ఇండో- చైనా: నాటి జ్ఞానసంబంధాలు నుంచి నేటి సరిహద్దు ఉద్రిక్తతలు వరకు...
జ్ఞాన సంపన్నత విషయంగా భారత్ –చైనా మధ్య ఆదాన ప్రధానాల గత చరిత్రను, ఇరుదేశాల పాలకులు దాన్ని పెంచి పోషించిన తీరును 21 వ శతాబ్దిలో సమ్యక్ దృష్టితో చూస్తున్నప్పుడు; 18వ శతాబ్ది వరకు ప్రపంచ జి.డి.పి.లో సగభాగం ఆసియాది అంటే అందుకు ఆశ్చర్యం అక్కరలేదు. అయితే, ఈ ఇరుదేశాల ప్రాధాన్యతల్లో ఇప్పుడు ‘జ్ఞానం’ మసకబారి ‘విపణి’ పెద్దపీట ఎక్కి కూచుంది.
-జాన్‌సన్ చోరగుడి
ఆ నివేదిక కనుక ఇప్పుడు వెలువడి ఉండకపోతే, సరిహద్దు దేశాలైన ఇండియా చైనా మధ్య సంబంధాల చారిత్రిక పరిణామాల ఉత్టాన పతనాలు, ఇవాల్టి రోజున ఎంతటి ఎత్తు నుంచి ఎక్కడికి దిగజారాయి... అనే సమాలోచనకు ఇప్పుడు కూడా ఆస్కారం ఉండేది కాదేమో. ఒకప్పటి మన ఘనమైన గతాన్ని గుర్తు చేసుకోవడానికి కారణమైన ఆ నివేదికను 2020 ఏప్రెల్ 27 న ‘స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్’ (‘సిప్రి’) విడుదల చేసింది. ఈ సంస్థ స్వీడన్ కేంద్రంగా పని చేస్తున్న ప్రముఖ అధ్యయన సంస్థ. అయినా అలాగని ఆ నివేదిక రావడం ఒక్కటే కూడా ఇక్కడ ప్రధానం కాదు, ఈ శతాబ్ది ఉత్పాతం ‘కోవిడ్ 19’ కనుక వచ్చి ఉండకపోతే, అ నివేదిక ఉన్నా ఇప్పుడు మళ్ళీ వొక మారు వెనక్కి తిరిగి, మునుపటి మన గతంలోకి చూసుకునేటంత స్థిమితం కూడా ఇక్కడ ఎవరికీ లేదు.
( ఫోటో: స్వీడన్‌లోని సిప్రి కేంద్ర కార్యాలయ భవనం)
ఇరుగుపొరుగు దేశాలైన ఇండియా-చైనా మధ్య వెల్లివిరిసిన ఒకనాటి తాత్విక సారూప్య సంబంధాలు, ఆనాటి ఆదాన ప్రదానాలు, ఇప్పుడు అందరూ మర్చిపోయిన ప్రాచీన చరిత్ర. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకోవడం అంటే, ఎలా చూసినా కూడా అది ఒక వృధా ప్రయాస. కారణం నిర్మొహమాటంగా చెప్పాలంటే - దాన్ని వాళ్ళు మనమూ ఇద్దరమూ మర్చిపోయాము. అటువంటప్పుడు మళ్ళీ ఇది మరెందుకు? నిజమే అయితే, ఈ ‘కరోనా’ ఉత్పాతాన్ని మనం ఎదుర్కోవడానికి ముందు వరకు, మనం చేసినవన్నీ పూర్తి అవగాహనతోనే చేసామని ఇంకా నమ్ముతున్నట్టు అయితే, ఇప్పటికైనా వాటిని ఒకసారి సమీక్షించు కోవడానికి. ఇప్పటివరకు చేసిన ప్రయాణంలో ఎక్కడినా ఏదైనా నాలుగు రోడ్ల కూడలిలో మనం గాని దారి తప్పామా? లేదా దారి మళ్ళించ బడ్డామా? అని మనల్ని మనమే పరామర్శించుకోవడానికి.
