వంటిల్లు తెలంగాణలో.. బెడ్రూం మహారాష్ట్రలో.. ఓ ఇంటి వింత కథ.. రెండు రాష్ట్రాల్లోనూ పన్నులు, పథకాలు...
మహరాజ్‌గూడ గ్రామంలోని ఓ ఇల్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పది గదుల ఆ ఇంట్లో తెలంగాణలో నాలుగు గదులు, మహారాష్ట్రలో నాలుగు గదులు ఉన్నాయి.

మహారాష్ట్ర : ఒకే ఇంట్లోని ఓ గది ఒక రాష్ట్రంలో.. మరో గది మరో రాష్ట్రంలో ఉండే వింత ఎప్పుడైనా చూశారా? సినిమాల్లోనూ, నవలల్లోనూ ఇలాంటి వాటిమీద కొన్నిసార్లు కొన్ని సీన్లు ఉంటుంటాయి. వాటిని సరదాగా తీసుకుంటాం. నవ్వుకుని వదిలేస్తాం. కానీ నిజంగా అలాంటివి ఉంటాయా అనుకుంటాం కదా.. కానీ అలాంటి ఒక ఇల్లు ఉంది. అది మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లోని చంద్రాపూర్ జిల్లాలోని సిమావర్తి జీవాతి తహసీల్‌లోని మహారాజగూడ గ్రామంలో ఉంది. పవార్ కుటుంబానికి సంబంధించిన ఈ ఇంట్లో 13 మంది కుటుంబ సభ్యులు ఉంటున్నారు.
మహారాష్ట్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య 14 గ్రామాలకు సంబంధించిన వివాదం నడుస్తోంది. దాన్ని తాము ఒకే ఇంట్లో ఉండి అనుభవిస్తున్నామని వారు చెబుతున్నారు. ఇక ఈ ఇంటివారు రెండు రాష్ట్రాల సంక్షేమ పథకాలతో ప్రయోజనం పొందుతారు. మహారాష్ట్ర, తెలంగాణ రిజిస్ట్రేషన్ లతో బండ్లు కూడా ఉన్నాయి. రెండు రాష్ట్రాలకు పన్నులు కూడా చెల్లిస్తారు. మహారాజ్‌గూడ గ్రామంలో ఉన్న వారి 10 గదుల ఇంట్లో తెలంగాణలో నాలుగు గదులు, మహారాష్ట్రలో నాలుగు గదులు ఉన్నాయి. వంటగది తెలంగాణలో ఉండగా, బెడ్‌రూమ్, హాల్ మహారాష్ట్రలో ఉన్నాయి. ఈ ఇంట్లో పవార్ కుటుంబం ఏళ్ల తరబడి నివసిస్తోంది.
వింత ఘటన.. మధ్యప్రదేశ్‌లో 'నాలుగు' కాళ్లతో జన్మించిన చిన్నారి..
ఇంటి యజమాని ఉత్తమ్ పవార్ మాట్లాడుతూ, "మా ఇల్లు మహారాష్ట్ర, తెలంగాణల మధ్య విభజించబడింది. కానీ ఇప్పటివరకు మాకు దానితో ఎలాంటి సమస్య రాలేదు. మేము రెండు రాష్ట్రాల్లో ఆస్తి పన్ను చెల్లిస్తున్నాం. రెండు రాష్ట్రాల పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నాం" అని తెలిపారు. 1969లో సరిహద్దు వివాదం సద్దుమణిగినప్పుడు పవార్ కుటుంబానికి చెందిన భూమి రెండు రాష్ట్రాలుగా విభజించబడింది.
పర్యవసానంగా, ఇల్లు కూడా విడిపోయింది. చట్టబద్ధంగా ఈ గ్రామాలు మహారాష్ట్రలో భాగమైనప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం తన పథకాలతో ఈ గ్రామాల ప్రజలను నిరంతరం ఆకర్షిస్తోంది. బెళగావి ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని కోరడంతో మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దుల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దు వివాదంపై మహారాష్ట్ర, కర్ణాటక ముఖ్యమంత్రులతో బుధవారం నిర్వహించిన సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన.. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించే వరకు ఇరు రాష్ట్రాలు పరస్పరం ఎలాంటి దావాలు వేయబోమన్నారు.
'సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి వాదనలు చేయకూడదని ఒప్పందం కుదిరిందని, చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని, ప్రతి రాష్ట్రం నుంచి ముగ్గురు మంత్రులతో కమిటీ వేస్తామని' సమావేశం అనంతరం ఆయన చెప్పారు.