ఇక దర్జాగా బాల్ టాంపరింగ్, ఎలా చేయొచ్చంటే...

కరోనా వైరస్ పుణ్యమాని ఈ బాల్ టాంపరింగ్ లీగల్ కాబోతుంది. సాధారణంగా బౌలర్లు బంతిని తమ ఉమ్మితో రుద్దడం మనం చూస్తూనే ఉంటాము. ఈ కరోనా వైరస్ వల్ల ఇకమీదట క్రికెట్లో అది నిషేధం అవ్వొచ్చు. 

ICC to Legalize Ball Tampering in test cricket, the changes would be...

2018 కేప్ టౌన్. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల మధ్య టెస్టు జరుగుతుంది. సాధారణంగా అన్ని దేశాల మధ్య టెస్టు మ్యాచులు జరుగుతాయి. ఈ మ్యాచుకు ఉన్న ప్రత్యేకత ఏమిటని ఆశ్చర్య పోతున్నారా? 

ఆస్ట్రేలియా క్రికెట్‌ను ఘోర అవమానానికి గురిచేసిన ఆ సంఘటనను ప్రపంచం ఎప్పటికి మర్చిపోదు. ఆస్ట్రేలియా అభిమానులకయితే... అది జీవితాంతం వేధించే ఒక దుర్ఘటన. 

జెంటిల్ మెన్ గేమ్ క్రికెట్లో ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు అంటే వివాదాస్పదమైన జట్టు అన్న పేరుంది. ఈ టెస్టు తరువాత ఆస్ట్రేలియా జట్టు వివాదాస్పదమైన ప్రవర్తనతోపాటుగా, మోసపూరితమైన ఆటకు కూడా కేర్ అఫ్ అడ్రస్ అని ప్రపంచం ముందు తలదించుకుని నిలబడేలా చేసింది. 

ఇంతకు ఈ ఉపోద్ఘాతలన్నిటికీ ఏకైక కారణం ఆస్ట్రేలియా క్రికెటర్లు సమష్టిగా బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడటం. ఈ సంఘటన వల్ల ఇద్దరు దిగ్గజాలు సంవత్సర కాలంపాటు వేటుకు కూడా గురయ్యారు. ఆస్ట్రేలియా టీం మీద సోషల్ మీడియాలో ఎవరు ట్రోలింగ్ చేయాలన్నా సాండ్ పేపర్ తో చేసిన ఈ బాల్ టాంపరింగ్ ఉదంతాన్ని ఖచ్చితంగా వాడతారు. 

ఇకమీదట ఈ బాల్‌ టాంపరింగ్‌ ఆరోపణలు ఏ జట్టునూ వేధించే అవకాశం లేదు!. అన్ని జట్లు దర్జాగా బాల్‌ టాంపరింగ్‌ చేసుకోవచ్చు. స్వయంగా అంపైర్లే ఆటగాళ్ల వద్దకు వచ్చి బాల్‌ టాంపరింగ్‌ చేసేందుకు తగినంత సమయం ఇవ్వనున్నారు. 

దొంగచాటుగా బంతి స్వరూపం మార్చేందుకు తంటాలు పడనక్కర్లేదు. ఎందుకంటే త్వరలోనే బాల్‌ టాంపరింగ్‌కు ఐసీసీ చట్టబద్దత కల్పించనుంది. అధికారికంగా బాల్‌ టాంపరింగ్‌ చేసేందుకు అవకాశం కల్పించనుంది.

ఏమిటిదని ఆలోచిస్తున్నారా..... కరోనా వైరస్ పుణ్యమాని ఈ బాల్ టాంపరింగ్ లీగల్ కాబోతుంది. సాధారణంగా బౌలర్లు బంతిని తమ ఉమ్మితో రుద్దడం మనం చూస్తూనే ఉంటాము. ఈ కరోనా వైరస్ వల్ల ఇకమీదట క్రికెట్లో అది నిషేధం అవ్వొచ్చు. 

వన్డే, టీ20 ఫార్మాట్‌ క్రికెట్‌లో బంతి స్వరూపంపై ఎటువంటి సమస్యలు లేవు. కానీ టెస్టు క్రికెట్‌లో 80 ఓవర్ల పాటు బంతి మెరుపు నిలుపుకోవటం, రివర్స్‌ స్వింగ్‌ కోసం ఓ వైపు గరుకుగా ఉంచేందుకు లాలాజలం వాడుతున్నారు. 

కరోనా వైరస్‌ ప్రభావంతో ఇక నుంచి ఆటగాళ్లు ఉమ్మితో బంతి మెరుపు తగ్గించే సాహసానికి ఒడిగట్టలేరు. దీంతో బాల్‌ టాంపరింగ్‌కు చట్టబద్దత కల్పించాలనే విలక్షణ ఆలోచనలు ముందుకొస్తున్నాయి. క్రికెట్‌ పునః ప్రారంభానికి ముందే బాల్‌ టాంపరింగ్‌ కు చట్టబద్దతపై ఐసీసీ ఓ నిర్ణయం తీసుకోనుంది.

టాంపరింగ్ కు అనుమతించకపోతే ఇబ్బందే!

వన్డే, టీ20 ఫార్మాట్లలో ఇన్నింగ్స్‌కు ఓ కొత్త బంతిని వినియోగిస్తారు. వన్డేల్లో ఇప్పుడు వికెట్‌కు రెండువైపులా రెండు కొత్త బంతులు వాడుతున్నారు. ఒక బంతి 25 ఓవర్లు వినియోగిస్తారు. టీ20ల్లో 20 ఓవర్లే వేస్తారు. వన్డే, టి20ల్లో వచ్చిన నష్టం ఏమీ లేదు. 

కానీ టెస్టుల్లో ప్రతి 80 ఓవర్లకు ఓ కొత్త బంతిని అందిస్తారు. ఆరంభంలో 15-20 ఓవర్ల వరకు బంతిపై మెరుపు ఉంటుంది. మెరుపు ఉన్నంతవరకూ బ్యాట్‌, బంతికి సరసమైన పోటీ ఉంటుంది. 

బంతిపై మెరుపు తగ్గిన తర్వాత సైతం బ్యాట్స్‌మన్‌ను ఇబ్బందికి గురిచేసేందుకు బౌలర్లు రివర్స్‌ స్వింగ్‌ను ఆశ్రయిస్తారు. రివర్స్‌ స్వింగ్‌ కోసం బంతికి ఓ వైపు మెరుపు తగ్గించి, మరోవైపు మెరుపును  కొనసాగించేందుకు విశ్వప్రయత్నం చేస్తారు. 

అందుకోసం ఇప్పుడు క్రికెటర్లు అందరూ లాలాజలం వాడుతున్నారు. ఉమ్మిని తీసుకుని బంతిపై రుద్దుతున్నారు.  బంతిని టీ షర్ట్‌, టవల్, ప్యాంటుకేసి  రుద్దటం ద్వారా బంతి స్వరూపం మార్చేందుకు ప్రయత్నిస్తారు. 

ఈ ప్రక్రియలో వేగవంతమైన ఫలితాల కోసం క్రికెటర్లు కొన్నిసార్లు ఇతర పద్దతులను సైతం అనుసరిస్తారు. నిషేధిత వస్తువలతో బంతి స్వరూపాన్ని మార్చుతున్నారు. అదే బాల్‌ టాంపరింగ్‌! 

కరోనా వైరస్‌ క్రికెట్‌ ముందు కొత్త ప్రశ్నలను ఉంచింది. ఉమ్మితో బంతి స్వరూపం మార్చేందుకు ప్రయత్నిస్తే... కాచుకు కూర్చున్న కరోనా పంజా విసిరేందుకు రెడీ అవుతుంది. అలాగని బంతిని రుద్దకుండా  వదిలేస్తే బ్యాట్స్ మెన్ వీర విహారం మొదలవుతుంది. 

