Asianet News TeluguAsianet News Telugu

పర్వేజ్ ముషారఫ్ మరణం: కార్గిల్ యుద్ధం మాస్టర్ మైండ్, కశ్మీర్ సమస్య పరిష్కారానికి ప్రయత్నం.. ఆసక్తికర వాస్తవాలు

పర్వేజ్ ముషారఫ్ ఒకప్పుడు అటు పాకిస్తాన్, ఇటు ఇండియా న్యూస్ చానెళ్లలో ఆయన వ్యాఖ్యలు దుమారం రేపేవి. ఆయన చేసే వివాదాస్పద, తీవ్ర వ్యాఖ్యలు ఎప్పుడూ అతన్ని చర్చలో ఉంచేవి. రక్తపాతం లేకుండా జరిగిన ఆర్మీ తిరుగుబాటుతో నవాజ్ షరీఫ్ ఫెడరల్ ప్రభుత్వం కూలిపోయి.. 1999లో అధికారాన్ని చేతిలోకి తీసుకున్న ముషారఫ్ సుమారు పదేళ్ల పాటు పాక్‌ను పాలించాడు. కార్గిల్ యుద్ధానికి మాస్టర్ మైండ్ అయిన ముషారఫ్ జమ్ము కశ్మీర్ సమస్యను పరిష్కార దరిదాపుల వరకు వెళ్లాడు.
 

pakistan military ruler pervez musharraf mastermind of kargil war, know interesting details
Author
First Published Feb 5, 2023, 2:57 PM IST

న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ మిలిటరీ రూలర్, జనరల్ పర్వేజ్ ముషారఫ్ 79వ యేట దుబాయ్‌లో కన్నుమూశాడు. అరుదైన వ్యాధితో దీర్ఘకాలం బాధపడిన ఆయన దుబాయ్‌లోని అమెరికన్ హాస్పిటల్‌లో మరణించాడు. పాకిస్తాన్ చరిత్రలో పర్వేజ్ ముషారఫ్ నియంతగా మిగిలాడు. ఆయన పాకిస్తాన్, ఇండియా మధ్య నెలకొన్న జమ్ము కశ్మీర్ సమస్యకు పరిష్కారానికి చాలా దగ్గరగా వెళ్లాడు. అదే విధంగా సరిహద్దు వెంట పాకిస్తాన్ ఆర్మీని అక్రమంగా భారత భూభాగంలోకి పంపించి కార్గిల్ యుద్ధానికి దారి తీసిన పరిణామాలకు కూడా అతనే కారకుడయ్యాడు. కార్గిల్ యుద్ధాన్ని ఆర్కిటెక్ట్ చేసిన పర్వేజ్ ముషారఫ్ జీవితం గురించి క్లుప్తంగా పరిశీలిద్దాం.

ప్రజల చేత ఎన్నుకోబడ్డ నవాజ్ షరీఫ్ ప్రభుత్వం రక్తపాతం లేకుండానే ఆర్మీ చేసిన తిరుగుబాటులో కూలదోసి 1999లో పర్వేజ్ ముషారఫ్ పగ్గాలు అందుకున్నాడు. ఆ తర్వాత 2008లో పదవీచ్యుతుడు కాకుండా పీఎంఎల్ క్యూ అనే పార్టీని ముందుగానే స్థాపించాడు.

ఓల్డ్ ఢిల్లీలో 1943 ఆగస్టు 11న జన్మించిన ముషారప్ కుటుంబం దేశ విభజన తర్వాత పాకిస్తాన్‌కు వెళ్లిపోయింది. దౌత్య వేత్త కుటుంబంలో జన్మించిన ముషారఫ్ అనతి కాలంలోనే పాకిస్తాన్ ఆర్మీలో వేగంగా ఎదిగాడు. 1965 యుద్ధాన్ని కళ్లారా చూసిన ఆయన స్పెషల్ సర్వీస్ గ్రూప్‌లో చేరాడు. 1998లో ఆర్మీ చీఫ్‌గా అతడిని నవాజ్ షరీఫ్ నియమించారు.

షరీఫ్ ఆహ్వానం మేరకు అప్పటి పీఎం అటల్ బిహారీ వాజ్‌పేయీ లాహోర్‌కు బస్సులో వెళ్లాడు. లాహోర్ డిక్లరేషన్‌పై సంతకం పెట్టి ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త రూపం దాల్చాలని అనుకున్నారు. కానీ, పాకిస్తాన్ ఆర్మీ మాత్రం కశ్మీర్ సాయుధులుగా నమ్మిస్తూ ఎల్‌వోసీ గుండా అక్రమంగా భారత భూభాగంలోకి దూరి సరిహద్దు వెంబడి కీలక ప్రాంతాల్లో పాగా వేశారు. ఆ తర్వాత కార్గిల్ సెక్టార్‌లో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగింది. నెలల్లోనే ఇది ముగిసింది. యూఎస్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ శాంతి వచనం కాకుండా భారత్ వైపు మొగ్గు చూపడంతో ఆర్మీని పాకిస్తాన్ వెనక్కి తీసుకోకతప్పలేదు.

