తెలంగాణ ఐటీ రంగం మెరుగైన వృద్ధి రేటు నమోదు చేసింది. ఐటీ ఎగుమతుల్లో, ఉద్యోగాల కల్పనలో నాలుగేళ్ల క్రితంనాటి సత్తా చాటింది. గత ఐదేళ్లలో ఐటీ ఎగుమతులు రెండింతలు పెరిగాయి. 2018-19 ఏడాదికి ఎగుమతులు రూ.1,09,219 కోట్లుగా వెల్లడైంది.

ఉద్యోగాల కల్పనలోనూ మెరుగైన వృద్ధి రేటు నమోదైంది. ఉద్యోగాల పెరుగుదల శాతం 14.2తో గతేడాది కన్నా అదనంగా 67,725 మందికి ఉద్యోగాలు లభించాయి. ఐటీ వృద్ధిరేటుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.

‘గతేఏడాది కన్నా 17 శాతం వృద్ధిరేటుతో ఐటీ ఎగుమతులు రూ.లక్ష కోట్లకు చేరాయి. ఐదేళ్లలో ఐటీ ఎగుమతులు రెండింతలు చేస్తామన్న హామీ నెరవేరింది. 2013-14లో రూ.56 వేల కోట్లు ఉంటే ఇప్పుడు రూ.1.09 లక్షల కోట్లుగా ఉంది. ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ఐటీ అధికారులు, సిబ్బంది కృషి, పట్టుదలతో ఈ ప్రగతి సాధ్యమైంది’ అని కేటీఆర్ తెలిపారు. 

2017-18లో ఐటీ ఎగుమతుల్లో వృద్ధి రేటు 9.32 శాతానికి పరిమితమైంది. ఇది గత ఐదేళ్లలో అత్యల్పం. అంతకు ముందు ఏడాది వరకు రెండంకెలుగా ఉండేది. ఏడాదిలోనే వృద్ధి భారీగా పెరిగింది.

2014లో కొలువు దీరిన తెలంగాణ ప్రభుత్వం హైసియా, నాస్కాం వంటి సంస్థలతో కలిసి కార్యాచరణ చేపట్టింది. మరోవైపు ఆపిల్, గూగుల్, సేల్స్‌ఫోర్స్, అమెజాన్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో తమ కంపెనీల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కేంద్రాలను ఏర్పాటుచేశాయి. 

కేవలం హైదరాబాద్‌కే ఐటీ పరిశ్రమను పరిమితం చేయకుండా ద్వితీయశ్రేణి నగరాలకు సైతం విస్తరించడంలో భాగంగా వరంగల్, నిజామాబాద్, ఖమ్మంవంటి నగరాల్లోనూ ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది.

మరోవైపు నిపుణులైన ఉద్యోగులను అందించేందుకు, ఉద్యోగాల్లో తెలంగాణ యువతకు పెద్దఎత్తున ప్రాధాన్యం దక్కేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఏర్పాటుచేశారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఫలితంగా తెలంగాణ యువతకు పెద్దసంఖ్యలో ఉద్యోగాలు దక్కాయి. 

తెలంగాణకు ప్రకటించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపింది. తద్వారా ఐటీ పరిశ్రమను తీవ్రంగా ప్రభావితం చేసేలా వ్యవహరించింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఆటోమేషన్ వల్ల ఉద్యోగాల్లో భారీగా కోతలు పడుతాయన్న విమర్శలు ఉన్నాయి. 

ఇలా ప్రతికూల ధోరణులు ఉన్నప్పటికీ హైదరాబాద్ ఐటీ పరిశ్రమ ఏటేటా వృద్ధి పథంలోనే సాగింది. దేశ సగటును మించి దూసుకుపోయింది. తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి రాష్ట్రం నుంచి సుమారు రూ. 52 వేల కోట్ల ఐటీ ఎగమతులు ఉండేవి. ప్రస్తుతం తెలంగాణ ఐటీ పరిశ్రమ ఎగుమతులు రూ.1,09,219 కోట్లకు చేరుకున్నాయి. 

ఐటీ రంగంలో జాతీయ స్థాయిలో వృద్ధి 10% ఉంటుందని సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అంచనావేస్తున్న నేపథ్యంలో జాతీయ సగటు కంటే తెలంగాణ రాష్ట్రం ఏడు శాతం అధికంగా వృద్ధిని సాధించడం విశేషం.

ప్రతి సంవత్సరం ఎస్టీపీఐ, ఎస్‌ఈజెడ్‌ల నుంచి గణాంకాలను స్వీకరిస్తారు. ఆ రెండు వేదికల నుంచి వచ్చిన గణాంకాల ఆధారంగా ప్రస్తుత ఏడాది ఎగుమతుల లెక్కలను క్రోడీకరిస్తారు.