దాసరి మోహన్ దండెంపై సమీక్ష: ఆరేసిన విలువలు

దాసరి మోహన్ ది దైనందిన జీవనపస్థానంలో తన చుట్టూ జరుగుతున్న సంఘటనల , మానసిక సంఘర్షణల కుస్పందనగా కవిత్వం ఉంటుంది. దాసరి మోహన్ దండెం కవిత్వంపై ముదిగొండ సంతోష్ రాసిన రివ్యూ

Telugu Literature: Mudigonda Santhosh reviews Dasari Mohan Dandem Poetry

జీవితానికి కవిత్వానికి తేడా లేదు. రెండు అర్థమైనట్టుగానే ఉంటాయి కానీ ఒపట్టాన చిక్కవు. చిక్కిందంటే పరుగు ఆగదు. జీవితపు పార్వం లోంచి కవిత్వాన్ని దర్శిస్తున్న ఆధునిక కవి మోహన్. భావజాలంలోనూపదజలంలోనూ కొత్తదనంతో కవిత్వాన్ని ఆరాధిస్తున్నాడు. సమాజం ఇలా ఉండకూడదే అన్న పరివేధన ఉంది. మనం రోజు మాట్లాడుకుంటున్న మాటల్లాగానే ఉంటుంది మోహన్ కవిత్వం. కప్పి చెప్పడాలు, మార్మికంగా, అన్యాపదేశంగా చెప్పడం, నిగూఢమైన కఠినమైన భాషను ఉపయోగించడం కనపడదు. తిక్కన చెప్పినట్టుగా అలతి అలతి పదాలతో అనల్పార్థరచనలా సాగుతుంది. కవిత దీర్ఘంగా ఉండదు. చిరుకవితలే కానీ చిచ్చరపిడుగులా భావాన్ని గుప్పిస్తాయి. పాఠకుణ్ణి కట్టిపడేసే ఆర్థత, చకితున్ని చేసే చతురత ఉంటుంది. ప్రధానంగా మోహన్ ది దైనందిన జీవనపస్థానంలో తన చుట్టూ జరుగుతున్న సంఘటనల , మానసిక సంఘర్షణల కు స్పందనగా కవిత్వం ఉంటుంది.

మనిషిగా తాను కదులుతున్న సందర్భాలలో తనను కలిచివేసిన సంఘటనలు, ఎదురైన అనుభవాలు మనసును కుది పేసాయి. మెలి పెట్టి నలిపేశాయి. మానవత్వపు పొరాల్లో అగ్గి రాజేసుకుంది. కవితాక్షరాలుగా పెల్లుబికి వచ్చింది. పసిపిల్లవాడు ఎగిరే పిట్టల్ని, ప్రవహించే నదుల్ని, కురిసే వానను చూసి కేరింతలు కొట్టి సంబురపడడం ఎంత సహజమో హృదయంలో కాసింత తడి ఉన్నవారు తమచుట్టూ జరిగే అమానవీయ ఘటనలు, అసాంఘిక చర్యలు, అన్యాయాలు,అక్రమాలకు స్పందించి కవిత్వంగా ప్రవహించడం అంతే సహజం. సామాన్య జీవితాంశాల్ని, చిన్న చిన్న సంఘటనల్ని కవిత్వీకరించి పాఠకుల్ని స్పందింపజేస్తారు మోహన్. సాంద్రమైన అనుభూతి, అనుభవ విస్తీర్ణత, సరికొత్త అభివ్యక్తి మోహన్కవితా లక్షణాలు. తన హృదయదండెంమీద ఆరబోసుకున్న ఎన్నో ఆవేదనలను, సంఘర్షణలను, సంవేదనలను , సామాజక రుగ్మతలను, మానసిక వికారాలను, అసమ
తల్యతలను భిన్న కోణాలలో ఎత్తిచూపుతూ అంతర్మథనం చెందుతున్నాడు.

నిండిననడు పుష్కరాలు చేశారు
ఎండిననాడు అనాధగా వదిలేశారు'

నదికి, మనిషికి విడదీయరాని బంధం. మన మానవ నాగరికత పురుడు పోసుకున్నది నది ఒడిలోనే. మనిషి నరంతరం నదిలా ప్రవహిస్తూనే ఉంటాడు. ఏకకణంగా మొదలై సమిష్టిగా తలెత్తుకున్నాడు మనిషి. నదిగా మారిన మనషులెందరో. నది ప్రవహిస్తున్నంత సేపూ బాగానే ఉంటుంది. పంటలు పండించుకుంటారు. కడుపులు నింపుకుంటారు. పూజలు చేస్తారు. జాతర్లు చేస్తారు. అది ఎండిననాడు అనాథగా వదిలేస్తారు. మనిషినీ అంతే. పచ్చగా ఉన్నన్నాళ్ళు అందరూ చేరతారు. ఆకులు రాలిపోతే పిట్టకూడా వాలదు.

తీరం తిరస్కరించిందని
అల ఆగలేదు కదా
ఓటమి ఎదురైనప్పుడు
ఓర్పుతో మరింత నేర్పుతో
గమ్యంకోసం గట్టిగా పోరాడాల్సిందే '

జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సముద్రంలో ఆటుపోట్లలా గెలుపోటములు, ఎత్తుపల్లాలు ఎన్నో ఉంటాయి. అంతమాత్రాన వెనుదిరగొద్దు. వెనకంజ వేయవద్దు. ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలి. కృషితో నాస్తి దుర్భిక్షం అంటాడు కవి.

దండెం దండం పెడుతుంది.
ఇక మోయలేనని మోక్షం కలిగించమని'

మనస్సు నిరంతరం ఊగిసలాడే దండెం. నిలకడగా ఉండదు. మనిషిని నిలకడగా ఉండనివ్వదు. ఎన్నిటినో మోస్తుంది. కాంక్షిస్తుంది. ఆశలు రేకెత్తిసపింది. పరుగెత్తిస్తుంది.
పిచ్చివాన్ని చేసి ఆడిస్తుంది. ఎక్కువ బట్టలు ఆరవేసిన దండెం పుటుక్కున తెగినట్లు మోసీ మోసీ అలిసిపోయిన మనసు దండెం ఒక్కో పోగువు తెంచుకుంటుంది. మనిషి బాధల్ని, బంధాల్ని, అనుబంధాల్ని, బరువుల్ని వెరాసి అలిసిపోతాడు. చివరకు అన్నీ తెంచుకుని రాలిపోతాడు.

కర్మకాండలు కొడుకులు
అమెరికాలోనుండి
ఆన్లైన్లో చూస్తారని
పంపకాలు మాత్రమే
ఆన్లైన్లో షెడ్యూల్ చేసుకుంటారని
ప్రాణాలు పోయాకే తెలిసింది.

ఇపుడంతా ఆన్లైన్ ప్రపంచం. ఆన్లైన్లోనే ప్రపంచం. జననంనుండి మరణం వరకు ఏది జరిగినా ఆన్ లైన్లో వీక్షించడం అలవాటయింది. అమ్మకాలు, కొనుగోళ్ళు ఆన్ లైన్ లోనే. ఆస్తిపంపకాలు మాత్రం ఆఫ్లైన్లో అంటూ డబ్బు మనుషుల్ని, బంధాల్ని ఎలా కబళిస్తుందో అని ఆవేదన వ్యక్తం చేస్తారు.మరో కవితలో “ఆస్తులు కూడబెట్టకుంటే /ఆలికి కూడా చులకనే/ పంచుకునేందుకు ఏమీ లేకుంటే/పిల్లలు ఇస్తారా గౌరవం అంటాడు. డబ్బులేకపోతే సొ0త మనుషులు కూడా చిన్నచూపు చూస్తారు. డబ్బే మనిషిని తూస్తున్నలోకం పోకడను ఎండగడతాడు.

కునుకు పడితే
అదృష్టమే మరి
నిద్ర పట్టేంత
మంచి పనేం చేసాం అని 'పరోపకారం ఇదం శరీరం' అన్నారు కానీ నేడు పరులకే కాదు కనీసం సొంతవారినికూడా పలకరించి, ఆదరించే మనస్తత్వం కరువైంది. మంచి చేయక
పోగా అసూయాద్వేషాలు., పగలు, ప్రతీకారాలతో తనకుతానే నశించిపోతున్నాడు అలాంటివాడికి నిద్ర పట్టడం అదృష్టమే అంటారు.

నిర్భయంగా బతుకు
నిలిచి గెలువు
నింగిని తాకు
సమాజానికి ఒక
సరికొత్త పాఠం నేర్పాలి

నేలరాలిన పువ్వులను ఏరి పూజకు వినియోగిస్తారు. తన ప్రమేయం, లేకుండా గాయపడ్డవారి గుండెల్లో గునపాలు దించుతుంది సమాజం. మృగాడై మని
షి తెగబడి పైశాచికత్వం చేస్తే అండగా నిలవాల్సిన సమాజం గాయపడ్డవారినే దోషిని చేసింది.ప్రతీ ఇంటిలో

సంబంధాలన్నీ
సవరించాలి
మానవత్వమును
మళ్ళీ నేర్పించాలి
ఎక్కడ మొదలెడదాం

సాంస్కృతిక పునర్నిర్మాణం, ఆర్థిక పునర్నిర్మాణం కాదు. మానవ పునర్నిర్మాణం కావాలంటాడు. ఎక్కడో అక్కడ మొదలు పెట్టి మానవత్వపు తీగలు సవ
రించాలంటాడు. మనిషి మనిషిని ఆదరించే గుణాన్ని పెంపొందించాలంటాడు.

'అన్ని బంధాలు పొమ్మనేవే
మట్టి మాత్రమే పిలుస్తుంది
శాశ్వతంగా తనలో దాచుకుంటుంది ”

ఎన్ని వ్యామోహాలు పెంచుకున్నా ఎన్ని బంధాలు కలుపుకున్నా ఎంత కష్ట పడి కూడబెట్టినా చివరకు ఏదీ మిగలదు అనే తాత్వికతను తెలియజేస్తాయి.

'అదే అర్ధరాత్రి
నేను వెళితే
అగ్ని పరీక్షనో
అంతిమ యాత్రనో'
యుగయుగాలుగా మారని చరిత్ర పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీ బలౌతున్నతీరును ప్రశ్నిస్తాడు. ఆడది అవసరముండి అర్ధరాత్రి గడప దాటినా పతితగా ము!
ద పడాల్సిందే. కానీ మగాడు ఎన్ని ఆగడాలు చేసినా చెల్లుతున్నది.

అగ్రభాగం చేరినప్పుడు
అసూయ విషం కక్కుతావు
స్వేచ్ఛను జయించినప్పుడల్లా
ఫత్వా జారీ చేస్తావు' అంటూ స్త్రీ స్వేచ్ఛను హరించివేస్తున్న పురుషుల్ని నిందిస్తాడు. ఆధునిక సమాజం స్త్రీపురుష సమానత్వాన్ని చెబుతున్నా ఇంకా పురుషుడు తన ఆధిపత్యాన్ని విడలేదు.
.
తల్లి ముందు మనమంతా
ఇంకా మనుషులుగా మారలేదని చెప్పు' తల్లిదండ్రులు పిల్లలకు చందమామ కథలు బాలగేయాలు కాకుండా మనుషుల్లో దాగున్న తోడేళ్ళ గురించి, మనిషి ముఖాలు తొడుక్కున్న మృగాళ్ళగురిమచి ముందుగా చెప్పాలంటాడు.

'అమ్మాయి జాగ్రత్త
అన్నప్పుడే ఆమెను
అబలను చేసాం మనం' అంటూ అమ్మాయిని పెంచడంలో మనదే తప్పాంటాడు. మగపిల్లాడితో సమంగా పెంచకపోవడం ఆమెను బలహీనంగా తయారుచేయడం మనం చేసిన తప్పే. ఇప్పుడిప్పుడే తన సొంతకాళ్ళమీద నిలబడి ధైర్యాన్ని పుంజుకుంటోంది. ఇకనైనా చప్పట్లు కొట్టి ప్రోత్సహించాలి అంటాడు.

“ఎప్పుడో
మొదలు పెట్టాను నమ్మడం
హస్తం నుండి
కమలం దాకా
జెండాలు ఎగురుతూనే ఉన్నాయి
నేనింకా
బిపిఎల్ కిందే ఉన్నానెందుకో”

రాజరికాలు మారినా రాజులు మారినా సామాన్యుడి బతుకు మారలేదు.నాయకులను నమ్మీ నమ్మీ జేజేలు కొడుతూ జెండాలు మోస్తున్నా ఇప్పటికీ వాళ్ళ
జీవితాల్లో మార్పు రాలేదని ఆవేధన వ్యక్తం చేస్తారు.

“మనుషులతో మనకు
ముప్పే ఏనాటికైనా
మనుషులు వస్తున్నారు
చంపేయ్ చంపేయ్"ఆదివాసిల జీవితాన్ని , అడవి బిడ్డల అస్తిత్వాన్ని కాలరాస్తూ, వారి సంపదల్ని వారిని దోచుకుంటున్న నాగరిక మనుషుల ప్రవర్తనను దిక్కరించి ప్రకృతి సంపదను కాపాడుకోవాలంటే ఈ మనుషుల్ని చం పేయ్ అని పిలుపునిస్తాడు. అన్ని కవితలు మనిషి చుట్టు అల్లుకున్నవే. తాళి కట్టించుకున్న నేరానికి “బతుకిపుడు/ కిచెన్ కి బెడ్ రూమ్ కి/ షటిల్ సర్వీస్ అయింది అని స్త్రీ జీవితంలోని దైన్యాన్ని చ నాపిస్తారు. “రాయి రప్ప ప్రశాంతంగానే/ మనిషి మాత్రం గుబులు గుబులుగా” ఎంతకూ తీరని తృప్తి ఇంకా కావాలనే ఆరాటం సాటి మనుషులను చూసి అసూయా ఎప్పుడూ ఏదో భయం తో మనిషి. “ పక్కవాళ్ళ బాధలతో పనేంటి మనకు/ దేశం సమాజం/కైకూ పరేశాని అంటూ స్వార్థం తో నిండిపోయిన మనిషిని వ్యంగ్యగా మందలిస్తాడు.

సమకాలీన సంక్లిష్ట ప్రపంచంలోని పలు పార్శ్వాలను ప్రతికూల కోణాలను,భిన్న ప్రవృత్తులను పరిశీలించి తన అనుభవాన్ని, లోకం తీరునీ ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ కవిత్వాన్ని అల్లిన కవి మోహన్. మొహన్ కవితా వస్తువు మొత్తం మనిషి. మనిషి కోసం ఆరాటం , తపన ఆయనది. మంచు ముక్కలా కరిగే తత్వం ఈ కవిది. పత్రికల్లో వార్తలు అందరూ కళ్ళతో చదువుతారు. కానీ కొందరు  కన్నీళ్ళ తో చదువుతారు. ఆధునిక జీవితంలోని అసమానతలను రోజు రోజుకు దిగజారుతున్న కుటుంబ విలువలు క్షీణించిన సమాజపు నైతికత ఎక్కడ చూసినా వ్యథలు గాథలు మామూలు మనుషులకు ఇవన్నీ వార్తలే కానీ కవికి అంతరం గాన్ని కుదిపేసే అలజడులు నిలకడగా ఉండనివ్వవు. ఆ కోవకు చెందిన వాడే
మోహన్. గుండె చెరువై కవిత్వాన్ని ప్రవహింపజేస్తుంన్నాడు.

ఃముదిగొండ సంతోష్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios