ప్రధాాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఎంపీలో నిరసన చేపట్టారు. రాహుల్, ప్రియాంక గాంధీలు కూడా సహచర ఎంపీలతో కలిసి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.

దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా తీవ్ర వేడెక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంపీలె చేపట్టిన భారీ ప్రదర్శన తీవ్ర కలకలం రేపింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, ప్రజా సమస్యలపై గళం విప్పుతూ కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీ వీధుల్లో హోరెత్తించగా, మరోవైపు జంతర్ మంతర్ వద్ద CJP (కాక్రోచ్ జనతా పార్టీ) చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు ఉద్రిక్తతకు దారితీశాయి.

ప్రధాని నివాసం ముందు రాహుల్, ప్రియాంక ధర్నా

ఇవాళ (జూలై 21) పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ ఎంపీలు ఒక్కచోటికి చేరారు. అయితే వీళ్ళు పార్లమెంట్ లోకి వెళ్లకుండా హటాత్తుగా డిల్లీ వీధుల్లోకి చేరుకున్నారు.. కాంగ్రెస్ ఎంపీలు, సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో ప్రధాని నివాస ముట్టడికి బయలుదేరారు. ప్లకార్డులు చేతబూని, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారు ముందుకు సాగారు. అయితే ప్రధాని నివాసానికి వెళ్లే మార్గంలో పోలీసులు ముందస్తుగా భారీగా బారికేడ్లను ఏర్పాటు చేశారు.

లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీతో పాటు సీనియర్ ఎంపీలు మల్లాకార్జున ఖర్గే, కేసి వేణుగోపాల్ తదితరులు ప్రధాని నివాసం వద్ద ధర్నా చేపట్టారు. ప్రధాని మోదీ వెంటనే రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం యువత నిరసన తెలిపితే వారిపై పోలీసులు, భద్రతా దళాలు దాడులు జరపడాన్ని తప్పుబట్టారు. నీట్‌ లీకేజీ, ఢిల్లీలో పోలీసుల లాఠీఛార్జ్‌, అణిచివేత చర్యలకు నిరసనగా ధర్నా చేపట్టారు.

కాంగ్రెస్ ఎంపీలు చేతులకు తాళ్లు కట్టుకుని నిరసనలో పాల్గొన్నారు. పరిస్థితి చేయిదాటిపోకుండా ఉండేందుకు పోలీసులు పలువురు కాంగ్రెస్ ఎంపీలను, కీలక నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Scroll to load tweet…

జంతర్ మంతర్ వద్ద మిన్నంటిన నిరసనలు

ఇదే సమయంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వివిధ రాజకీయ శ్రేణుల ఆందోళనలు కొనసాగాయి. ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలకు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ సపోర్ట్స్ పెద్ద ఎత్తున హాజరై నిరసన తెలిపారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళనకారులు ఆరోపించారు.

జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్న నాయకులు మాట్లాడుతూ, దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష వైఖరిపై తమ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఎంతటి అణచివేత చర్యలకు పాల్పడినా ప్రజల తరుఫున ప్రశ్నించడం ఆపబోమని హెచ్చరించారు.

ఢిల్లీ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత

కాంగ్రెస్ ఎంపీల నిరసనలు, జంతర్ మంతర్ వద్ద ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు, పారామిలటరీ దళాలు పార్లమెంట్, ప్రధాని నివాసం, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాయి. ప్రధాని నివాసం, పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లే రహదారులను పాక్షికంగా మూసివేశారు. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. ముందస్తు జాగ్రత్త చర్యగా పలు కీలక మెట్రో స్టేషన్ల వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించారు.

 అధికార, విపక్షాల సవాళ్లు

కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని నివాసం ముట్టడించడాన్ని అధికార పక్షం తీవ్రంగా స్పందించింది. విపక్షాలు పార్లమెంట్ నిబంధనలను, ప్రజాస్వామ్య సాంప్రదాయాలను పక్కనపెట్టి వీధి పోరాటాల పేరుతో రాజకీయ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించింది. సభలో నిర్మాణాత్మక చర్చకు రాకుండా ఈ రకమైన ఆందోళనలతో వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడింది.

మరోవైపు పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై చర్చించే అవకాశం ఇవ్వనందునే తాము వీధుల్లోకి వచ్చి నిరసన తెలపాల్సి వచ్చిందని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. ప్రధాని నివాస ముట్టడి యత్నం, జంతర్ మంతర్ ఆందోళనలతో రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్విగ్న వాతావరణం నెలకొంది.

విద్యార్థులపై దాడిని ఖండించిన ఓవైసి

ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు జరిపిన చర్యను AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఇది ప్రభుత్వానికి మామూలేనని, పదేపదే ఇలాగే ప్రవర్తిస్తోందని మంగళవారం ఆయన విమర్శించారు. గతంలో లాయర్లు, రైతులు, సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు చేసినప్పుడు కూడా ప్రభుత్వం ఇలాగే వ్యవహరించిందని గుర్తుచేశారు. పార్లమెంట్ మార్చ్‌లో 100 మందికి పైగా గాయపడటంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"నిన్న జరిగింది ఈ ప్రభుత్వానికి అలవాటైన పనే. లాయర్ల నిరసన, రైతుల ఆందోళన, సీఏఏ నిరసనల టైంలోనూ ఇలాంటివే చూశాం. ఈ ఆందోళన ఎన్నో వారాలుగా జరుగుతోంది. ప్రభుత్వం ముందే విద్యార్థులతో చర్చలు జరిపి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు" అని హైదరాబాద్ ఎంపీ అన్నారు.

5 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు, హింసపై పోలీసుల దర్యాప్తు

ఇదిలా ఉండగా సోమవారం జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో హింస, రాళ్లదాడి, విధ్వంసం జరిగాయన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు ఐదు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ హింస వెనుక ముందుగా పన్నిన కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకోసం 250కి పైగా వీడియోలను పరిశీలిస్తున్నారు.

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం పార్లమెంట్ స్ట్రీట్, కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్లలో ఈ ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. భారతీయ న్యాయ సంహిత (BNS) 2023, ఆయుధాల చట్టం 1959, ప్రభుత్వ ఆస్తి నష్టం నివారణ చట్టం (PDPP Act) కింద కేసులు పెట్టారు. ఈ ఘటనల్లో 118 మందికి పైగా పోలీసు సిబ్బంది, 60 మందికి పైగా నిరసనకారులు గాయపడినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.