అసలైన ద్రోణాచార్య ఎవరు...?

నిజమైన ద్రోణాచార్యులు ఎవరు? అథ్లెట్‌లోని ప్రతిభను గుర్తించిన వారా...? అథ్లెట్‌ ప్రతిభను మరింత సానపెట్టిన వారా... ? ఈ ప్రశ్న ఇప్పుడు మరోసారి తెరమీదకు వచ్చింది. 

Dronacharya Award Issue: Foreign Coaches vs Indian Coaches

క్రీడా రంగంలో చాంపియన్లను తీర్చిదిద్దిన గురువులకు ప్రభుత్వం అందించే అత్యున్నత గౌరవం ద్రోణాచార్య పురస్కారం. మహాభారతంలో పాండవులకు, కౌరవులకు గురువైన ద్రోణాచార్యుడి పేరిట ఈ పురస్కారాన్ని అందిస్తుంది ప్రభుత్వం. తన విద్యార్ధి విజయంలో తన ఆనందాన్ని వెతుక్కునే వాడే గురువు. 

ఈ ఏడాది ద్రోణాచార్య పురస్కారాని భారత అథ్లెటిక్‌ సంఘం (ఏఎఫ్‌ఐ) డిప్యూటీ చీఫ్‌ కోచ్‌ రాధాకృష్ణన్‌ అయ్యర్‌ను నామినేట్‌ చేసింది. దానితో ఎన్నో ఏండ్లుగా నడుస్తున్న ఒక చర్చ మరోసారి తెర మీదకు వచ్చింది. 

నిజమైన ద్రోణాచార్యులు ఎవరు? అథ్లెట్‌లోని ప్రతిభను గుర్తించిన వారా...? అథ్లెట్‌ ప్రతిభను మరింత సానపెట్టిన వారా... ? ఈ ప్రశ్న ఇప్పుడు మరోసారి తెరమీదకు వచ్చింది. ఏఎఫ్‌ఐలో పలువురు విదేశీ కోచ్‌లు కూడా క్రీయాశీలకంగా పని చేస్తున్నారు. విదేశీ కోచ్‌లను ద్రోణాచార్య అవార్డుకు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా? లేదంటే ద్రోణాచార్య అవార్డు కేవలం భారతీయ కోచ్‌లకు మాత్రమే పరిమితమా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. 

ఈ మొత్తం వ్యవహారం అర్థమవ్వాలంటే.... రాధాకృష్ణన్ గురించి తెలుసుకోవడంతోపాటుగా, విదేశీ కోచ్ ల కృషి, వారికి గతంలో ఎప్పుడైనా ఇలా ద్రోణాచార్య పురస్కారాలను అందించారా వంటి అంశాలను మనం తెలుసుకోవాలి. 

హిమ దాస్, నీరజ్ చోప్రాలను గుర్తించింది ఆయనే...!

విజయాలు సాధించినప్పుడు తెరముందు కనిపించడం కంటే, విజయం సాధించటం కోసం తెరవెనుక కృషి చేయటమే ఉత్తమని నమ్మిన గురువు రాధాకృష్ణన్‌ అయ్యర్‌. 1998-2001 వరకు మాల్దీవులకు చీఫ్‌ కోచ్‌గా పని చేసిన రాధాకృష్ణన్‌ 2003 నుంచి భారత అథ్లెటిక్‌ సంఘంతో కలిసి పనిచేస్తున్నారు. వరల్డ్‌ జూనియర్‌ చాంపియన్‌, జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా, పరుగుల జింక హిమ దాస్‌లను క్షేత్రస్థాయిలో గుర్తించి, వారిని కేంద్రానికి తీసుకొచ్చిన ఘనత రాధాకృష్టన్‌ కే దక్కుతుంది.

ప్రతిభావంతుల నుంచి ఉత్తమ ప్రదర్శన రాబట్టడం పెద్ద కష్టమైన పని కాదు. సహజ నైపుణ్యం, ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే ఉన్నత ఆశయం, కష్టపడే తత్వానికి గెలుపు కాంక్షతో రగిలే అథ్లెట్ల నుంచి కోచ్‌లు సులువుగానే ఫలితాలు రాబట్టవచ్చు. 

కానీ అంతర్జాతీయ వేదికపై రఫ్పాడించే ప్రతిభావంతులను క్షేత్రస్థాయిలో గుర్తించటం అంత సులువు కాదు. అందుకు ఎంతో కష్టం అవసరం. ప్రతిభ ఎక్కడ ఉందా అంటూ వెతుక్కుంటూ వెళ్లాలి. అథ్లెటిక్స్‌ డిప్యూటీ చీఫ్‌ కోచ్‌ రాధాకృష్ణన్‌ అదే పని చేశారు. 

భారత వర్థమాన, యువ స్టార్‌ అథ్లెట్లు హిమదాస్‌, నీరజ్‌ చోప్రా, వికె విస్మయలను రాధాకృష్టన్‌ గుర్తించారు. 2015లో నీరజ్‌ చోప్రా ప్రతిభను గుర్తించిన రాధాకృష్టన్‌ అతడికి 2016, 2017లో శిక్షణ అందించాడు. నీరజ్‌ చోప్రాకు నిష్ణాతులైన శిక్షకుల ట్రైనింగ్‌ అవసరమని సిఫారసు చేసింది అయ్యరే. 

