ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో అసలీ రెండు దేశాల మధ్య ఉన్న శతృత్వం ఏంటి.? ఎందుకీ రచ్చ జరుగుతోంది.?
ఆపరేషన్ రైజింగ్ లయన్
ఇజ్రాయెల్ ఇటీవల 'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో ఇరాన్‌పై భారీ స్థాయిలో దాడులకు దిగింది. ఇరాన్‌లోని అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ ఈ దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో ఇరాన్ పరామిలటరీ నాయకుడు మేజర్ జనరల్ హొస్సేన్ సలామీతో పాటు పలువురు కీలక వ్యక్తులు మృతిచెందినట్లు నివేదికలు చెబుతున్నాయి.
దాడుల తర్వాత టెహ్రాన్ అంతర్జాతీయ విమానాశ్రయం విమానాలను నిలిపివేసింది, ఆకాశ మార్గాన్ని మూసివేసినట్లు సమాచారం. దీంతో మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఒక చిన్న దేశం ఇరాన్‌పై ఈ స్థాయిలో దాడి చేయడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీంతో అసలు ఈ రెండు దేశాల మధ్య ఉన్న గొడవ ఏంటన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఒకప్పుడు స్నేహితులే
హిట్లర్ దమనకాండ తర్వాత యూదులు ప్రాణ భయంతో తమ ప్రాంతాన్ని వదిలి ప్రపంచంలో ఎక్కడెక్కడికో వెళ్లి తలదాచుకున్నారు. అయితే ఆ తర్వాత యూదులంతా కలిసి తాము పవిత్ర స్థలంగా భావించే ఇజ్రాయెల్‌కు తిరిగి చేరుకున్నారు. ఇలా కొంత మంది కలిసి ఇజ్రాయెల్ అనే దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
1948లో ప్రపంచ ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించింది. ఆ సమయంలో ఇజ్రాయెల్ మిడిల్ ఈస్ట్ లో పలు చురుకైన రాజకీయ సంఘర్షణలకు కేంద్రంగా మారింది. అమెరికా మద్దతుతో ఏర్పడిన ఈ దేశం, మొదట్లో ఇరాన్‌తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించింది. కానీ 1979లో ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం జరిగిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇరాన్ ఇజ్రాయెల్‌తో సంబంధాలు తెంచేసింది, దౌత్య కార్యాలయాన్ని కూడా మూసివేసింది. అప్పటి నుంచే ఇజ్రాయెల్‌ను శత్రువుగా చూడడం మొదలైంది.

ఇరాన్ అణు ప్రాజెక్ట్‌పై ఇజ్రాయెల్ గుర్రు
ఇరాన్ తన అణు ప్రాజెక్ట్‌ను శాంతి ప్రయోజనాల కోసం చేస్తున్నామని చెబుతుంటే, ఇజ్రాయెల్ మాత్రం దీన్ని తమ అస్తిత్వానికి ముప్పుగా భావిస్తోంది. ఇటీవల ప్రపంచ అణు శక్తి పరిశోధన సంస్థ నివేదికల ప్రకారం, ఇరాన్ వద్ద తొమ్మిది అణ్వాయుధాలకు సరిపడా యురేనియం నిల్వలు ఉన్నాయని తెలిసింది. దీంతో దీనిని ఇజ్రాయెల్ చాలా సీరిసయ్‌గా తీసుకుంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ మాట్లాడుతూ.. ఇరాన్ వెంటనే అణు పరిశోధనలు ఆపాలని వార్నింగ్ ఇస్తూ వచ్చింది. కాగా తాజాగా ఏకంగా దాడులు మొదలు పెట్టింది.

