన్ని జీవితాలు మధ్యలో అకస్మాత్తుగా ముగుస్తాయి. అప్పటికి వారు తమవైన రంగాల్లో శిఖరాగ్రాన ఉంటారు. అయినప్పటికీ ఇక చాలు, మిగతాది మరొకరు చేస్తారు, అని ‘విధాత’ కనుక అనుకుంటే ఇక అంతే. అయితే ఆ లోయలో మోజెస్ మృతదేహం కనిపించక ఆయన్నిసమాధి చేయలేదా? ఏమో వివరాలు తెలియదు. ద్వి.కా.34: 6 లో ‘మోయాబు లోయలో అతడు పాతి పెట్టబడెను, అతని సమాధి ఎక్కడవున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు’ అని వుంది. ఆంగ్లంలో- The Lord  buried him in a valley in Moab, అని వుంది. అంటే - ‘ఆయనే అతణ్ణి పాతి పెట్టెను’ అని మనం ఒక ముగింపుకు రావాలేమో! 
 

జాషువా దేవుని సైన్యానికి ‘నాయకుడు.’ మోజెస్ వల్ల ఇజ్రాయేల్ ప్రజలకు ఫరో బానిసత్వం నుండి విముక్తి కలిగితే, జెహోవా చెప్పిన వాగ్దాన భూమి యుద్ద విజయంతో స్వాధీనపర్చుకుని, దాన్ని ప్రతి జాతికీ ప్రజాస్వామికంగా ఆ ప్రజలకు పంపిణీ చేసిన ‘పరిపాలనాదక్షుడు’ జాషువా. బైబిల్ ఆర్కియాలజిస్టులు ఇది కీ.పూ 1550-1200 మధ్య జరిగినట్లుగా దీన్ని ‘లేట్ బ్రాంజ్ ఏజ్’ అని అంటున్నారు. ఒక కొత్త రాజ్యాధినేత పరిపాలనలో ఉండాల్సిన ప్రాధాన్యతల క్రమాన్నిజాషువా కాలంలో చూస్తాం. గమనిస్తే, ఇక్కడ ‘ప్రజలు’ (ఇజ్రాయేలీయులు) ఉన్నారు. వారికి జెహోవా వాగ్దానం చేసిన (భూమి) ‘ప్రాంతం’ వుంది, అయితే లేనిదల్లా ‘ప్రభుత్వం’. అది కూడా వుంటే, అప్పుడు అది ‘రాజ్యం’ అవుతుంది. జాషువా దాన్ని ఏర్పర్చడం ఇక్కడ చూస్తాం. ఆధునిక రాజ్యంలోని పలు పాలనాంశాలు ఒక క్రమంలో ఇక్కడ కనిపిస్తాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రాదేశిక ప్రాంత విభజనకు ఇప్పుడు జరుగుతున్న కొత్త జిల్లాల ఏర్పాటు వంటి పలు ప్రతీకలు మనకు ఇక్కడ గోచరమవుతాయి.  

సైన్యాధికారిగా జాషువా తాము అక్రమించవలసిన దేశం బలాబలాలు (ప్లానింగ్) దాని అంతరంగిక స్థితిగతులు తెలుసుకోవడానికి (ఇంటిలిజెన్స్) వేగులను ముందుగా అక్కడికి పంపుతాడు. జాషువా పంపిన వేగులు ఆ దేశంలో రాహాబు అనే ఒక వేశ్య ఇంటిలో ‘షల్టర్’ తీసుకుంటారు. ఏ క్షణంలో అయినా ఇజ్రాయేల్ సైన్యం ఆ దేశం మీద దాడి చేయవచ్చు, అనే భయంతో కానాను దేశస్తులు వున్నట్టు వారు గ్రహిస్తారు. అయితే అక్కడి సేనలు ఈ వేగుల రాకను పసిగట్టి వాళ్ళను ‘ట్రాప్’ చేస్తే, ఆమె వాళ్ళను తప్పిస్తుంది. ఆమె వేగులకు చేసిన ఆ మేలుకు యుద్ద సమయంలో ‘నా ఇంటివారిని చంపవద్దు’ అని అడుగుతుంది. సేనల గుర్తు కోసం ఆమె తన మేడ కిటికీకి ఎర్ర తాడు కడుతుంది. యుద్ధం మొదలవుతుంది. అప్పట్లోనే జాషువా రచించి అమలుపరచిన ఏడేళ్ళ ఈ ‘గెరిల్లా’ యుద్ధ వ్యూహం విలక్షణమైంది. అతడు ఇజ్రాయేల్ సేనల్ని రెండు ‘కంపెనీలు’ గా విభజిస్తాడు. మొదటి ‘కంపెనీ’  జెరికో దేశ సైన్యాన్ని కోట నుండి బయటకు రప్పించి, వెంటపడి వాళ్ళను దూరంగా తరిమేలా చేస్తారు. మాటు వేసివున్న రెండవ ‘కంపెనీ’ వెంటనే సైన్యం లేని కోటను స్వాదీనపర్చుకుంటుంది. జాషువా వేగులు ముందుగా ఆమెకు మాట ఇచ్చినట్లే, యుద్ద సమయంలో రాహాబు కుటుంబాన్నిచంపరు, (విశ్వసనీయత) తర్వాత ఆమెకు కొత్త రాజ్య పౌరసత్వం, భూమి కేటాయింపు కూడా చేస్తారు (మాట తప్పక పోవడం)

