లక్నో: సెక్స్ కు నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన 24 ఏళ్ల వయస్సు గల వ్యక్తి భార్య గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత తన మర్మాంగాలను కోసేసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సిద్దార్థనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వ్యక్తి ప్రస్తుతం గోరఖ్ పూర్ లోని బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు.

సిద్ధార్థనగర్ జిల్లాలోని పాత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో గల కాక్రా పోఖర్ గ్రామానికి చెందిన నిందితుడు అన్వరుల్ హసన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. భార్య తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 

సూరత్ లో పనిచేసే హసన్ ఏడాది క్రితం మెహ్ నాజ్ (21)ని పెళ్లి చేసుకున్నాడు. అతను రెండు రోజుల క్రితమే ఇంటికి వచ్చాడు. సంఘటన జరిగినప్పుడు ఇంట్లో దంపతులిద్దరే ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇంట్లో నుంచి పెద్ద శబ్దాలు వినిపిస్తుండడంతో పక్కింటివారు కిటికీ తెరిచి చూశారు. మెహ్ నాజ్ కింద పడి ఉండడాన్ని, హసన్ రక్తమడుగులో పడి ఉండడాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని హసన్ ను ఆస్పత్రికి తరలించారు.