ఇందుకు ఎక్కడ మొదలుబెట్టాలి? అన్నప్పుడు, వెనక నుంచి ముందుకు రావడం మనకు వెసులుబాటుగా ఉంటుంది. ముందుగా మన గతాన్ని ఒకసారి ఆర్తితో తడిమాక, చివరిలో వర్తమానానికి వచ్చి - అప్పుడు ‘సిప్రి’ నివేదిక కూడా చూద్దాం. అప్పుడు ఎవరికి వాళ్ళం మనం ఎక్కడున్నామో మనకే అర్ధమవుతుంది. వొక ‘పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్’ 2020 లో ఇచ్చిన నివేదిక ఇప్పటి మన ఈ సమీక్షకు కారణం అంటున్నాము కనుక, భారతీయ చరిత్రలో మన వద్ద (పీస్) శాంతి ప్రక్రియ వొక జ్ఞానశోధనగా మొదలైన ప్రస్థానం నుండి ఈ రెండు దేశాల మధ్య జరిగిన పరిణామాలను వొక విహంగ వీక్షణంగా చూద్దాం.
( ఫోటో: మహాబలిపురం- సబర్మతి ఆశ్రమంలో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్)
భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గత ఆరేళ్లలో ఇండియాలో రెండు సార్లు ప్రత్యేక దృశ్య నేపధ్యంలో మనకు దర్శనం ఇచ్చారు. మొదటిది – సబర్మతీ ఆశ్రమం వరండాలో... వారిద్దరి వెనుక గాంధీజీ చరఖా ఉండేట్టు. రెండవసారి దక్షణాన తమిళనాడులోని మహాబలిపురంలో ప్రాచీన శిల్పాలు, బంగాళాఖాతం నేపధ్యం ఉండేట్టుగా ఇందుకు ఏర్పాటు జరిగింది. ఈ రెండు కూడా ఇరువురి మధ్య జరిగిన సౌహార్ధ సమావేశాలు. జవహర్ లాల్ నెహ్రు కాలం నాటి ఇండో-చైనా సంబంధాల చరిత్ర, ఆనాటి ‘పంచశీల’ ఇవన్నీ ఇప్పటికే మారుతున్న నాయకత్వాలు వాటి ప్రాధాన్యతల జాబితాలో మన జ్ఞాపకాలలో నుంచి తుడిచి వేయవలసినవి అవుతున్నాయి. అలాగని మళ్ళీ ఇప్పుడు వాటి ప్రస్థావన ఇక్కడ అవసరమని ఇప్పుడు చెప్పడం లేదు. అయిత, ఈ రెండు దేశాల మైత్రికి మూలమైన క్రీ.శ. ఐదవ శతాబ్ది నాటి జ్ఞానశోధన, ఆధునిక భారత చరిత్రలో ‘నెహ్రు ఎరా’ గా ప్రత్యేకించబడిన కాలానికి అనివార్యంగా వొక కొనసాగింపు అయింది.
( ఫోటో: లఢఖ్‌లో కీలక సమాలోచనలో పండిట్ నెహ్రూ)
అందుకని ఈ విహంగ వీక్షణం నెహ్రు ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ గ్రంధంలోని వివరాలతో మొదలు పెడదాం. (పేజి 203) భారత్ నుంచి చైనాకు పెద్ద ఎత్తున పండిత వర్గం చైనా వెళ్లి అక్కడ ఏళ్ల తరబడి నివాసం ఉంటు వారికి సంస్కృతాన్ని బోధిస్తూ చినీ భాషలోకి సంస్కృత గ్రంధాలను వారు తర్జుమా చేసారు. వారిలో ప్రముఖుడు కాశ్యప మాతంగ కీ.శ. 67 లో మింగ్ చి చక్రవర్తి ఆహ్వానం పై చైనా వెళ్ళి, లో నదీ తీరంలోని లోయాంగ్ పట్టణంలో నివాసం ఉన్నాడు. భారత్ నుంచి ఇలా చైనా వెళ్ళిన ప్రముఖుల్లో – బుద్దభద్ర, జీనభద్ర, ధర్మరక్ష, కుమారజీవ, పారమార్ధ, జీనగుప్త, బోధిధర్మ మొదలైన ప్రముఖులు ఉన్నారు.
( ఫోటో: బీహార్‌లోని నలంద విశ్వవిద్యాలయ శిథిలాలు)
వీరు తమ శిష్యులతో బౌద్ద బిక్ష బృందాల సహకారంతో వారు కలిసి ఇండియా నుంచి చైనాకు తరలి వెళ్ళేవారు. ఒక దశలో (కీ.శ. ఆరవ శతాబ్దికి) ఒక్క లియాంగ్ పరగణాలోనే మూడు వేల మంది భారతీయ బౌద్ద భిక్షవులు, పది వేల భారతీయ కుటుంబాలు అక్కడ ఉండేవి అంటారు నెహ్రు. వీరు తమతో ఎన్నో సంస్కృత గ్రంధాలను అక్కడికి తీసుకుని వెళ్లి వాటిని చినీ భాషలోకి తర్జుమా చేసారు. వీరిలో కొందరు నేరుగా చీనీలో గ్రంధాలను రాసారు. కుమారజీవ చీనీ భాషలో 47 గ్రంధాలను రాసిన సుప్రసిద్ధ రచయిత. ఇక జీవగుప్త 37 సంస్కృత గ్రంధాలను చీనీలో భాషలోకి అనువదించారు. వీరి రాకపోకలకు ఈ సారస్వత ఆదాన ప్రధానలకు సమన్వయ కేంద్రంగా పనిచేసినది, బీహార్ లోని రాజఘిర్ వద్ద ఉన్న కీ.శ. 427 లో ప్రారంభమైన నలంద విశ్వవిద్యాలయం.
ఇలా భారత్ నుంచి చైనా వెళ్ళిన పండితుల వద్ద శిష్యులుగా చేరిన చైనా ప్రముఖులు ఎందరో ఉన్నారు. ప్రముఖ యాత్రా చరిత్రకారుడుగా మనం ప్రస్తావించే పాహియాన్ (కీ.శ. 337- 422) మన వద్ద నుంచి వెళ్ళిన కుమారజీవ వద్ద శిష్యుడు. పాహియాన్ చైనా నుంచి ఇండియా బయలుదేరే ముందు, తన గురువు కుమారజీవను కలుస్తాడు. అప్పుడు కుమారజీవ పాహియాన్ తో చెబుతాడు, “అక్కడ నీ సమయమంతా మత సంబంధమైన జ్ఞానాన్ని ఆకళింపు చేసుకోవడానికి వెచ్చించ వద్దు. అక్కడి ప్రజలు వారి జీవనవిధానం కూడా క్షుణ్ణంగా అధ్యయనం చెయ్యి; నువ్వు తిరిగివచ్చాక చైనాకు ఆ దేశాన్ని అక్కడి ప్రజలను అర్ధం చేసుకోవడం సాధ్యమవుతుంది” అని చెప్పి పంపుతాడు
( ఫోటో: చైనా యాత్రా చరిత్రకారుడు హుయన్ త్సాంగ్)
చాలా ఆసక్తికరమైన అంశం ఇది. ఆసియాలోని ఇరుగుపొరుగు దేశాల మధ్య భవిష్యత్తులో ఏర్పర్చవలసి ఉన్న సత్సంబంధాల అవసరాన్ని ‘అకడమిషియన్లు’ ఆ నాడే గుర్తించడం, అందుకు వారు చూపిన చొరవ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అయితే కుమారజీవ చూపిన చొరవ ప్రతిఫలనాలు మనకు హుయన్ త్సాంగ్ (602-664) కాలం నాటికి చరిత్రలో కనిపిస్తాయి. రెండు దేశాల పాలకుల దృష్టిలో హుయన్ త్సాంగ్ ఒక గౌరవనీయుడైన ఇరుదేశాల ప్రతినిధిగా గుర్తించబడ్డాడు. ఇండియా నుంచి అతడు తనతో తీసుకువెళ్ళిన 645 సంస్కృత గ్రంధాలను చైనా చక్రవర్తుల సహకారంతో ఒక పండిత బృందాన్ని ఏర్పాటు చేసి ఆయన వాటిని చినీ భాష లోకి తర్జుమా చేయించారు.
