ఇంటర్ బోర్డు నిర్వాకం: అధికారులపైకి నెట్టేసి..., ఒక్కటే ప్రశ్న...

తల్లిదండ్రులు అలా ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ లో ఫెయిలైన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం అసాధారణం కాకుండా పోయింది. కార్పోరేట్ విద్యావ్యవస్థ విస్తరిస్తున్న క్రమంలోనే ఈ ఆత్యహత్యల పరంపర సాగుతూ వస్తోంది. 

Inter students suicides: who will take responsibilty?

శుక్రవారంనాడు ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఓ విద్యార్థినికి ఇంటర్మీడియట్ 980 మార్కులు వచ్చాయి. ఆ అమ్మాయి తండ్రి ఓ ఉపాధ్యాయుడికి ఫోన్ చేసి తక్కువ మార్కులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంకా 20 మార్కులు ఏమయ్యాయనే ఆయన ప్రశ్న. ఇదంతా నా ముందే జరిగింది. ఆ ఉపాధ్యాయుడి అవతలి వ్యక్తిని చీవాట్లు పెట్టాడు. అదే వేరే విషయం. ఇలాంటి మనస్తత్వం గల తల్లిదండ్రుల కారణంగా విద్యార్థులు ఎంత ఒత్తిడికి గురవుతారో అర్థం చేసుకోవచ్చు. 

తల్లిదండ్రులు అలా ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ లో ఫెయిలైన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం అసాధారణం కాకుండా పోయింది. కార్పోరేట్ విద్యావ్యవస్థ విస్తరిస్తున్న క్రమంలోనే ఈ ఆత్యహత్యల పరంపర సాగుతూ వస్తోంది. విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో ఇంతకు ముందైతే కార్పోరేట్ కాలేజీలను, విద్యార్థుల తల్లిదండ్రులను నిందిస్తూ వచ్చేవాళ్లం. మార్కులే కొలబద్దలైన స్థితిలో విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి గురై మానసిక క్షోభతో ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉండవచ్చు. వీటిని ఆపడానికి తగిన వ్యవస్థ ఏదీ రూపుదిద్దుకోలేదు.

అయితే, ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి అది ఒక్క కోణమైతే. ఈసారి తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీయట్ బోర్డు నిర్వాకం మరో కోణం. విద్యార్థుల ప్రాణాలతో బోర్డు చెలగాటమాడిందనే చెప్పాలి. ఇప్పటి వరకు 16 మంది విద్యార్థినీ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు అనధికారిక లెక్కలు. అంత కాకపోయిన ఏదో మేరకు ఉందనేది మాత్రం ఎవరూ కాదలేని సత్యం. 

మార్కుల మెమోలను ఎంత తప్పుల తడకగా రూపొందించారో ఈ రెండు మూడు రోజుల వ్యవధిలో బయటకు వచ్చిన విషయాలే తెలియజేస్తాయి. ఇంటర్మీడియట్ ఫస్టియర్ లో తెలుగు సబ్జెక్టులో 98 మార్కులు వచ్చిన అమ్మాయికి సెకండియర్ లో సున్నా మార్కులు వచ్చాయి. ఐఐటి అడ్మిషన్ పొందిన విద్యార్థి లెక్కల్లో తప్పాడు. సెకండియర్ మార్కులను క్రోడీకరించాల్సిన చోట ఫస్టియర్ మార్కులను క్రోడీకరించారు. చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. డిస్టింక్షన్ వచ్చిన విద్యార్థుల్లో దాదాపు 2,800 మంది విద్యార్థుల మెమోల్లో వారు ఫెయిల్ అయిట్లుగా ఉంది. 

మొత్తంగా వ్యవహారమంతా మార్కులను క్రోడీకరించే వద్ద జరిగినట్లు అర్థమవుతోంది. ఆ పనికి సంబంధించిన ఓ కాంట్రాక్టు ఓ పనికిమాలిన సంస్థకు ఇచ్చారనే ఆరోపణలు ముందుకు వస్తున్నాయి. ఆ పనికి మాలిన సంస్థపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరఫు నుంచి చెప్పినవారు లేరు. తప్పులను విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి అధికారుల మీదికి నెట్టేశారు. అధికారుల అంతర్గత తగాదాల వల్ల ఇదంతా జరిగిందని చెప్పి ఓ కమిటీని వేసి చేతులు దులుపేసుకోవడానికి సిద్ధపడ్డారు. 

