ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం ఆహార భద్రతపై కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి అమ్మే ప్రతి గుడ్డుపై తప్పనిసరిగా ఎక్స్‌పైరీ డేట్ ముద్రించాలని ఆదేశించింది.  

Egg Expiry Date : ఉత్తరప్రదేశ్ యోగి ప్రభుత్వం ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఈ దెబ్బతో పల్లెటూరి నుంచి పట్నం దాకా… కిరాణా కొట్టు నుండి సూపర్ మార్కెట్స్ దాకా కలకలం మొదలైంది. ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆదేశాల ప్రకారం ఇకపై అమ్మే ప్రతి గుడ్డు మీద అది ఎప్పుడు పెట్టబడింది, ఎప్పటి వరకు వాడొచ్చు అనే వివరాలు కచ్చితంగా ఉండాలి. అంటే దాని ఎక్స్‌పైరీ డేట్ పేర్కొనడం తప్పనిసరి అన్నమాట.

ఏప్రిల్ 1 నుంచి గుడ్లపై ఎక్స్‌పైరీ డేట్ చెక్ చేయండి 

కోడిగుడ్లకు సంబంధించిన కొత్త రూల్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఉత్తరప్రదేశ్ పశుసంవర్ధక శాఖ, ఆహార భద్రత విభాగం సూచనల మేరకు ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. దీని ప్రకారం మార్చి నెల ముగిసిన తర్వాత రాష్ట్రంలోని ప్రతి దుకాణదారుడు గుడ్లపై తయారీ తేదీ (లేడ్ డేట్), ఎక్స్‌పైరీ డేట్ ముద్ర వేయడం తప్పనిసరి. దీంతో గుడ్డు ఎంత పాతదో కొనేవాళ్లే స్వయంగా చూసి తెలుసుకోవచ్చు. ఈ రూల్ పాటించని అమ్మకందారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అంతేకాదు వాళ్ల దగ్గరున్న గుడ్లన్నింటినీ అధికారులు స్వాధీనం చేసుకుంటారు. 

యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? 

ప్రజలకు స్వచ్ఛమైన ఆహారం అందించాలనే లక్ష్యంతోనే యూపీ ప్రభుత్వం ఈ అడుగు వేసినట్టు తెలుస్తోంది. చాలా చోట్ల పాత గుడ్లను అమ్ముతున్నారని, ఈ విషయం వినియోగదారులకు తెలియడం లేదని తమ విభాగానికి చాలాసార్లు ఫిర్యాదులు అందాయని చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ తెలిపారు. గుడ్లు నేరుగా ప్రజల ఆరోగ్యానికి సంబంధించినవి కాబట్టి ఈ కఠినమైన ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చిందని ఆయన వివరించారు.

అసలు గుడ్లు ఎన్ని రోజులు తాజాగా ఉంటాయి? 

ఆహార శాఖ అధికారుల ప్రకారం సాధారణ ఉష్ణోగ్రతలో (అంటే సుమారు 30 డిగ్రీల సెల్సియస్‌లో) గుడ్లు కేవలం రెండు వారాల వరకు మాత్రమే సురక్షితంగా ఉంటాయి. అదే వాటిని తక్కువ ఉష్ణోగ్రతలో (2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్‌లో) ఉంచితే ఐదు వారాలైనా పాడవకుండా ఉంటాయి. కానీ చాలామంది దుకాణదారులు గుడ్లను నిల్వ చేయడానికి ఎలాంటి కోల్డ్ స్టోరేజ్ వాడరని మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ కొత్త ఆదేశాలతో ఆ పరిస్థితి మారనుంది.