క్రికెట్ సీజన్ షురూ: కరోనా సంస్కరణల పేరుతో క్వారంటైన్ నిబంధనలు గాలికి!
ఇంగ్లాండ్, వెస్టిండీస్‌లు బయో సెక్యూర్ బబుల్ వాతావరణంలో టెస్టు సిరీస్ ఆడేందుకు రంగం సిద్ధమవుతుంది. కరోనా వైరస్ మహమ్మారి ప్రమాదకర పరిస్థితుల్లో సిరీస్‌కు ముందు క్వారంటైన్, కోవిడ్ రోగ నిర్ధారణ పరీక్షలను పక్కాగా అమలు చేస్తోన్న క్రికెట్ బోర్డులు ఓ విషయంలో సందిగ్ధంలో పడ్డాయి.
కరోనా దెబ్బతో మూడు నెలల సుదీర్ఘ విరామం తరువాత తొలి క్రికెట్ మ్యాచ్ జరగబోతుంది. ఇంగ్లాండ్, వెస్టిండీస్‌లు బయో సెక్యూర్ బబుల్ వాతావరణంలో టెస్టు సిరీస్ ఆడేందుకు రంగం సిద్ధమవుతుంది. కరోనా వైరస్ మహమ్మారి ప్రమాదకర పరిస్థితుల్లో సిరీస్‌కు ముందు క్వారంటైన్, కోవిడ్ రోగ నిర్ధారణ పరీక్షలను పక్కాగా అమలు చేస్తోన్న క్రికెట్ బోర్డులు ఓ విషయంలో సందిగ్ధంలో పడ్డాయి. బయో బబుల్ వాతావరణంలో ఉమ్మి వాడకం నిషేధించిన ఐసీసీ.. అదే పరిస్థితుల్లో కోవిడ్-19 లక్షణాలు తలెత్తితే తప్పనిసరి క్వారంటైన్ నిబంధనలు విస్మరించింది.
"కుటుంబంలో ఎవరికైనా కోవిడ్-19 లక్షణాలు కనిపిస్తే ఆ రోజు నుంచి ఏడు రోజుల ఐసోలేషన్ తప్పనిసరి. ఇతర కుటుంబసభ్యులు కచ్చితంగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. కోవిడ్-19 లక్షణాలు లేకపోయినా క్వారంటైన్‌లో ఉండటం తప్పదు. ఒకవేళ 14వ రోజు రోగ లక్షణాలు కనిపిస్తే ఆ రోజు నుంచి మరో ఏడు రోజుల ఐసోలేషన్ పీరియడ్"- ఇది ప్రస్తుతానికి కరోనా వైరస్ కట్టడికి ఇంగ్లాండ్, ఇతర యూరోపియన్ దేశాల్లో పాటిస్తున్న విధానం.
మార్చి తొలి వారం నుంచి ఆగిపోయిన అంతర్జాతీయ క్రికెట్ జులై 8న ఇంగ్లాండ్, వెస్టిండీస్ తొలి టెస్టుతో పునః ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ మూడు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఆటగాళ్ల ఆరోగ్య భద్రత కోసం బయో సెక్యూర్ బబుల్ వాతావరణం నెలకొల్పుతోంది.
ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం (లాంక్ షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్)లోని హౌటల్‌లోనే క్రికెటర్లకు బస ఏర్పాటు చేస్తోంది. టెస్టు మ్యాచ్ నిర్వహణతో సంబంధం లేని వ్యక్తుల ప్రవేశంపై కఠిన ఆంక్షలు విధించింది. కరోనా వైరస్ రోగ నిర్ధారణ పరీక్షల అనంతరం (అందరూ నెగెటివ్ గా తేలిన తరువాత ) వెస్టిండీస్ జట్టు ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.
అక్కడే విండీస్ క్రికెట్ బృందం 14 రోజుల తప్పనిసరి క్వారంటైన్‌ను పూర్తి చేసుకోనుంది. ఇదిలా ఉండగా, టెస్టు క్రికెట్ పునరుద్ధరణకు ముందు పలు సంస్కరణలకు ఆమోదం తెలిపిన ఐసీసీ.. అత్యంత కీలక విషయాన్ని విస్మరించింది.
ఐసీసీ మంగళవారం ఐదు కీలక నిబంధనలను తీసుకొచ్చింది. అనిల్ కుంబ్లే సారథ్యంలోని క్రికెట్ కమిటీ సిఫారసులకు ఐసీసీ యథాతథంగా ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న కంకషన్ (బౌన్సర్ దెబ్బకు తల బెదరటం) సబ్‌స్టిట్యూట్‌కు అదనంగా, కరోనా సబ్‌స్టిట్యూట్ నిబంధన తీసుకొచ్చింది.
టెస్టు మ్యాచ్ మధ్యలో ఏ ఆటగాడికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే, అతడికి బదులుగా మరో ఆటగాడిని తుది జట్టులోకి తీసుకుంటారు. బ్యాట్స్‌మన్‌కు బ్యాట్స్‌మన్, పేసర్‌కు పేసర్, స్పిన్నర్‌కు స్పిన్నర్, ఆల్‌రౌండర్‌కు ఆల్‌రౌండర్, వికెట్ కీపర్‌కు వికెట్ కీపర్‌లను రిఫరీ తన విచక్షణాధికారంతో తుది జట్టులోకి తీసుకుంటాడు. కరోనా వైరస్ పరిస్థితుల్లో తటస్థ అంపైర్ల ఏర్పాటు కష్టసాధ్యం. దీంతో స్థానిక అంపైర్లతో టెస్టు మ్యాచ్‌ల నిర్వహణకు అమనుతి ఇచ్చింది.
స్థానిక అంపైర్ల వినియోగంతో రెండు జట్లకు అదనంగా మరో డిఆర్‌ఎస్ (నిర్ణయ సమీక్ష విధానం)అవకాశాన్ని కల్పించింది. ఇక్కడివరకూ బాగానే ఉంది. కానీ కరోనా సబ్‌స్టిట్యూట్ నిబంధన తీసుకొచ్చిన ఐసీసీ, ఇక్కడ అత్యంత కీలక క్వారంటైన్ నిబంధనలను విస్మరించింది. నిబంధనల ప్రకారం కరోనా పాజిటివ్‌గా తేలిక వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన అందరూ క్వారంటైన్‌లో ఉండాలి.
ఇక్కడ క్రికెట్ జట్టును ఓ కుటుంబంగా భావిస్తే.. ఒక ఆటగాడికి కరోనా లక్షణాలు కనిపించినా జట్టు మొత్తం కచ్చితంగా క్వారంటైన్‌కు వెళ్లాల్సిందే. బ్రిటన్‌లో క్వారంటైన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి అక్కడి ప్రభుత్వం ఏకంగా రూ. 85 వేలు జరిమానా విధిస్తోంది (విదేశాల నుంచి వచ్చినవారికి బ్రిటన్ ప్రభుత్వం ఈ నిబంధన ప్రవేశపెట్టంది.
ఇంగ్లాండ్‌లో 1000 యూరోలు, స్కాట్లాండ్‌లో గరిష్టంగా 500 యూరోలు జరిమానాగా విధిస్తున్నారు). ఈ పరిస్థితుల్లో మాంచెస్టర్‌లో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌కు, టెస్టు సిరీస్‌కు క్వారంటైన్ నిబంధనలు పూర్తిగా విస్మరించటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. క్రికెట్ పునరుద్ధరణకు బయో సెక్యూర్ బబుల్ వాతావరణం నెలకొల్పినా, సమాధానం దొరకని ప్రశ్నలు మిగిలే ఉన్నాయని క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ఇదివరకే సందేహం వ్యక్తపరిచారు. ఆ ప్రశ్నలకు ఐసీసీ క్రికెట్ కమిటీ సమాధానాలు వెతికే ప్రయత్నం చేయకపోవటం గమనార్హం.
కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటంలో ప్రజలకు అవగాహన కల్పించటం, చైతన్యం తీసుకురావటంలో క్రీడాకారులే ముందుండాలి!. అటువంటిది క్రీడాకారులే క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించి ఆటలో నిమగమైతే సంబంధిత ప్రభుత్వాలు చర్యలు తీసుకోకుండా ఉంటాయా? అసలు అటువంటి పరిస్థితుల్లో క్రీడల నిర్వహణకు అనుమతులు ఇస్తాయా? అనేది ఆసక్తికరం.
నిబంధనల ప్రకారం జట్టులోని ఏ ఆటగాడికి కోవిడ్ లక్షణాలు కనిపించినా, జట్టు మొత్తం క్వారంటైన్‌లో ఉండాలి. టెస్టు మ్యాచ్‌లో ఏ రోజు కోవిడ్ లక్షణాలు కనిపిస్తే, సబ్‌స్టిట్యూట్ చేస్తారు. కానీ కోవిడ్ లక్షణాలు కనిపించిన ఆటగాడి ఐసోలేషన్ సమయం రెండో టెస్టు సమయానికి ముగుస్తుంది.
ఇదే సమయంలో జట్టులో మరో ఆటగాడికి సైతం కోవిడ్ లక్షణాలు ఉంటే.. అప్పుడు ఏం చేయాలనేది క్రికెట్ కమిటీ తేల్చలేదు. దీంతో సహాయక సిబ్బంది, హాస్పిటాలిటీ సిబ్బంది, మ్యాచ్ అధికారులు సహా అందరూ ప్రమాదంలో పడనున్నారు.
ఓ బృందంలో కోవిడ్ లక్షణాలు కలిగిన వ్యక్తిని తప్పిస్తే సరిపోదు, బృందంలోని మిగతా సభ్యుల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ఐసీసీపై ఉంది. పూర్తి బయో సెక్యూర్ బబుల్ వాతావరణంలో నిజానికి కరోనా సబ్‌స్టిట్యూట్ అవసరం ఏర్పడే అవకాశాలు చాలా స్వల్పం. కానీ ఆ పరిస్థితి ఏర్పడి మిగతా సహచర క్రికెటర్లను ఐసోలేషన్, క్వారంటైన్‌లో ఉంచకుంటే.. తద్వారా తలెత్తే విపరీత పరిణామాలకు ఐసీసీ బాధ్యత వహించాలి. అటువంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ క్రికెట్ (కరోనా వ్యాక్సిన్ రాకుంటే) మరింత ప్రమాదంలో పడుతుంది.