Also Read: పర్వేజ్ ముషారఫ్‌ కన్నుమూత: అమైలాయిడోసిస్‌‌తో పోరాడుతూ మృతి.. ఈ అరుదైన వ్యాధి గురించిన వివరాలు ఇవే..

ఆ తర్వాత ఆర్మీ చీఫ్ ముషారఫ్, పీఎం షరీఫ్‌కు మధ్య బేధాభిప్రాయాలు పొడసూపాయి. ఈ బేధాభిప్రాయాలు తీవ్ర వాగ్వాదానికి దారి తీశాయి. 1999 అక్టోబర్‌లో ముషారఫ్ శ్రీలంక పర్యటనలో ఉన్నప్పుడు షరీఫ్ అతడిని డిస్మిస్ చేయడానికి ప్రయత్నించాడు. ఆయనను కరాచీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కాకుండా నియంత్రించే ప్రయత్నం చేశాడు. కానీ, మిలిటరీ ముషారఫ్ వెంట నిలిచింది. అన్ని ప్రభుత్వ సంస్థలను గుప్పిట్లోకి తీసుకుని షరీఫ్‌ను గద్దె పై నుంచి మిలిటరీ దింపేసింది. ముషారఫ్ తనను పాకిస్తాన్‌కు చీఫ్‌గా ప్రకటించుకోగా నవాజ్ షరీఫ్ సౌదీ అరేబియాలో స్వీయ అజ్ఞాతంలోకి వెళ్లారు. షరీఫ్ లోపభూయిష్టమైన పాలన కారణంగా ముషారఫ్‌ను నాయకుడిగా వ్యతిరేకించే ఆందోళనలు దేశంలో పెద్దగా రాలేవు. 

కార్గిల్ కాన్‌ఫ్లిక్‌కు రెండేళ్ల తర్వాత 2001 ఆగ్రాలో సదస్సుకు ముషారఫ్‌ను అప్పట పీఎం అటల్ బిహారీ వాజ్‌పేయి ఆహ్వానించారు. ఈ సమావేశం ద్వారా పెద్ద నిర్ణయాలు ఉంటాయని అందరూ భావించారు. కానీ ఇండియన్ జర్నలిస్టులతో ఆయన మీటింగ్‌ తర్వాత ఈ చర్చలే కొలాప్స్ అయిపోయాయి.

9/11 అల్ ఖైదా దాడి తర్వాత ఉగ్రవాదంపై అమెరికా యుద్ధంలో పాకిస్తాన్ కూడా చేరడంతో అమెరికా నుంచి ఆర్థిక సహాయం అందడం, అలాగే, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను లిబరల్ చేయడంతో ఆ దేశంలో లబ్ది పొందింది. పాకిస్తాన్ గడ్డపై ఎలాంటి ఉగ్రవాద రూపానికి తావులేదని 2004 జనవరిలో మిలిటరీ నియంత ముషారఫ్ కమిట్‌మెంట్ ఇచ్చినా మన దేశంతో ఆ దేశ సంబంధాల్లో పెద్దగా పురోగతి లేదు. అయితే, కశ్మీర్ ఇష్యూ సెటిల్ కావడానికి ముషారఫ్ నాలుగు పాయింట్ల సూత్రాన్ని పేర్కొనేవాడు. అందులో ఎల్‌వోసీ వద్ద ఇరు వైపులా మిలిటరీని తగ్గించడం, ప్రజలను సరిహద్దుకు అటు వైపు, ఇటు వైపు స్వేచ్ఛగా తిరగడానికి అనుకూలించే వాతావరణం నిర్మించడం, స్వాతంత్ర్యం లేకున్నా స్వయం పాలిత ప్రభుత్వానికి అనుమతించడం వంటి జాయింట్ మెకానిజం ద్వారా జమ్ము కశ్మీర్ మేనేజ్‌ చేయాలని ప్రతిపాదించాడు. అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలు ఇందుకు అనుకూలంగానే నడిచాయి. ఒక్కసారి మన్మోహన్ సింగ్ పాకిస్తాన్ పర్యటించి డీల్ ఫైనలైజ్ చేస్తే జమ్ము కశ్మీర్ సమస్య చాలా వరకు సద్దుమణిగేదే. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. అప్పుడు అంటే 2007లో ముషారఫ్‌కు ప్రభుత్వంపై పట్టుసడలింది. ఆర్మీలోనే అతనిపై అసంతృప్తి పెరిగింది. ఆ తర్వాత అతను తీవ్ర నిర్ణయాలు తీసుకున్నాడు. ఎన్నికలకు పిలుపు ఇచ్చిన సుప్రీంకోర్టుపై ఉక్కుపాదం మోపడం, ఆ తర్వాత అజ్ఞాతంలో ఉన్న బెనజీర్ భుట్టో, నవాజ్ షరీఫ్ మళ్లీ రాజకీయ రంగంలోకి రావడం, బెనజీర్ భుట్టో హత్య, ఇందులో ప్రభుత్వ ప్రమేయం(!) వంటివి ముషారఫ్‌ను ముంచేశాయి. చివరకు అతనే స్వీయ అజ్ఞాతంలోకి వెళ్లాడు.

Follow Us:
Download App:
  • android
  • ios