పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జాతిని ఉద్దేశిస్తూ ప్రధాని చేసిన కీలక వ్యాఖ్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఆపరేషన్ సింధూర్ ముగిసిన 51 గంటల తర్వాత ప్రధాని మోదీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఉగ్రవాదంపై పాకిస్తాన్‌ను తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదం, వ్యాపారం, నీరు, రక్తం కలిసి ఉండలేవని స్పష్టం చేశారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇవే.
1) మన బలం, సంయమనం ప్రపంచం చూసింది. ఆపరేషన్ సింధూర్‌లో మన సైనికులు అసమాన ధైర్యం ప్రదర్శించారు. వారి పరాక్రమాన్ని దేశంలోని ప్రతి తల్లికి, సోదరికి, కూతురికి అంకితం చేస్తున్నా.
2) ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు చూపించిన క్రూరత్వానికి దేశం, ప్రపంచం దిగ్భ్రాంతికి గురయ్యాయి. దేశ సమైక్యతను దెబ్బతీయాలని చూసిన వారికి ఇది గుణపాఠం.
3) ఈ దాడి తర్వాత దేశం మొత్తం ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మన సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం.
4) మన సోదరీమణుల నుదుట నుంచి సింధూరం తుడిచేస్తే ఏమవుతుందో ఇప్పుడు ప్రతి ఉగ్రవాదికి, ఉగ్రవాద సంస్థకు తెలిసింది.
5) ఆపరేషన్ సింధూర్ కేవలం పేరు కాదు, కోట్లాది మంది భారతీయుల భావోద్వేగాల ప్రతిబింబం. మే 6 అర్ధరాత్రి, మే 7 తెల్లవారుజామున ప్రపంచం మొత్తం ఈ ప్రతిజ్ఞ ఫలితాన్ని చూసింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడి చేసింది.
6) భారత్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటుందని ఉగ్రవాదులు ఊహించలేదు. దేశం ఐక్యంగా ఉన్నప్పుడు, దేశం ముందుంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాం.
7) పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత క్షిపణులు, డ్రోన్లు దాడి చేసినప్పుడు ఉగ్రవాదుల ధైర్యం దెబ్బతింది. బహావల్‌పూర్, మురీద్కే వంటివి ప్రపంచ ఉగ్రవాద విశ్వవిద్యాలయాలు.
8) ప్రపంచంలో జరిగిన అన్ని పెద్ద ఉగ్రవాద దాడులకు ఈ స్థావరాలతో సంబంధం ఉంది.
9) ఉగ్రవాదులు మన సోదరీమణుల సింధూరాన్ని తుడిచేశారు. అందుకే మన సైన్యం ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాం.
10) భారత్ చర్యతో పాకిస్తాన్ నిరాశకు, తీవ్ర నిస్పృహకు లోనైంది. దాని దుస్సాహసంతో భారత్‌పై దాడి చేసింది.
11) పాకిస్తాన్ మన పాఠశాలలు, కళాశాలలు, ఆలయాలు, గురుద్వారాలు, ఇళ్లను లక్ష్యంగా చేసుకుంది. మన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. కానీ అందులో అది బెడిసికొట్టింది.
12) పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులు భారత్ ముందు ఎలా ఛిన్నాభిన్నమయ్యాయో ప్రపంచం చూసింది. భారత వైమానిక రక్షణ వ్యవస్థ వాటిని గాల్లోనే కూల్చివేసింది.
13) పాకిస్తాన్ సరిహద్దులో యుద్ధానికి సిద్ధమైంది, కానీ భారత్ పాకిస్తాన్ గుండెపై దాడి చేసింది. భారత డ్రోన్లు, క్షిపణులు ఖచ్చితంగా దాడి చేశాయి.
14) భారత్ దాడి తర్వాత పాకిస్తాన్ తప్పించుకునే మార్గాల కోసం వెతికింది. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలను తగ్గించాలని వేడుకుంది. మే 10న పాకిస్తాన్ సైన్యం మన డీజీఎంఓను సంప్రదించింది.
15) పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం. భవిష్యత్తులో ఎలాంటి ఉగ్రవాద చర్యలు, సైనిక దుస్సాహసాలకు పాల్పడబోమని పాకిస్తాన్ వేడుకున్నప్పుడు మేము దానిని పరిగణించాం.
16) పాకిస్తాన్ ఉగ్రవాద, సైనిక స్థావరాలపై మా ప్రతీకార చర్యను ప్రస్తుతానికి నిలిపివేశాం. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ప్రతి అడుగును పరిశీలిస్తాం.
17) భారత సైన్యం అప్రమత్తంగా ఉంది. సర్జికల్ స్ట్రైక్, వైమానిక దాడి తర్వాత ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ భారత ఉగ్రవాద వ్యతిరేక విధానం.
18) ఉగ్రవాదంపై పోరాటంలో ఆపరేషన్ సిందూర్ కొత్త ఒరవడిని సృష్టించింది.
19) భారత్‌పై ఉగ్రవాద దాడి జరిగితే తగిన ప్రతీకారం తీర్చుకుంటాం. ఉగ్రవాదానికి మూలాలను ధ్వంసం చేస్తాం.
20) ఎలాంటి అణు బెదిరింపులనూ భారత్ సహించదు. దానిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
21) ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే ప్రభుత్వాన్ని, ఉగ్రవాద నాయకులను వేర్వేరుగా చూడం. ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రపంచం పాకిస్తాన్ నిజస్వరూపం చూసింది.
22) యుద్ధభూమిలో ప్రతిసారీ పాకిస్తాన్‌ను ఓడించాం. ఈసారి ఆపరేషన్ సిందూర్ కొత్త అధ్యాయం లిఖించింది.
23) ఈ ఆపరేషన్‌లో మన దేశీయ ఆయుధాల సామర్థ్యం రుజువైంది.
24) అన్ని రకాల ఉగ్రవాదులపై మనమందరం ఐక్యంగా ఉండాలి. మన ఐక్యతే మన బలం. ఇది యుద్ధాల యుగం కాదు, ఉగ్రవాద యుగం కూడా కాదు.
25) ఉగ్రవాదంపై సున్నా సహనం ఉత్తమ ప్రపంచానికి హామీ.
26) పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న తీరు ఒకరోజు పాకిస్తాన్‌నే నాశనం చేస్తుంది. దాని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయడం తప్ప వేరే మార్గం లేదు.
27) భారత్ వైఖరి స్పష్టంగా ఉంది - ఉగ్రవాదం, చర్చలు కలిసి ఉండలేవు. ఉగ్రవాదం, వ్యాపారం కలిసి నడవలేవు. నీరు, రక్తం కలిసి ప్రవహించలేవు.
28) నేను ఈరోజు ప్రపంచ సమాజానికి చెబుతున్నాను. పాకిస్తాన్‌తో చర్చలు జరిగితే అది ఉగ్రవాదం గురించే. పాకిస్తాన్‌తో చర్చలు జరిగితే అది పీఓకే గురించే.
29) నేడు బుద్ధ పూర్ణిమ. శాంతి మార్గాన్ని బుద్ధుడు మనకు చూపించాడు. ప్రతి భారతీయుడు శాంతియుతంగా జీవించాలి, అభివృద్ధి చెందిన భారతదేశ కలను సాకారం చేసుకోవాలి. అందుకే భారత్ బలంగా ఉండాలి. అవసరమైతే ఆ బలాన్ని ఉపయోగించుకోవాలి. గత కొన్ని రోజులుగా భారత్ అదే చేస్తోంది.
30) భారత సైన్యానికి, సాయుధ దళాలకు మరోసారి నా వందనాలు. భారత్ మాతాకీ జై.