బౌలింగ్ లో రివర్స్ స్వింగ్ అనేది ఒక కళ. ఈ రివర్స్ స్వింగ్ బౌలర్లను అన్ని జట్లు కూడా తమ అమ్ములపొదిలో ప్రత్యేక అస్త్రాలుగా వాడుకుంటుంటాయి. టెస్టు మ్యాచ్ సెకండ్ హాఫ్ లో వీరి విజృంభణ చూడడానికి రెండు కండ్లు చాలవు అనడంలో అతిశయోక్తి లేదు. 

మరి బాల్ టాంపరింగ్ కు ఎలా అనుమతి ఇస్తారు...?

బాల్ టాంపరింగ్ కు అనుమతి అంటే... ఏదో క్రికెటర్లు ఇక సాండ్ పేపర్లు తెచ్చేసి బాల్ స్వరూపాన్ని మార్చేస్తారు అని అనుకోకండి. బాల్ మెరుపును అలానే ఉంచడానికి ఉమ్మి బదులుగా వేరే వాటిని వాడేందుకు అనుమతించే ఆస్కారం ఉందని సమాచారం. 

ప్రపంచ క్రికెట్‌లో ఇప్పుడు మూడు రకాల బంతులు వాడుకలో ఉన్నాయి. కాకాబురా, డ్యూక్‌, ఎస్‌జీ బంతులు వినియోగంలో ఉన్నాయి. బంతి మెరుపులో మార్పులు తీసుకొచ్చేనందుకు లెథర్‌ మాయిశ్చరైజర్లు, వాక్స్‌, షూ పాలిష్‌లను వాడేవారు. 

వీటి వినియోగం వల్ల ఒక్కో రకం బంతి ఒక్కో విధంగా టర్న్ అవుతుంది. వీటిపై ఐసీసీ నిషేధం విధించింది. వీటితో బంతి ఆకారం, స్వరూపం మార్చే ప్రయత్నం చేస్తే బాల్‌ టాంపరింగ్‌ కింద చర్యలు తీసుకుంటుంది. అందుకే, ఆటగాళ్లు కేవలం ఉమ్మిని మాత్రమే వాడుతున్నారు.ఇక ఇప్పుడు ఇలా  లెథర్‌ మాయిశ్చరైజర్లు, వాక్స్‌, షూ పాలిష్‌లను అనుమతించే వీలుందని తెలియవస్తుంది. 

కోవిడ్‌:-19 మహమ్మారితో క్రికెట్‌లో కొన్ని మార్పులు అనివార్యం. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో ఎర్ర బంతి మెరుపు తగ్గించేందుకు, నిలిపేందుకు మునుపటిలా లాలాజలం వాడే పరిస్థితి ఏమాత్రం లేదు. 

దీంతో లెథర్‌ మాయిశ్చరైజర్‌, వాక్స్‌, షు పాలిష్‌లను వినియోగించేందుకు అనుమతించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. కరోనా వైరస్‌ ముప్పు నేపథ్యంలో బాల్‌ టాంపరింగ్‌కు చట్ట బద్దత కల్పించటం ఐసీసీకి అనివార్యం కానుంది. 

ఐసీసీ క్రికెట్‌ కమిటీ వచ్చే నెలలో సమావేశం కావాల్సి ఉండగా, కోవిడ్‌-19తో వాయిదా పడింది. జూన్‌-జులైలో ఈ సమావేశం జరిగే అవకాశం కనిపిస్తోంది.  క్రికెట్‌ సీజన్ పునః ప్రారంభమయ్యే నాటికి టెస్టు క్రికెట్‌లో బాల్‌ టాంపరింగ్‌పై ఐసీసీ ఓ విధానంతో ముందుకు రానుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios