కెనడాలో జరిగిన జీ7 సమ్మిట్‌కు హాజరయ్యే క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ క్రోయోషియాతో పాటు సైప్రస్ దేశాలను పర్యటించారు. అయితే మోదీ సైప్రస్ పర్యటన వెనకాల చాలా పెద్ద ఎత్తుగడ ఉందన్న విషయం మీకు తెలుసా.?
ముగిసిన మోదీ విదేశీ పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ కెనడాలో జరిగిన జీ7 సమ్మిట్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సైప్రస్, క్రొయేషియా దేశాల్లో పర్యటించారు. క్రొయేషియాలో ప్రధాని మోదీ తొలిసారి పర్యటించారు. ఈ దేశంలో పర్యటించిన అతి కొద్ది మంది ప్రధానుల్లో మోదీ ఒకరిగా నిలిచారు.
క్రొయేషియా ప్రధాని ప్లెనోవిక్‌తో పలు విషయాలపై మోదీ చర్చించారు. రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-ఇరాన్ పరిణామాలతో పాటు ద్వైపాక్షిక సంబంధాలపై ప్లెనోవిక్‌తో మోదీ చర్చించారు. ఈ క్రమంలోనే పహల్గామ్ ఘటనపై ప్లెనోవిక్ విచారం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థిరత్వానికి ఉగ్రవాదం ముప్పు అని ప్లెనోవిక్ తేల్చి చెప్పారు. కాగా రెండు దేశాల మధ్య రక్షణ సహకారం కోసం ఒక ప్రణాళికను రూపొందిస్తున్నట్లు మోదీ తెలిపారు.

అందరి దృష్టి సైప్రస్ పర్యటనపైనే
ఇదిలా ఉంటే మోదీ సైప్రస్ పర్యటన ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కేవలం 10 లక్షల జనాభా ఉన్న ఈ చిన్న ద్వీప దేశం ఇప్పుడు భారత విదేశాంగ వ్యూహంలో కీలక పాత్ర పోషించనుందన్న చర్చ నడుస్తోంది. ఈ పర్యటన ద్వారా ప్రధాని మోదీ ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారని అబిప్రాయపడుతున్నారు.
టర్కీకి వ్యతిరేకంగా ఉండే సైప్రస్ దేశాన్ని ఎంచుకోవడం యాదృచ్ఛికం కాదు. ఇటీవల టర్కీ, పాకిస్థాన్‌కు మద్దతు ప్రకటిస్తూ భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించింది. ఇలాంటి సమయంలో సైప్రస్‌లో మోదీ పర్యటన, అది కూడా టర్కీ ఆక్రమించిన ప్రాంతాల్లో గ్రీన్ లైన్ సందర్శనతో ముగియడం టర్కీకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లైంది.

'ది గ్రాండ్ క్రాస్'తో సత్కారం
సైప్రస్ ప్రభుత్వం భారత ప్రధానికి తమ అత్యున్నత పౌర పురస్కారం ‘ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకరియోస్ III’ను ప్రదానం చేసింది. ఇది కేవలం గౌరవం కాదు, రెండు దేశాల మధ్య బంధం ఎంత దగ్గరగా ఉందో చెప్పేందుకు సాక్ష్యంగా నిలుస్తోంది.
ఇంతకీ సైప్రస్‌తో స్నేహం వల్ల భారత్‌కు కలిగే లాభాలు ఏంటి.?
1) భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందానికి వీలు
సైప్రస్ యూరోపియన్ యూనియన్ సభ్య దేశం. 2026లో ఈయూ అధ్యక్ష పదవిని చేపట్టబోతోంది. అంటే భవిష్యత్తులో భారతదేశానికి వ్యాపార ఒప్పందాలు, విదేశాంగ సంభాషణల విషయంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. భారత-ఈయూ వాణిజ్య ఒప్పందానికి ఇది వీలు కల్పించనుంది.
2) మధ్యదరా సముద్రంలో భారత్ ప్రభావం
మధ్యదరా సముద్రం ప్రాంతం వ్యాపార రవాణాకు, శాంతి భద్రతల పరంగా అత్యంత ప్రాధాన్యం కలిగింది. సైప్రస్‌లో భారత్ ప్రభావం పెరిగితే, భవిష్యత్తులో ఇంధన వనరులపై ఆధిక్యం, వ్యాపార మార్గాలపై నియంత్రణ వంటి అంశాలు సాధ్యమవుతాయి.
3) పన్ను రాయితీలు, పెట్టుబడులకు స్వర్గధామం
సైప్రస్‌లో పన్ను విధానాలు లాభదాయకంగా ఉంటాయి. డబుల్ టాక్సేషన్ నివారణ ఒప్పందం (DTAA) ఇప్పటికే అమల్లో ఉంది. దీంతో భారత కంపెనీలు సైప్రస్ ద్వారా యూరప్ మార్కెట్‌లోకి ప్రవేశించవచ్చు. అంతేగాక, సైప్రస్‌లోని ప్రముఖ బ్యాంక్ ‘యూరో బ్యాంక్’ ముంబైలో కార్యాలయం ప్రారంభించనుంది.
4) ఎనర్జీ రంగంలో భాగస్వామ్యం
తూర్పు మధ్యదరా ప్రాంతంలో సహజ వాయువు నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వనరులపై టర్కీ చూపు పడింది. దీంతో టర్కీ ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతూ వివాదాలు సృష్టిస్తోంది. భారత్, సైప్రస్ ఈ రంగంలో కలిసి పని చేయగలిగితే టర్కీకి చెక్ పెట్టొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.
పాక్‌కు మద్ధతిచ్చిన దేశాలకు మోదీ సైలెంట్ వార్నింగ్
కేవలం వ్యాపార లాభాలే కాకుండా మోదీ సైప్రస్ పర్యటనతో పాక్‌కు మద్దతిచ్చిన దేశాలకు వార్నింగ్ ఇచ్చినట్లైంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో టర్కీ, అజర్‌బైజాన్‌లు పాకిస్థాన్‌కు మద్దతు ప్రకటించాయి. ఇప్పుడు ప్రధాని మోదీ నేరుగా వాటి శత్రుదేశాలైన సైప్రస్‌లో పర్యటించడం ద్వారా ప్రతీకార వ్యూహాన్ని అమలు చేస్తున్నారని స్పష్టమవుతోంది.
మొత్తం మీద ప్రధాని మోదీ సైప్రస్ పర్యటనతో భారత విదేశాంగ విధానానికి ఓ కొత్త దిశ తీసుకొచ్చారు. ఇది కేవలం ఓ చిన్న ద్వీపదేశ పర్యటనగా కాకుండా, సముద్ర మార్గాలపై నియంత్రణ, యూరోపియన్ మార్కెట్లలో ప్రవేశం, శక్తి వనరుల దిశగా అడుగులు, అలాగే టర్కీకి గట్టి హెచ్చరికగా మారింది. ప్రపంచ పటంలో భారత్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటోందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.



