ఇన్నాళ్ళుగా
నడిచీ నడిచీ
ఇప్పుడు దారితప్పుతరు
పిల్లల్లాగే అమ్మలు
అర్థం లేకుండా మాట్లాడుతరు
అదే తొవ్వలో
ప్రయాణం చేస్తూ
చేరాల్సిన గమ్యం
యాదిమరుస్తరు
పిల్లలు
నచ్చిన పదం
వల్లించినట్లే
అమ్మలు పదేపదే
చెప్పిందే చెబుతుంటరు
కనిపించని కాలం
లొంగదీసుకున్నట్లు
నిన్న కనిపించిన దృశ్యం
క్రమంగా మసకబారుతుంటది
పిల్లల్లాగే అమ్మలు
అల్లరి చేస్తుంటరు
ఎన్నో నడిపించిన లోకంలో
ఏదీ నడిపించలేని సంగతి
వాళ్ళకసలే అర్థంకాదు

ప్లిల్లాగే అమ్మలు
ఇల్లంతా తామే
ఐపోతరు
అప్పటి నుండీ
తనచుట్టే తిరిగిన ఇల్లు
ఇప్పుడు మాత్రం
తిరగదా అని
వాళ్ళ గోల
పిల్లల్లాగే అమ్మలు
పిచ్చిపిచ్చి చేస్తుంటరు
ఎక్కడో మొదలుపెట్టి
ఎక్కడనో తేలే
తెల్లారగట్ల బాలసంతు కథలా
పిల్లల్లాగే అమ్మలు
మనకసలే పట్టని ముచ్చట్లు
వల్లెవేస్తుంటరు.
పుట్టక ముందటి
లోకం నుండి తెచ్చిన
సందేశం పిల్లల్ని
అలా తీరుస్తుంది
తర్వాత వెళ్ళాల్సిన
లోకాల మీది మోజు
అమ్మల్నలా మారుస్తుంది

పిల్లలు
ఎంతగోల చేసినా
ముద్దే
మారాం ఎక్కువైతే
చంకనేసుకొని
గుండె కద్దుకుంటాం
పిల్లల్లాగే
అమ్మలు కూడా
ఆరాటం చేస్తే
మనం అమ్మలకు
అమ్మలం కావలసిన
పరిణతికి రావలసిందే

-ఏనుగు నరసింహారెడ్డి