( ఫోటో: సంస్కృతం నుంచి చీనిలోకి తర్జుమా అయిన అలనాటి గ్రంథాలు)
హుయన్ త్సాంగ్ భారత్ నుంచి చైనా తిరిగి వెళ్ళిన తర్వాత, రెండుదేశాల మధ్య అప్పటి వరకు ఒకరి పట్ల మరొకరికి ఉన్న అభిప్రాయాలకు ‘కొత్త చూపు’ వచ్చి చేరింది. కనూజ్ రాజధానిగా భారత్ ను పరిపాలిస్తున్న హర్షవర్ధనుడు – చైనా టి యాంగ్ చక్రవర్తి స్నేహపూర్వకంగా తమ రాయబారులను ఇరు దేశాల స్నేహ సంబంధాల కోసం పంపుకున్నారు. ఇలా ఆసియాలోని ఈ రెండు పెద్ద దేశాల మధ్య సారూప్యత ఉన్న కొన్ని అంశాలు ఒక స్పష్టమైన రూపుతీసుకుంటున్న క్రమంలో ఈ రెండు దేశాల ప్రభావం సమాంతరంగా తూర్పు ఆసియాలో ఉన్న చిన్న దేశాల మీద నెమ్మదిగా ప్రతిఫలించింది. అవి - ఈ రెండు దేశాల ప్రధాన భూభాగాన్ని అనుకొని వున్న సరిహద్దు దేశాలు కొన్ని అయితే, ఈ రెండు దేశాల సముద్ర వాణిజ్య మార్గంలో ఉన్నవి మరికొన్ని.
భారత ఉప ఖండానికి తూర్పున ఇటు భారత్ అటు చైనా ఈ రెండింటి మధ్య ఉన్న దేశాలు వాటి నైసర్గిక అందుబాటును బట్టి ఏదో ఒక దేశం ప్రభావ ఛాయల్లో అవి ఉండేవి. ‘ఈ దేశాల్లో పరిపాలనను, జీవన విధానాన్ని నడిపించే తాత్వికత చైనాది అయితే, వీరి మత ఆచారాలు, కళలు ఇండియావి’ అంటారు పండిట్ నెహ్రు. ఈ దేశాల వాణిజ్యం ప్రధానంగా చైనాతో ఉండేది. ఇక ఈ దేశాల్లో కళలకు మూలం ఇండియా అయినప్పటికీ, ఆయా దేశాల స్థానిక స్వభావం మేరకు అవి ‘అనుసృజన’ చేయబడేవి. ‘ఎడాప్టబిలిటీ’ భారతీయ కళలకు ఉన్న గొప్ప లక్షణమని సర్ జాన్ మార్షల్ అంటారు.
( ఫోటో: చైనా చిత్రకళలో పండిత గోష్టి)
ఈ తూర్పు కాలనీలు తొలుత బ్రాహ్మణిజం ఆధిపత్యంలో ఉండి, తర్వాత క్రమంగా బౌద్దంలోకి మారాయి. తొలుత రెండూ ఒక దశ వరకు సామరస్యపూర్వకంగా ఉండేవి. తర్వాత వీటి మధ్య స్పర్ధ మొదలయింది. అయితే ఆ స్పర్ధ క్రమంగా పోరుగా మారడానికి మాత్రం కారణం ఆధ్యాత్మిక వైరం కాదు. అందుకు రాజకీయ, ఆర్ధిక, వాణిజ్య కారణాలు వున్నాయి అంటారు నెహ్రు. కాల క్రమంలో సముద్ర వాణిజ్య మార్గాలు (సీ రూట్స్) పైన గుత్తాధిపత్యం ఈ దేశాల మనుగడకు కీలకం అయింది. ఐదవ శతాబ్ది నాటికి ఈ దేశాల్లో మహా నగరాలు ఏర్పడ్డాయి. ఎనిమిదవ శతాబ్ది నాటికి పోర్టు నగరాలు ఏర్పడ్డాయి. వీటిలో నుంచి మహా వాణిజ్య సామ్రాజ్యాలు వెలిసాయి. తొలుత జ్ఞాన తృష్ణను తీర్చుకోవడానికి చిన్నగా మొదలయిన ఈ ప్రస్థానం మనిషిని తొలుత కొత్త తీరాలకు తీసుకు వెళితే, కొత్త జాతులతో మొదలై విస్తరించిన స్నేహపూర్వక సంబంధాలు క్రమక్రమంగా వాణిజ్య కేంద్రితంగా మారాయి. ఇప్పుడైనా ‘కోవిడ్-19’ ముంగిట ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు పునస్సమీక్షించు కుంటున్నాము అంటే, అది గత చరిత్రను గుర్తు చేసుకోవడానికి కాదు, మన భవిష్యత్తు ఏమిటి అని అంచనాలకు రావడం కోసం.
( ఫోటో: ఆఫ్రికాలో నిర్మాణంలో ఉన్న చైనా ఓబీఓఆర్ నిర్మాణం)
‘ప్రపంచ ఆర్ధిక మాంద్యం 2008’ పలు మొదటి ప్రపంచ దేశాలను తాకిన స్థాయిలో మనల్ని తాకలేక పోయింది. ఆర్ధిక సంస్కరణల అమలులో మన కంటే ముందు ఉన్న ఆసియా దిగ్గజం చైనా అప్పటికే ప్రపంచ మాంద్యం ప్రకంపనాలు తనని తాకకుండా నిలవరించగలిగింది. అది మొదలు క్రమక్రమంగా ప్రపంచ దేశాల దృష్టి యూరప్ మీది నుంచి ఆసియా మీదికి మళ్ళింది. అయితే, ఇక్కడే మాజీ దౌత్యవేత్త అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ కు చెందిన రాకేశ్ సూద్ పరిశీలనను చూడడం ఆసక్తికరమైనది. “ఆర్ధిక శాస్త్ర చరిత్రకారులు చెబుతున్న దాని ప్రకారం, 18వ శతాబ్ది వరకు ప్రపంచ జి.డి.పి. లో సగ భాగం ఆసియాది. అయితే పారిశ్రామిక విప్లవంతో పాటు యూరప్ దేశాల నౌకాయానం , బ్రిటిష్ వలస విధానం వల్ల పాశ్చ్యాత్య దేశాలు కూడా తర్వాత కాలంలో ఆసియాతో సమానమైన సమతుల్యత సాధించగలిగాయి. ‘2008 నాటి ప్రపంచ మాంద్యం’ లో అచంచలంగా నిలబడ్డ ఆసియా నిబ్బరం వెనుక ఉన్న నేపధ్యం ఇదే” అంటారు రాకేశ్ సూద్.
( ఫోటో: చైనా ఓబీఓఆర్ రోడ్డు (రెడ్)- నౌక (నీలి) మార్గాలు)
జ్ఞాన సంపన్నత విషయంగా భారత్ –చైనా మధ్య ఆదాన ప్రధానాల గత చరిత్రను, ఇరుదేశాల పాలకులు దాన్ని పెంచి పోషించిన తీరును 21 వ శతాబ్దిలో సమ్యక్ దృష్టితో చూస్తున్నప్పుడు; 18వ శతాబ్ది వరకు ప్రపంచ జి.డి.పి.లో సగభాగం ఆసియాది అంటే అందుకు ఆశ్చర్యం అక్కరలేదు. అయితే, ఈ ఇరుదేశాల ప్రాధాన్యతల్లో ఇప్పుడు ‘జ్ఞానం’ మసకబారి ‘విపణి’ పెద్దపీట ఎక్కి కూచుంది. చైనా మరోసారి ‘సిల్క్ రూట్’ పునరుద్దరణ అంటూ తన వాణిజ్య ఆబకు గతచరిత్ర సొబగులు అద్దుతూ, ‘వన్ బెల్ట్ –వన్ రోడ్’ (OB-OR) ప్రాజెక్టుతో ఆఫ్రో-ఆసియా మ్యాప్ పైకి దూసుకు వచ్చింది. చైనా గత ఐదేళ్లుగా ఆసియా- యూరప్ దేశాలకు రోడ్డు నౌకా వాణిజ్య మార్గాలు వేస్తూ, మార్గమధ్య దేశాల్లో పోర్టులు భారీ మౌలిక ప్రాజెక్టులను అభివృద్దిచేసే పని చైనా కార్పోరేట్ కంపెనీలకు అప్పగిస్తూ, పెట్టుబడికి అయా దేశాలకు తానే అప్పులు ఇస్తూ తన పాగాను విస్తరిస్తూ ఉన్నది. అయితే అప్రతిహతంగా సాగాల్సిన ఈ యాత్ర ఇప్పుడు ‘కోవిడ్-19’ జంక్షన్ వద్ద పడకేసింది. ఇప్పుడు ‘వన్ బెల్ట్ –వన్ రోడ్’ మార్గంలోని పలుదేశాల ఆర్ధిక పరిస్థితి కుదేలై, అవి చైనాను తమ అప్పు చెల్లింపులు వాయిదా లేదా రద్దును కోరుతున్నాయి.
( ఫోటో: సందిగ్ధంలో పడిన మైత్రి సంబంధాలు)
అంతా సవ్యంగా ఉండి ‘కరోనా’ వైరస్ బయటకు రాకుండా అది తన గూట్లోనే దాక్కుని ఉంటే ఇప్పుడు కూడా ఇది వార్త అయ్యుండేది కాదేమో. కానీ అలా జరగలేదు, అది ‘గ్లోబ్’ కు ‘కోవిడ్ 19’ మాస్క్ కట్టింది! ఈ పరిస్థితుల్లో స్వీడన్ కేంద్రంగా పని చేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ ‘స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్’ (‘సిప్రి’) తన వార్షిక నివేదికను 2020 ఏప్రెల్ 27న విడుదల చేసింది. అందులో – ‘ప్రపంచ మిలటరీ వ్యయం 2019 నాటికి 1917 బిలియన్ డాలర్లుకు చేరిందని, అందులో అత్యధిక వ్యయంతో ముందువరసలోని మొదటి మూడు దేశాల్లో అమెరికా చైనా ఇండియా ఉన్నాయని ప్రకటించింది.
ఇవీ వివరాలు - అమెరికా (732) చైనా (261) ఇండియా (71.1) బిలియన్ డాలర్లు. ఒక్క ఏడాదిలో పెరిగిన ఈ వ్యయం 2018 తో పోలిస్తే - చైనా 5.1% పెంచితే ఇండియా 6.8% పెంచింది. “చైనా పాకిస్తాన్లతో ఇండియా ఎదుర్కొంటున్న వొత్తిడి, శత్రుత్వం, ఇండియా రక్షణ వ్యయం ఇంతగా పెరగడానికి ప్రధాన కారణం” అంటున్నారు ‘సిప్రి’ లో సీనియర్ పరిశోధకుడు సైమన్ టి. వైజ్ మెన్. ఈ నివేదిక విడుదలై ఇంకా నెల కూడా కాకుండానే, ఇండో-చైనా సరిహద్దుల్లో ఈ వ్యాసం ముగిస్తున్న 2020 మే 27 నాటికి ఉద్రిక్తలు మొదలయినట్టు వార్తలు చూస్తుంటే, జ్ఞానానికి - వాణిజ్యానికి మధ్య ఇప్పటి దేశాధినేతల నాయకత్వాలు మొగ్గు ఎటు? అనేది ఇప్పుడు విస్మరణకు గురైన ప్రశ్నగా మిగులుతుంది.
ఈ సందర్భంగా కీ.పూ. 1407- 6 లో బైబిల్ గ్రంధంలో దేశాధినేతలుగా పట్టాభిషిక్తులైన వారికోసం ఉల్లేఖించిన వొక అజ్ఞ వొకటి గుర్తుకు వస్తున్నది. అది ఇలా సాగుతుంది: ‘రాజు సింహాసనం మీద అసీనుడు అయిన తర్వాత, లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న ధర్మశాస్త్ర గ్రంధమును చూచి, వొక ప్రతిని (కాపీ) రాజు తన కొరకు (తన స్వహస్తాలతో) రాసుకొనవలెను. దానిని అనుసరించి నడుచుకొనుటకు అతడు బ్రతుకు దినములన్నిటా దానిని చదవవలెను’ – బైబిల్, ద్వితియోపదేశ కాండము 17:22