దివంగత కోచ్‌ గ్యారి కాల్వర్ట్‌ నీరజ్‌కు స్పెషల్‌ ట్రైనింగ్‌ ఇచ్చారు. ఆయన శిక్షణలోనే నీరజ్‌ చోప్రా 2016లో వరల్డ్‌ జూనియర్‌ చాంపియన్‌గా నిలిచాడు. 2015లో నీరజ్‌ చోప్రా 73 మీటర్లు విసరగా... 2016లో 83 మీటర్లకు మెరుగయ్యాడు. 

హిమదాస్‌ విషయంలోనూ రాధాకృష్ణన్‌ ప్రత్యేక శ్రద్ధ వహించాడు. హిమ పరుగు వేగాన్ని పసిగట్టిన రాధాకృష్ణన్‌ ఆమె కోచ్‌తో మాట్లాడాడు. జాతీయ శిక్షణ శిబిరంలో చేరేందుకు ఒప్పించాడు. వికె విస్మయను ట్రైనింగ్ సెంటర్‌కు తీసుకొచ్చిన రాధాకృష్ణన్‌ ఆమెను 100 మీటర్ల నుంచి 400 మీటర్ల రేసులోకి మార్చాడు. ఇప్పుడు దేశంలో 400 మీటర్ల పరుగులో ఉత్తమ స్ప్రింటర్‌ విస్మయ. 

చాలా మంది ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు, ఉత్తమ కోచ్‌లు జీవితకాలంలో ఒక్క చాంపియన్‌ను మాత్రమే తయారు చేస్తున్నారు. వర్థమాన చాంపియన్ల తయారీపై శ్రద్ధ వహించటం లేదు. రాధాకృష్ణన్‌ మాత్రం అందుకు భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ప్రతిభావంతులను ఎంపిక చేసి, వరల్డ్‌ చాంపియన్లుగా తీర్చిదిద్దుతు న్నాడు. ఒక్క చాంపియన్‌తో సంతృప్తి చెందటం లేదు. 

మరి విదేశీ కోచ్ ల సంగతేంటి...?

2012లో క్యూబా బాక్సింగ్‌ కోచ్‌ బిఐ ఫెర్నాండేజ్‌ ద్రోణాచార్య పురస్కారం అందుకున్నారు. ఫెర్నాండేజ్‌ భారత్‌లో 20 ఏండ్లు ఉన్నారు. బాక్సింగ్‌ వ్యవస్థను పునర్మించారు. రెండు దశాబ్దాల కఠోర శ్రమ అనంతరం ఒలింపిక్స్‌లో భారత్ కు పతకం అందించాడు. బిఐ ఫెర్నాండేజ్‌ ద్రోణాచార్య పురస్కారానికి పూర్తిగా నిస్సంకోచంగా అర్హులు. 

కానీ ఇతర విదేశీ కోచ్‌లు 3-5 ఏండ్లు మాత్రమే ఇక్కడ ఉంటున్నారు. కాంట్రాక్టు ముగియగానే వెళ్లిపోతున్నారు. వర్థమాన అథ్లెట్లపై విదేశీ కోచ్‌లు పనిచేయటం లేదు. ఆ పని భారతీయ కోచ్‌లు చేస్తున్నారు. 

అథ్లెటిక్స్‌లో రాధాకృష్ణన్‌ చేస్తున్నట్టే బాక్సింగ్‌లో ఫెర్నాండేజ్‌ చేశారు. రాధాకృష్ణన్‌ అథ్లెట్ల శిక్షణతో పాటు లెవల్‌-3, లెవల్‌ -2 కోచ్‌లను సైతం సిద్ధం చేస్తున్నారు. రాధాకృష్ణన్‌ పర్యవేక్షణలో సుమారు వెయ్యిమంది లెవల్‌-3 కోచ్‌లు తయారయ్యారు. వంద మంది వరకు లెవల్‌ 2 కోచ్‌లు ఉన్నారు. 

విదేశీ కోచ్‌లకు చెల్లిస్తున్న వేతనంలో పదో వంతు సైతం భారతీయ కోచ్‌లకు ఇవ్వటం లేదు. భారత అథ్లెట్లకు తర్ఫీదు ఇవ్వటం ద్వారా విదేశీ కోచ్‌లు భారీగా ఆర్జించగల్గుతున్నారు. ద్రోణాచార్య పురస్కారం దక్కటంతో భారతీయ కోచ్‌లు ప్రేరణ పొందుతున్నారు. 

కొంతమంది అథ్లెట్లు కోచ్‌లు లేకపోయినా, ఒలింపిక్స్‌లో పతకాలు సాధించగలరు. అయినా, వారి కోచ్‌లకు అవార్డులు ఇస్తున్నాం. కొంతమంది పతకాలు సాధించకపోయినా.. కోచ్‌లను గౌరవిస్తున్నాం. అందుకు కారణంగా, పతకం కోసం వారు కఠిన ప్రయత్నం చేశారు. ప్రతిసారీ పతకాలే అవార్డులకు కొలమానం కారాదు. పతకాలు సాధించగలిగే వారిని గుర్తించే గురువులను వరించినప్పుడే ద్రోణాచార్య పురస్కారానికి మరింత విలువ చేకూరుతుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios