హైదరాబాద్: క్యాబ్ సేవల విభాగంలో దిగ్గజ సంస్థ ఉబెర్‌లో 50 ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నట్లు ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్ర అండ్ మహీంద్ర లిమిటెడ్ ప్రకటించింది. సున్నా శాతం ఉద్గారాల విడుదల చేసే ఈ వాహనానాలను నగరంలో నడపనున్నట్లు గురువారం తెలిపింది. 

దేశ వ్యాప్తంగా డిమాండ్ ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను ఉబెర్ సంస్థతో కలిసి ప్రవేశపెట్టే విషయంలో ఒప్పందం కుదుర్చుకున్నట్లు గతంలోనే మహీంద్ర ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగానే మొదటగా హైదరాబాద్ నగరంలో మహీంద్ర ఈ2ఓ ప్లస్ హ్యాచ్‌బ్యాక్, మహీంద్ర వెరిటో సెడాన్ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది.

ఈ వాహనాల అవసరాల కోసం నగరంలో క్యాబ్ సేవలు అందిస్తున్న పబ్లిక్, ప్రైవేటు సంస్థలతో కలిసి పలు ప్రాంతాల్లో 30 కామన్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు సంస్థ ప్రకటించింది. 

ఈ సందర్భంగా మహీంద్ర ఎలక్ట్రిక్ సీఈఓ మహేశ్ బాబు మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌ను పెంచేందుకే ఉబెర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. సమీప భవిష్యత్తులో దేశ వ్యాప్తంగా మరిన్ని నగరాల్లో ఉబెర్ ద్వారా మరిన్ని మహీంద్ర ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

ఎలక్ట్రిక్ వాహనాల డ్రైవర్ల ఎడ్యుకేషన్, ట్రైనింగ్ సంబంధిత అంశాల్లో మహీంద్ర సహకరిస్తుందని ఆయన చెప్పారు. హైదరాబాద్ నగరంలో తమ  సేవలు అందించేందుకు మద్దతు అందించిన తెలంగాణ ప్రభుత్వానికి ఈ సందర్భంగా మహేశ్ ధన్యవాదాలు తెలిపారు.