లండన్‌: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం లండన్ లోని ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్ ను వీక్షించేందుకు విజయ్ మాల్యా వచ్చారు. భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టి లండన్‌లో ఆయన తలదాచుకుంటున్న విషయం తెలిసిందే.  మ్యాచ్ చూసి బయటకు వచ్చిన మాల్యాను చుట్టుముట్టి కొంత మంది విజయ్ మాల్యా చోర్ హై అంటూ నినాదాలు చేశారు.  చోర్, చోర్ అంటూ నినాదాలు చేశారు. ఆ నినాదాలపై ఆయన ప్రతిస్పందిస్తూ తన తల్లి బాధపడకూడదని తాను భావిస్తున్నట్లు తెలిపాడు.

 విజయ్‌ మాల్యా నేడు భారత్‌-ఆస్ట్రేలియాల మధ్య ఓవల్‌ మైదానంలో జరుగుతున్న వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ మ్యాచ్‌ను చూసేందుకు తల్లితో కలిసి  వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే, తాను క్రికెట్‌ మ్యాచ్‌ చూసేందుకు వచ్చానని చెప్పి వెళ్లిపోయాడు.

 

భారత్‌లోని బ్యాంకులకు వేలకోట్లను ఎగ్గొట్టిన కేసులో మాల్యా విచారణ ఎదుక్కొంటున్న విషయం తెలిసిందే. ఇటీవల డియాజియోతో వివాదం కేసులో కూడా విజయ్‌ మాల్యాకు లండన్‌ హైకోర్టులో చుక్కెదురైంది. దీంతో ఈ కేసులో 135 మిలియన్‌ డాలర్లను బ్రిటన్‌కు చెందిన డియాజియో గెలుచుకొంది. 

భారత్‌లోని బ్యాంక్‌లకు మాల్యా దాదాపు రూ.10వేల కోట్లకు పైగా బకాయి పడ్డాడు.  ఈ మొత్తానికి  సంబంధించిన భారత్‌లో దాఖలైన కేసుల విచారణ హాజరయ్యేలా అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 

ఇప్పటికే దిగువ కోర్టులో భారత్‌ గెలిచింది. యూకే హోం సెక్రటరీ మాల్యాను అప్పగించేలా ఆదేశాలపై సంతకాలు చేశారు. దీనిపై మాల్యా అప్పీల్‌కు వెళ్లారు. జులై 2వ తేదీన దీనికి సంబంధించిన తీర్పు వెలువడుతుంది.