సినీ ప్రముఖుల ట్వీట్లకు, వారి సమస్యలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, భవిష్యత్తు తెలంగాణ ముఖ్యమంత్రి కెటీ రామారావు విద్యార్థుల విషయంలో మాత్రం చాలా ఆలస్యంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి సంబంధించి తొలుత స్పందించిన నాయకుడు బహుశా, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అనుకుంటా. హరీష్ రావు విషయంలో ఇంతకు ముందు పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. ఈ విషయం తెలంగాణ సమాజం మొత్తానికి తెలుసు. ఆయన చెప్తే ప్రజలు పని జరుగుతుందని నమ్మే స్థితిలో లేరు. అందుకు సంబంధించిన రాజకీయ కారణాలు ఇక్కడ అప్రస్తుతం.

విద్యార్థులకు భరోసా ఇవ్వగలిగే నాయకులు తెలంగాణ ప్రభుత్వంలో ఇద్దరే ఉన్నారు. ఒక్కరు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు (కేసీఆర్), రెండో వారు కేటీ రామారావు (కేటీఆర్). విద్యామంత్రిగా ఉన్నప్పటికీ జగదీష్ రెడ్డికి అంత వెయిట్ ఉందని చెప్పలేం. అయితే, వెంటనే స్పందించాల్సిన బాధ్యత మాత్రం ఆయనకు ఉండింది. ఇంటర్ బోర్డు నిర్వాకం గురించి విమర్శలు వచ్చిన మరుక్షణం.. ఆందోళన వద్దు, న్యాయం చేస్తాం, తప్పులను సరిదిద్దుతాం అని ఈ ముగ్గురిలో ఒకరైనా అని ఉంటే పరిస్థితి ఇంత దాకా వచ్చి ఉండేది. 

విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ బోర్డు ఆందోళన చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో విద్యార్థుల ఆత్మహత్యలూ జరిగాయి. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ స్పందన మరింత దారుణంగా ఉంది. మాస్ హిస్టీరియా కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఓ బాధ్యతారహితమైన వ్యాఖ్య చేశారు. కార్పోరేట్ కాలేజీల వ్యవహారం, తల్లిదండ్రుల తీరు వల్ల విద్యార్థులు ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన అభిప్రాయం కావచ్చు.

కానీ, ఇంటర్మీడియట్ బోర్డు చేసిన తప్పుల మాటేమిటనేది ప్రశ్న. తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి విద్యార్థులపై దారుణమైన అభాండం వేశారాయన. ఇదంతా మాట్లాడడానికి తెలంగాణ సమాజంలో ఎవరైనా మిగిలి ఉన్నారా అనేది ప్రశ్న. 

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించే గొంతులు మూతపడ్డాయి. ఉపాధ్యాయ సంఘాలు నిర్వీర్యమయ్యాయి. విద్యార్థి సంఘాలు బలహీనపడ్డాయి. ప్రతిపక్షం గురించి చెప్పాల్సిన పని లేదు. సమస్యలను తీవ్రంగా తీసుకుని సీరియస్ గా మాట్లాడే నాయకులే కరువయ్యారు. టీఆర్ఎస్ లోకి మారుతున్న ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోలేని స్థితిలో కాంగ్రెసు రాష్ట్ర నాయకత్వం ఉంది. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యావ్యవస్థలో తాను తేదలుచుకున్న సంస్కరణల గురించి కేసీఆర్ చాలానే మాట్లాడారు. తెలంగాణలో తిష్ట వేసి, విస్తరించిన కార్పోరేట్ విద్యా సంస్థలపై టీఆర్ఎస్ నాయకులు ఆ కాలంలో తీవ్రంగానే స్పందించారు. విద్యావ్యవస్థ ఇసుమంత కూడా మారలేదు సరికదా, పరిస్థితి మరింత విషమిస్తోంది. దీనికి ఎవరిని బాధ్యులను చేద్దాం... టీఆర్ఎస్ కు తిరుగులేని మద్దతు ఇచ్చిన ప్రజానీకాన్ని నిందించి, చేతులు ముడుచుకుని కూర్చుందామా.... 

- కె. నిశాంత్

(ఈ వ్యాసంలో వ్యక్తమైన అభిప్రాయాలతో ఏషియానెట్ న్యూస్ తెలుగుకు ఏ విధమైన సంబంధం లేదు. ఈ అభిప్రాయాలు మొత్తం రచయితకే చెందుతాయి)

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios