Asianet News TeluguAsianet News Telugu

తెలుగు కథ: జరీనా దీదీ -ఎర్ర చమ్కీ చీర

మృదువిరి రాసిన తెలుగు కథానిక జరీనా దీదీ -ఎర్ర చమ్కీ చీర అనే కథను ఏషియా నెట్ తెలుగు పాఠకుల కోసం అందిస్తున్నాం. తెలుగు సాహిత్యంలో కథానికది ప్రత్యేకమైన స్థానం.

Telugu Literature: Telugu short story by mruduviri
Author
Hyderabad, First Published Feb 22, 2020, 3:18 PM IST

చాచా సలామాలేకూం అంటూ  మా ఇంట్లోకి అడుగు పెట్టిందిజరీనా దీదీ  అత్తరువాసన ముక్కుపుటాలదరగొట్టాయ్ ...

ముందు గదిలోని నాన్న.. ఈద్కాముబారక్ హో బేటీ పండగ బాగచేస్కున్నరారా" అని ప్రత్యుత్తరం...

హా....మస్త్ ...అనుకుంటా...నవ్వుకుంటా...

"చిన్నమ్మ లోపటున్నవా" అనుకుంటనే గిన్నెడుసేమ్యా,గిన్నెడుమటన్బిర్యాని,కోడికూర,దాల్చా తెచ్చి అమ్మ ముందెట్టింది నవ్వుకుంట...

హా జరీనవ్వ నీ చమ్కీలచీరెమంచిగున్నది బిడ్డా... సుట్టాలందరచ్చిట్లేనా ..ఇల్లెడు పనీ ఒక్కదానివే చేత్తవ్ ...ఎవర్నైనాసాయంజెవ్వమనపోయినవవ్వా....అనుకుంట జరీనా అక్క పై కంటినిండా ప్రేమను వొంపుకుని...దీదీ తెచ్చినవాటిని ఇంట్లగిన్నెలల్ల పెట్టుకుని ఖాళీగిన్నెలు కడిగి తిరిగిచ్చింది అమ్మ.....

పండగలప్పుడు ఒకలింట్లయి ఇంకొకలింట్లకు పంచుకుని సంతోషాన్ని పంచుకునుడు...మన సాంప్రదాయం...అట్ల పంచుకున్నప్పుడే....మన సకినాలు,పాశంబువ్వ...వాళ్ళ ఖీర్ ,బిర్యానీలు...మరింత రుచి పెరిగేవి

కండ్లకు నల్లగ సుర్మా ,పెదాలకు ఎర్రగా లిప్ స్టిక్, రెండుఅరచేతుల నిండా ఎర్రగ మైదాకు,..చేతులకు దాదాపు రెండు డజన్లదాకాఎరుపు,బంగారం రంగు గాజులు...రంగురంగుల రాళ్ళ గోట్లు...ఆమె తెల్లని ఒంటిని చుట్టుకున్న...చమ్కీలతో డిజైన్ చేసిన ఎర్రని చీర ...జరీనాదీదీని ఈ రోజు కొత్తగా చూపిస్తున్నాయి

ఊహ తెలిసినప్పటి నుండి గత పదేళ్ళుగా జరీనాదీదీ ప్రతి పండగకదే చీర కట్టుకుంటది అదామె పెండ్లిచీర... అదంటె దీదీకి మస్తు ఇష్టం అంట....ఆ చీర కట్టుకున్నరోజు తానూహించుకున్న భావిజీవితం గురించి... అప్పటి దాకా తాను అనుభవించిన పుట్టీంటి ఆనందాలనూ...ఆ చీరలోనే చూసుకుంటది...మొదట ఆ చీర కట్టుకున్న  నెలరోజులు చాలా సంతోషంగా గడిపిందట...అందుకే...మళ్ళీ ఆ ఆనందాలు రావాలని ఆ చీర కట్టుకుంటా....అని  చెప్తూ...గలగల నవ్వుల వెల్లువైతది జరీనాదీదీ

నవ్వు చెరగనీదు,తియ్యగా మాటాడతది,ఇంటిగుట్టు బయట తెల్వనీదు ఐనా తెల్లని ఆమె ఒంటిపై బెల్టు  దెబ్బల గురుతులు దాచలేక ఓడిపోతుంది మాముందు

ఏడాదికొకరుగా నలుగురు పిల్లలను కన్నది..వాళ్ళ నాన్న పోలికలే ప్రతి ఒక్కడికీ...నిర్లక్ష్యం,పొగరుకుప్రతిరూపాలు,నామమాత్రంగానైనా ఆసరా లేరామెకు...అయినా అందర్నీ మంచిగ అరుసుకుంటది...అడిగినయన్నీ చేసిపెడతది...అత్తామామల్ని ఆడబిడ్డల్నీ ఆదరిస్తది...

ఎన్ని చేసినా....ప్రతీరోజు అర్థరాత్రి  వాళ్ళయన కొట్టే బెల్టుదెబ్బలకు తాళలేక...అరిచే అరుపులు ఏడుపు... వాళ్ళ ఇంటినే ఆనుకుని ఉన్న మాకు వినపడతనే ఉంటాయి...

ఒకసారి...అమ్మానాన్న చూసి తట్టుకోలేక అడగడానికి వెళ్తే...వీళ్ళను ఏమీ అనలేక...వీళ్ళ ముందే జరీనా దీదీని మరింత హింసించాడా దుర్మార్గుడు..ఇంక మళ్ళీ ఎప్పుడూ అమ్మానాన్న ఆ గడప తొక్కలేదు...

 ఏళ్ళు గడిచాయ్ .....

ఆ ఊరు నుండి నాన్నకు ట్రాన్స్ ఫర్ అవడం వల్ల వేరే ఊరు వచ్చేసినా ప్రతి రంజాన్ పండగకి జరీనా దీదీని యాది చేసుకునేటోళ్ళం.....

వచ్చేరోజు జరీనా దీదీ ఎంత ఏడ్సిందో..ఎందుకంటే మనసుగాయాలకు మందు పూసేటోళ్ళం మరి.తన తలరాత మార్చలేక పోయినా....బాధ చెప్పుకునేందుకు ఉన్న ఏకైక బంధాలం

నౌకరీ చేస్తానా అనే గర్రతో, ఆమెను నానా తిప్పలు పెడుతుండే భర్త,బయటకు సూడ అమాయకుని లెక్క కండ్లబడుతుండేది...ఏదో  ఒక సాకుతో ఆమెను చితకబాదుతుండేది..

అంత జరిగినా...మనిషి మంచోడే గాని...అట్ల జేత్తడు...అని ఆమె అతనిని వెనకేసుకొచ్చేది...బయట ఎన్నో చికాకులుంటయ్ ...ఆడోళ్ళం మనమే సర్ధుకపోవాలే అనేటిది...

ఎన్నో రకాలుగా సర్ధిచెప్పాలని చూసినా...తాను ఎదురుతిరుగకపోయేది...అణిగిమణిగుండే సరికి అతని అహం మరింత రగిలేది...

ఆ ఊరు నిండి ఈ రోజుకొచ్చినంక...మళ్ళ ఒక్కసారిగూడ అటు పోలే...

మా పెండ్లిళ్ళకు కూడా దీదీని పిల్వలేక పోయినం... అదో వెలితే మాకు....ఆమె అప్పట్ల ఉత్తరాలు రాసేటిది....ఇపుడు అవి కూడా లేవు...

 అప్పట్ల....పేపర్లల్ల అపుడపుడు ఏవైనా సంఘటనలు జరిగినై చదవంగనే మాత్రం అక్క మస్తు యాదికొచ్చేటిది...

ఇన్నిరోజులకు....పనిమీద వరంగల్లుకు రాంగనే....ఎందుకో  తెల్వదు గాని మనసంతా జరీదీదీనే నిండిపోయింది...గుండె సలుపబట్టీంది...

 మండిబజార్ నుండి బస్సుల గూసుని వస్తాంటే ఆడ దుకాన్ల యాలాడేసిన "ఎర్ర చమ్కీ చీర "చూసినప్పటినుండి గతంమీద జ్ఞాపకాల తోరణాలు గడతాంది మనసు...

తన భాధలన్నీ గుండెగూట్లో  చీకటి ఎనకాతల దాసి ముందుకు మాత్రం ఎలుగులు పంపే దీపమోలె ,నిండుకుండలా తొనకకుండా ఉండేదామె,..

ఇంట్లో వారి బాధల సైతం భరిస్తూ పైకి చూడ ఆమెకేం రంది..కొడుకులేనాయె.భర్తకు గవర్నమెంటు నౌకరేగా చూడటానికి మస్తుంటది అనే వ్యాఖ్యలే ఇరుగుపొరుగు..

కొన్ని జీవితాలను అరచేతి వైకుంఠంలా చూపిస్తాడు విధాత. ఎందుకలా రాస్తాడో దీనుల తలరాత.... ఆడుకోవాలనుకుంటాడో ఏమో తనకదో వేడుక...

ఇయ్యాల మళ్ళా రంజాన్ ..నాలో..సుడులు తిరుగుతున్నది ఙ్ఞాపకాల అమేజాన్.ఏం చేస్తాం మనమొక ఇన్సాన్  పరువు పరదాల చాటున మంచి మనుసుల ఖబరస్తాన్ ....

ఎందుకో మనసులాగుతోంది ఎలాగూ జరీనాదీదీని సూడలేను.కనీసం ఆ దుకాన్ల ఎర్ర చమ్కీచీరనన్నా సూద్ధామని బస్సెక్కిన....చూసిన...కానీ...ఆ చమ్కీలు నన్ను ప్రశ్నించబట్టినయ్ 

నవ్వుతున్న కళ్ళ వెనుక ఉండే కన్నీటి సుడులను చూడు...వర్షించే....కన్నీటి కళ్ళను మాత్రం తుడవడం మరిచిపోకు.....బంధాలను... నిర్లక్ష్యం చేయకు ...నీవు శవానివి కాదు కుళ్ళు కంపుకొట్టడానికి,ప్రాణమున్నవాడిలా ప్రయోజనం చేకూర్చు....అంటూ....మనసురొద మొదలుపెట్టింది....

ఇపుడు నేను జరీదీదీ కోసం...బస్సు దిగి...అప్పటి పాత ఇంటి దారి పట్టాను......నా చేతిలో...మండిబజార్లో కొన్న ఎర్రచమ్కీ చీర పొట్లం...వెలుగుకోసం ఎదురుచూస్తోంది...

- మృదువిరి

Follow Us:
Download App:
  • android
  • ios