రెండు దశాబ్ధాలుగా కొనసాగుతోన్న షాడో వార్
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య గత రెండుదశాబ్దాలుగా జరుగుతున్న అప్రకటిత యుద్ధాన్ని "షాడో వార్" అని పిలుస్తారు. బహిరంగంగా ప్రకటించని ఈ ఘర్షణలు డ్రోన్ దాడులు, హ్యాకింగ్, సముద్ర నౌకలపై దాడుల రూపంలో జరిగాయి. 1992లో బ్యూనస్ ఎయిర్స్ లోని ఇజ్రాయెలీ ఎంబసీ పేలుడు, 2020లో శాస్త్రవేత్త మొహసెన్ ఫక్రిజాదెహ్ హత్య ఇలా ఎన్నో దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. హిజ్బుల్లా, హమాస్ లాంటి మిలిటెంట్ గ్రూపుల ద్వారా ఇరాన్ పరోక్షంగా దాడులు చేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.
విఫలమైన అమెరికా ప్రయత్నం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఫస్ట్ టర్మ్ పాలనలోనే ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించారు. అయితే ఇరాన్ ఒప్పుకోకపోవడంతో ఈ ప్రయత్నం విఫలమైంది. అణు ఒప్పందం జరిగిఉంటే ఇజ్రాయెల్ దాడులకు దిగేది కాదనే వాదన ఉంది. దీంతో ప్రస్తుతం అమెరికా పరోక్షంగా తన మద్ధతును ఇజ్రాయెల్‌కు అందిస్తోందని అంతా భావిస్తున్నారు.
![]()
ఇప్పటికే రంగంలోకి దిగిన అమెరికా
అయితే అమెరికా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. జీ-7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనాల్సిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హఠాత్తుగా కెనడా నుండి స్వదేశానికి తిరిగిపోయారు. సదస్సులో కీలక సమావేశాలను రద్దు చేసి, అమెరికా చేరిన వెంటనే జాతీయ భద్రతా బృందంతో 80 నిమిషాల పాటు అత్యవసర సమీక్ష నిర్వహించారు. టెహ్రాన్‌లోని అణు కేంద్రాలపై ఇజ్రాయెల్‌తో కలసి దాడులకు సిద్ధం కావాలని నిర్ణయించినట్లు ఓ సీనియర్ నిఘా అధికారి తెలిపారు.
ఇదే సమయంలో, ఇజ్రాయెల్ దాడులు మరింత ఉధృతం కావచ్చని హెచ్చరిక జారీ చేసిన ట్రంప్, ఇరాన్ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. యుద్ధం ఆగాలా లేదా కొనసాగాలా అనేది పూర్తిగా ఇరాన్ చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు. అణు ప్రోగ్రాంను నిలిపివేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. గతంలో ఇచ్చిన 60 రోజుల గడువులోనూ ఇరాన్ స్పందించకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.
ఖమేనీపై నిఘా
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ ఉన్నారో తమకు స్పష్టంగా తెలుసని, ఆయనపై దాడి చేసే ఉద్దేశం తమకు లేదని ట్రంప్ వెల్లడించారు. అయితే, పౌరులపై లేదా అమెరికా సైనికులపై దాడులకు సమాధానం తప్పదని గట్టిగా హెచ్చరించారు. ఇరాన్ అణు బాంబు తయారీ దశకు చేరుకున్నా, అది పూర్తి కావడానికి అవకాశం లేదని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.
కెనడా నుంచి అమెరికాకు బయలుదేరే ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్, గతంలో అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ చేసిన ప్రకటనను తప్పుబట్టారు. ఇరాన్ అణ్వాయుధాల అభివృద్ధిపై ఆమె చేసిన వ్యాఖ్యలకు తాను విలువ ఇవ్వనని స్పష్టం చేశారు. మొత్తం మీద, అమెరికా యుద్ధ సన్నాహాలు తీవ్ర దశలోకి ప్రవేశించినట్లు తాజా పరిణామాల ద్వారా స్పష్టమవుతోంది.

అమెరికా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగితే..
అమెరికా ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌కు మద్ధతు ఇస్తున్నట్లు ఎక్కడా ప్రకటించలేదు. అయితే ఇరాన్‌లో ఉన్న తమ దేశ సైనికులపై దాడులు జరిగితే మాత్రం ఊరుకునేది లేదని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఒకవేళ అమెరికా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగితే పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇరాన్‌కు చైనా, రష్యా, పాకిస్థాన్ లాంటి దేశాలు మద్ధతిచ్చే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం కూడా వస్తోంది. దీంతో ఇది ప్రపంచదేశాల మధ్య యుద్ధంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య శాంతి ఒప్పందం జరుగుతుందా.? ఇరాన్ అణు పరిశోధనలను ఆపేందుకు అంగీకరిస్తుందా.?