 

 

 ‘యుద్ద విధ్వంసం సమయంలో సైనికులు ఎవ్వరూ ఏదీ తమ స్వంతానికి దోచుకోవడానికి వీల్లేదు, బంగారము వెండి ఇత్తడి ఇనుము దేవుని ఖజానా (ఎండోమెంట్స్) కు జమ చేయాలి’ అది జాషువా అజ్ఞ. అయితే దాన్ని అతిక్రమించి, దోపుడు సొత్తులో వొక విలువైన పై వస్త్రము, 200 తులముల వెండి, 50 తులముల బంగారము తన డేరాలో దాచుకున్నట్టు విచారణలో యూదా వంశస్థుడైన ఆకాను అనే ఒకణ్ణి గుర్తిస్తారు. అంతే అతనికి మరణ శిక్ష (నేరము –శిక్ష) విధిస్తారు. యుద్ధం ముగిసి ఆక్రమణ పూర్తి అయ్యాక  రాజ్యం హద్దులు, తర్వాత గ్రామాల వారీగా భూమి ‘సర్వే’ చేసి సరిహద్దులు నిర్ధారణ చేస్తారు. (భూ సేకరణ) ఆ తర్వాత ఇజ్రాయేలీయులు 12 వంశాలు వాటి గోత్రాలు వాటి ప్రతినిధుల సమక్షంలో, చీట్లు వేసి (లాటరీ పద్దతి) జాషువా వారికి భూమి కేటాయిస్తాడు. మగపిల్లలు లేని కుటుంబాల్లో ఆడపిల్లలకు కూడా మగవారితో సమానంగా భూమిని కేటాయిస్తాడు. అలాగే ప్రతి పట్టణంలోనూ నేరస్తులను ఉంచడానికి (జైళ్ళు) వేరుగా భూమి కేటాయిస్తారు. జెహోవా ముందు నుండి లేవీయుల విషయమై మోజెస్ తో చెప్పినట్టుగానే, మొత్తం భూమిలో నుండి కాకుండా జాషువా అన్నివంశాల వారి భూమిలో నుండి (లేవీయులు) పురోహిత వర్గానికి ప్రత్యేకంగా (అగ్రహారములు) భూమిని కేటాయిస్తారు. లేవీయులకు కేటాయించినవి మొత్తం 48 పట్టణాలు. 

మోజెస్ కు జెహోవా అప్పగించిన పని జాషువా కాలానికి ఒక ముగిపు దశకు చేరడానికి నలభై ఏళ్ళు (1978-2018) పట్టడం, మోజెస్ మరణానంతరం జాషువా యువ నాయకత్వంలో ఇజ్రాయేల్ సేనలు  జోర్డాన్ నది దాటి వాగ్ధాన భూమిని ఏడు ఏళ్ల (2011-2018) యుద్ద వ్యూహం తర్వాత విజయోత్సవంతో ఆక్రమించడం, ఈ వ్యాసం ఆరంభంలో అన్నట్టుగా, వర్తమాన ఆంధ్రప్రదేశ్ పరిణామాలను పోలినట్టుగా అనిపించడం కేవలం  యాదృచ్చికం. అయితే ఈ పురాఘటన కధనం విషయంలో చరిత్రకారులు, ఆర్కియాలజిస్టుల అభిప్రాయాల్లో కొంత వైరుధ్యం వుంది. చరిత్రకారులు, ఆధ్యాత్మికం మినహా జాషువా చేసాడని చెబుతున్న జెరికో దండయాత్రకు ఎటువంటి చారిత్రిక ప్రామాణికం లేదని చెబుతుంటే, ఆర్కియాలజిస్టుల అభిప్రాయం అందుకు భిన్నంగా వుంది. ఇజ్రాయేల్ భూభాగంలో జరుగుతున్న తవ్వకాల్లో కనానీయుల విలువైన చారిత్రిక ఆనవాళ్ళు నాటి వారి గృహ, పూజాదికాల ఉపకరణాలు ఇప్పటికీ లభిస్తున్నాయి  అంటారు. అయితే, కీ.పూ. 1406 నాటికి ఇంత జరిగాక కూడా మళ్ళీ యూదులు ప్రపంచం అంతా చెల్లాచెదురు కావడం, 1948 లో మళ్ళీ వారు ఇప్పటి ఇజ్రాయేల్ చేరడం, మళ్ళీ ఒక ‘రాజ్యం’ కావడం ఆధునిక చరిత్ర.  
అవును చరిత్ర పునరావృతం అవుతూనే వుంది!

(ఈ శీర్షిక, All came to pass అనే బైబిల్ వాక్యానికి తెలుగు తర్జుమా)