కోర్టుల బ్రేక్ లు: జగన్ మూడు రాజధానుల సుదూర స్వప్నం
హైకోర్టు విచారణపై స్టే తెచ్చుకునేందుకు సుప్రీమ్ కోర్టుకు వెళ్లినప్పటికీ.... సుప్రీమ్ అందుకు నిరాకరించింది. నిరాకరించడంతోపాటు కొన్ని కీలక వ్యాఖ్యలను చేసింది
మూడు రాజధానుల విషయంలో జగన్ ఎంత దూకుడుతో ముందుకు వెళదామనుకుంటున్నాడో.... కోర్టులు కూడా అదే స్థాయిలో బ్రేకులు వేస్తున్నాయి. సాధ్యమైనంత త్వరగా ఈ మూడు రాజధానులను ఏర్పాటు చేసేస్తే ఒకపనైపోతుందనుకుంటున్న వైసీపీ సర్కార్ ఆశ ఇప్పట్లో తీరేలా కనబడడం లేదు.
హైకోర్టు విచారణపై స్టే తెచ్చుకునేందుకు సుప్రీమ్ కోర్టుకు వెళ్లినప్పటికీ.... సుప్రీమ్ అందుకు నిరాకరించింది. నిరాకరించడంతోపాటు కొన్ని కీలక వ్యాఖ్యలను చేసింది సుప్రీంకోర్టు. హైకోర్టు విచారణలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పడంతోపాటుగా... హైకోర్టుఇచ్చిన స్టేటస్ కో ను వెకేట్ చేయలేమని కూడా పేర్కొంది.
అంతే కాకుండా.... ఒక డెడ్ లైన్ లోగా కేసును పూర్తి చేయమని తాము హైకోర్టును సైతం ఆదేశించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. సాధ్యమైనంత త్వరగా ఈ కేసును హైకోర్టు పూర్తి చేస్తుందని తాము ఆశిస్తున్నామని మాత్రమే తెలిపింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను గనుక నిశితంగా గమనిస్తే... హైకోర్టు విచారణ పూర్తయ్యేంతవరకు ఈ మూడు రాజధానుల అంశంలో సుప్రీమ్ ద్వారాలు మూసుకున్నట్టే.
ఇక నిన్న హైకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు పెద్దగా విచారణ జరగకుండానే సెప్టెంబర్ 21 వ తేదికి వాయిదా వేసింది ధర్మాసనం. సుప్రీమ్ ఆశించినట్టే కేసు విచారణను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయడానికి వీలుగా సెప్టెంబర్ 21 నుండి రోజువారీ విచారణ చేపడతామని తెలిపింది.
ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ కేసు విచారణ నేరుగా జరిగేలా చూస్తామని హైకోర్టు తెలిపింది. వాస్తవంగా ఈ కరోనా వైరస్ కారణంగా జగన్ నిర్ణయానికి అనుకోకుండా బ్రేకులు పడుతున్నాయి. ఈ కేసు విచారణ ఇన్ని దఫాలుగా వాయిదా పడడానికి ఈ వర్చువల్ సమావేశాలు కూడా ఒక కారణం.
ఇక ఇప్పుడు సెప్టెంబర్ 21 నుండి నేరుగా విచారణ ప్రారంభమవుతుందని అంటున్నారు. అప్పటి కరోనా కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకునే బహుశా విచారణ నేరుగా ప్రారంభమవుతుందా లేదా అనే విషయం తేలుతుంది. ఒకవేళ నేరుగా సాధ్యపడకున్నప్పటికీ... వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారానయినా రోజువారీ విచారణ అయితే జరుగుతుంది.
రోజువారీ విచారణ గనుక ప్రారంభమయితే... కేసు విచారణ వేగవంతం అవుతుంది. ఒకింత ఇది గుడ్ న్యూసే. కోర్టు రోజూవారిన విచారణ జరిపినప్పటికీ... విచారణ పూర్తయ్యాక జడ్జిమెంట్ ను రిజర్వు చేయాల్సి ఉంటుంది. తీర్పును న్యాయమూర్తులు విపులంగా రాయాల్సి ఉంటుంది కాబట్టి ఇలా తీర్పును రిజర్వు చేస్తారు.
ఈ ప్రహసనం అంతా సూపర్ స్పీడ్ గా సాగినా కనీసం మరో మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టవచ్చు. అంటే... ఈ సంవత్సరం చివరి వరకు ఈ తీర్పు వెలువడే అవకాశం తక్కువ. ఒకవేళ తీర్పు వెలువడ్డప్పటికీ... ఇరు పక్షాల్లో ఎవరో ఒకరు సుప్రీమ్ తలుపు తడతారు.
ప్రభుత్వమైనా, అమరావతి రైతులైనా ఎవరైనా సరే కింద కోర్టులో తమకు అన్యాయం జరిగిందని భావించినప్పుడు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే వీలుంటుంది. ఇరు పక్షాల్లో ఎవరో ఒకరు సుప్రీమ్ కోర్టుకు వెళతారు. సుప్రీమ్ కోర్టులో మరల విచారణ ప్రారంభమయ్యాక అక్కడ కూడా ఇదే స్టేటస్ కో ని విధించే ఆస్కారం ఉంది.
సుప్రీమ్ గనుక స్టేటస్ కో విధించకపోతే మూడు రాజధానుల బిల్లు అమలయిపోతుంది. రాజధాని తరలింపు జరిగాక కోర్టు తీర్పుతో ప్రయోజనం ఏముంటుంది. ఒకవేళ కుదరదు అంటే... అప్పుడు తిరిగి వెనక్కి తరలించడమంటే... ప్రజా ధనం, సమయం వృధా అవుతాయి. కాబట్టి స్టేటస్ కో విధించే ఆస్కారం ఉంటుంది.
ఇక నిన్న హైకోర్టులో అమరావతి రైతుల తరుఫున వాదిస్తున్న లాయర్ మరో అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. విశాఖపట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం అతిథి గృహన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారని ఢిల్లీకి చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది నితీష్ గుప్తా కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఎగ్జిక్యూటివ్ రాజధానిని విశాఖపట్టణంలో ఏర్పాటు చేసే ఉద్దేశ్యంతోనే ఈ నిర్మాణం చేపడుతున్నారని ఆయన ఆ పిటిషన్ లో ఆరోపించారు.
ప్రభుత్వం ఈ విషయమై జీవో ను జారీ చేసి ఆ భూమిని విశాఖ కలెక్టర్ కు బదలాయించినప్పటికీ.... కోర్టు ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. మున్ముందు కాలంలో ఈ విచారణ ఎలా సాగుతుందో, ఇంకేవైనా కొత్త అంశాలు కూడా తెర మీదకు వస్తాయా అనేది మున్ముందు తేలుతుంది. చూడబోతుంటే 2020 లో జగన్ మూడు రాజధానుల ముచ్చట మాత్రం తీరేలా కనబడడం లేదు.