కేసీఆర్ వర్సెస్ జగన్: ఏపి, తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెడుతుందా?
కేసీఆర్, జగన్ ల మధ్య సాన్నిహిత్య సంబంధాలున్నాయనేది ఇరు రాష్ట్రాల్లో ఎవర్ని అడిగినా చెప్పే విషయమే! అయితే... ఈ పోతిరెడ్డిపాడు విషయంలో మాత్రం ఇరు రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు మాట్లాడుకోవడం లేదు.
నిన్న ఉదయం నిద్రలేచింది మొదలు.... తెలుగు న్యూస్ ఛానెళ్లలో కరోనా వైరస్ వార్తకన్నా పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించే విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాజుకున్న వివాదం ప్రధానాంశమయింది.
ఒకపక్క ఆంధ్రప్రదేశ్ ఏమో... మేము మా కేటాయింపులకు లోబడే నీటిని తరలించేందుకు చర్యలు చేబడుతున్నామని అంటున్నారు, తెలంగాణ రాష్ట్రం కూడా మీ కేటాయింపులకు లోబడి తీసుకుపోతే మాకెటువంటి అభ్యంతరం లేదు అని అంటుంది.
అంటే... ఇక్కడ మనకు తేలే విషయం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ తమ కేటాయింపులకన్నా ఎక్కువగా తీసుకుపోయేందుకే ఆ సదరు జీవోను విడుదల చేసిందని తెలంగాణ ప్రభుత్వం భావించి అభ్యంతరం చెబుతుంది.
ఇక్కడిదాకా బాగానే ఉంది. పొరుగు రాష్ట్రాలన్నప్పుడు నీటి వివాదాలు అనేవి సర్వసాధారణమైన అంశాలు. తమిళనాడు, కర్ణాటకల మధ్య ఒక రెండు సంవత్సరాల కింద కావేరి నదీజలాల విషయంలో తలెత్తిన వివాదం ఎలాంటి హింసాత్మక సంఘటనలకు దారితీసిందో కూడా మనందరికీ తెలిసిన విషయమే!
ఒక్క సారి 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సీన్ ని గనుక మనం రివైండ్ చేసి చూసుకుంటే.... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సకుటుంబ సపరివార సమేతంగా కేసీఆర్ ని వచ్చి కలిశారు.
ఎవరికైనా గుర్తుండి ఉంటే.... ఏపీ రాజకీయాల్లో ఎవరు అవునన్నా కాదన్నా నెంబర్ 2 గా చెలామణి అవుతున్న విజయ సాయి రెడ్డి కేసీఆర్ కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడానికి కూడా ప్రయత్నించారు (దాన్ని కేసీఆర్ ఆపి ఆలింగనం చేసుకున్నారు అది వేరే విషయం). జగన్, కేసీఆర్, కేటీఆర్ ల మధ్య ఆత్మీయ ఆలింగనాల పరంపరను మనం చూసాము.
ఇక ఆ తరువాత జగన్ ఏపీ అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ను ఒక రేంజ్ లో పొగిడారు. కేసీఆర్ మహోన్నత నాయకుడు అని అనడం దగ్గరినుండి మొదలు కేసీఆర్ గొప్పతనం గురించి వాడిన పదం వాడకుండా కీర్తించారు.
తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కూడా జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు (వైసీపీ నేతలు కొందరు కాళేశ్వరం కాంట్రాక్టర్లు అని ప్రతిపక్షం ఆరోపణలు కూడా అప్పుడు చేసింది). ఇరువురి మధ్య పలుదఫాలుగా రకరకాల అంశాలకు సంబంధించి చర్చలు కూడా జరిగాయి.
వీటన్నిటిని బట్టి చూస్తుంటే... కేసీఆర్, జగన్ ల మధ్య సాన్నిహిత్య సంబంధాలున్నాయనేది ఇరు రాష్ట్రాల్లో ఎవర్ని అడిగినా చెప్పే విషయమే! అయితే... ఈ పోతిరెడ్డిపాడు విషయంలో మాత్రం ఇరు రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు మాట్లాడుకోవడం లేదు.
జగన్ చర్యలను కేసీఆర్ ఖండిస్తున్నారు, కేసీఆర్ వైఖరిని జగన్ తప్పుబడుతున్నారు అన్న వార్తలు వస్తున్నాయి తప్ప వారిరువురు మాట్లాడుకున్నారు అన్న వార్త మాత్రం ఎక్కడా కనబడడం లేదు.
అసలే నీటి విషయం. అందునా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయువుపట్టు వంటి పోతిరెడ్డిపాడు అంశం. దీనిపైన గనుక ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకోకపోతే.... ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతినే ఆస్కారముంది.
ఇలా సంబంధాలు దెబ్బతింటే.... ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వచ్చే నష్టం పెద్దగా లేదు, కానీ తీవ్రంగా ఇబ్బందులు పడేది ఇరు రాష్ట్రాల ప్రజలు. కావేరి నది జలాల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య మొదలైన గొడవ చిలికి చిలికి గాలి వానలా మారి విధ్వంసానికి దారి తీసింది.
సరిహద్దుల్లోని ప్రజలు ఒకరిపై ఒకరు దాసుడులకు పాల్పడ్డారు. అప్పుడు చెలరేగిన హింసపై ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు కూడా. ఇప్పుడు ఇది కూడా నీటితో ముడిపడి ఉన్న అంశం. దీనిపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెంటనే చర్చలకు పూనుకోవాలి.
చర్చలద్వారా మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది తప్ప, న్యాయస్థానాల్లో మాత్రం కాదు. అక్కడ కేసు ఒక పట్టాన తేలదు. తేలకుండా అది వాయిదాల మీద పడుతుంటే.... రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటాయి.
ఇప్పటికే రాజకీయ పార్టీలు రంగప్రవేశం కూడా చేసాయి. తెలంగాణ బీజేపీ ఏమో జగన్ అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు అంటుంటే..... ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఏమో, జగన్ తీసుకున్న నిర్ణయం కరెక్టే అంటుంది.
ఇరు రాష్ట్రాలు ఈ సమస్య పరిష్కారం కోసం అపెక్స్ కమిటీని నియమించుకున్నారు. ఇప్పుడు ఆ కమిటీ దెగ్గరకు పోయో, లేదా వారే కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయానియాకి వస్తే... ఈ విషయం పెద్దది కాదు. లేకపోతే... ఈ సమస్య ప్రజా సెంటిమెంట్లతో ముడిపడి ఉన్నందున చాలా పెద్దదయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒకసారి ఇలా ఇరు రాష్ట్రాల మధ్య ఒక మినీ సైజు పానిపట్టు యుద్ధం జరిగింది కూడా. నాగార్జున సాగర్ డాం పైన ఇరు రాష్ట్రాల అధికారులు, పోలీసులు ప్రజలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సంఘటన మనందరి కళ్ళ ముందు ఇంకా మెదలాడుతూనే ఉంటుంది!