వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు: జగన్ నిర్ణయం వెనక కారణం ఇదీ....
మీటర్లను అమర్చినప్పటికీ.... బిల్లు ఎంత వచ్చినా దాన్నంతటిని ప్రభుత్వమే రైతుల ఖాతాల్లో జమచేస్తామని చెప్పింది ప్రభుత్వం. దీని వల్ల రైతులపై ఎటువంటి అదనపు భారం కూడా పడదు.
రాజకీయంగా ఎల్లప్పుడూ ఏదో ఒక అంశం పై విస్తృతంగా చర్చ నడిచే మన ఆంధ్రప్రదేశ్ లో తాజాగా పంప్ సెట్లకు మీటర్లను అమర్చాలన్న ప్రభుత్వ నిర్ణయం చర్చనీయాంశమయింది. పంపు సెట్లకు మీటర్లను బిగించడాన్ని రైతు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
మీటర్లను అమర్చినప్పటికీ.... బిల్లు ఎంత వచ్చినా దాన్నంతటిని ప్రభుత్వమే రైతుల ఖాతాల్లో జమచేస్తామని చెప్పింది ప్రభుత్వం. దీని వల్ల రైతులపై ఎటువంటి అదనపు భారం కూడా పడదు. అయినప్పటికీ రైతు సంఘాలు, ప్రతిపక్షాలు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి అనేది ఇక్కడ ఉత్పన్నమవుతున్న ప్రశ్న.
దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే గ్యాస్ సీలిండర్ల ఉదాహరణను పరిశీలించాలి. తొలుత గ్యాస్ సిలిండర్ సబ్సిడీని ప్రభుత్వమే నేరుగా గ్యాస్ కంపెనీలకు చెల్లించి మనకు 500 నుంచి 600 రూపాయల ధరకు సిలిండర్ లభ్యమయ్యేలా చేసేది. కానీ ఎప్పుడైతే ఇందులో (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, డీబీటి) నగదు బదిలీ ని ప్రభుత్వం తీసుకొచ్చిందో... వినియోగదారులపై భారం పెరిగింది.
ప్రభుత్వం తొలుత సిలిండర్ మొత్తం డబ్బును వినియోగదారుడిని చెల్లించమని చెప్పి, ఆ తరువాత సబ్సిడీని వారి ఖాతాల్లో జమచేసేది. తొలినాళ్ళలో బాగానే ఉన్నప్పటికీ... ప్రస్తుతానికి సీలిండర్ల ధరలు భారమయ్యాయని వినియోగదారులు వాపోతున్నారు. అంతే కాకుండా గతంలో సీలిండర్ల పై ఎటువంటియూ క్యాప్ ఉండేది కాదు. ఎన్ని కావాలంటే అన్ని సీలిండర్లను వాడుకునే వీలుండేది.
కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. సంవత్సరానికి 12 సీలిండర్లను మాత్రమే సబ్సిడీ రేటుకు తీసుకునే వీలుంటుంది. ఇవి సరిపోతాయా సరిపోవా అనే అంశాన్ని పక్కనపెడితే... నగదు బదిలీ మొదలయ్యాక గ్యాస్ సీలిండర్లు భారమయ్యాయి అనేది వాస్తవం.
ఇప్పుడు ఇదే అంశాన్ని మనం వ్యవసాయ విద్యుత్ రంగానికి అన్వయించి చూసుకుంటే... ప్రభుత్వం ఉచిత విద్యుత్ విషయంలో ఇలా ఏమైనా ఆలోచనలు చేస్తుందా అనే అనుమానాలతోనే రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం ఉచిత విద్యుత్ సబ్సిడీని తగ్గించొచ్చు, లేదా కొన్ని యూనిట్ల వరకు మాత్రమే సబ్సిడీ ఇస్తామని సీలిండర్ల మాదిరి క్యాప్ పెట్టవచ్చు. ఇలా నగదు బదిలీ మొదలైతే ప్రభుత్వం వీటిని మార్చే అవకాశం ఉందనేది దీన్ని వ్యతిరేకిస్తున్న వారి వాదన.
దీన్ని వ్యతిరేకించడానికి, ఇలా భయాలు వ్యక్తం చేయడానికి మరో బలమైన కారణం కూడా లేకపోలేదు. అది అర్థం కావాలంటే... లాక్ డౌన్ నడుస్తున్న కాలంలో కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ లో కేంద్రం పై విరుచుకుపడ్డ అంశాలను మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలిసి ఉంటుంది.
రాష్ట్రాలకు కేంద్రం డబ్బులిచ్చే పరిస్థితి లేనందున అప్పు తీసుకోమని సూచించింది. అందుకోసం ఎఫ్ ఆర్ బి ఎం నిబంధనలను సడలిస్తున్నట్టు కేంద్రం చెప్పింది. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా ఈ సడలింపులని ఇచ్చింది.
ఎఫ్ ఆర్ బి ఎం చట్టం ప్రకారం ద్రవ్య లోటులో మూడు శాతం మేర అప్పు చేసే వీలుంటుంది. కరోనా నేపథ్యంలో ఈ పరిమితిని పెంచారు. కానీ దానికోసం ప్రభుత్వం కొన్ని కండిషన్స్ ని పెట్టింది. వాటిలో ప్రజల పై ప్రాపర్టీ టాక్స్, ఇతరాత్రా పన్ను భారాలను పెంచడం, విద్యుత్ సంస్కరణలను చేయడం వంటివి కీలకం.
ఇలా విద్యుత్ సంస్కరణలకు గనుక పూనుకుంటే ప్రజలపై ఆర్థికంగా భారం పడుతుందనే కేసీఆర్ కేంద్రం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పులేకపోతే రోజు గడవని స్థితి. కాబట్టి జగన్ అప్పు చేయడం కోసం కేంద్రం ఆంక్షలకు తలొగ్గినట్టుగా కనబడుతుంది.
అందుకోసమే జగన్ ఇప్పుడు ఇలా పుంపు సీట్లకు మీటర్లను బిగిస్తున్నాడని, భవిష్యత్తులో సంస్కరణల పేరిట ఉచిత విద్యుత్ లో అనూహ్యమైన మార్పులను చూడాల్సి వస్తుందని, విద్యుత్ ఆపై రైతులకు భారమవుతుందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.